సుబ్బరామన్న సుడి తిరుగుతుందా… !!

విశాఖ పార్లమెంట్ సీటుకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు తెన్నేటి విశ్వనాధం నుంచి ఉత్తరాంధ్ర టైగర్ ద్రోణం రాజు సత్యనారాయణ, రాజకీయ దిగ్గజం భాట్టం శ్రీరామమూర్తి వంటి వారు ఎంపీలుగా పనిచేసిన స్థానం ఇది. అటువంటి స్థానం మూడు దశాబ్దాలుగా వలస జిల్లాల నేతల పరమైంది. గోదావరి జిల్లాకు చెందిన మూర్తి రెండు సార్లు, కేరళ రాష్ట్రానికి చెందిన ఉమా గజపతిరాజు ఒకమారు, నెల్లూరుకు చెందిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఒకమారు, ప్రకాశం జిల్లాకు చెందిన దగ్గుబాటి పురందేశ్వరి, అదే జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు హరిబాబు ఒకసారి విశాఖ ఎంపీలయ్యారు.

ఆ సీటుపై మోజు…..

ఇక విశాఖను తన సొంత జిల్లాగా టి సుబ్బరామిరెడ్డి దత్తత తీసుకున్నారు. పుట్టిన రోజులు, శివరాత్రి వేడుకలు అన్నీ ఇక్కడే జరుపుకుంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు సార్లు విశాఖ నుంచి ఎంపీ అయ్యారు. అయితే ఆ రెండు సార్లూ ఏణ్ణర్ధం కాలానికే ప్రభుత్వాలు పడిపోవడంతో పూర్తి కాలం ఎంపీగా ఆయన కొనసాగలేకపోయారు. ఇక ఆ తరువాత నుంచి మూడు విడతలుగా రాజ్యసభ సభ్యునిగా పనిచేస్తున్న సుబ్బరామిరెడ్డికి విశాఖ లోక్ సభ నుంచి గెలవాలన్న ఆశ మాత్రం పోలేదు. ఇక అప్పట్లో విభజన తరువాత విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీకి తిరస్కరించిన టీఎస్సార్ ఈ మారు మాత్రం రెడీ అంటున్నారు.

పొత్తులపై ఆశ…..

ఓ వైపు కాంగ్రెస్ టీడీపీ పొత్తులు పెట్టుకుంటాయన్న అంచనాలు ఉండడంతో టీఎస్సార్ పోటీకి సై అంటున్నట్లుగా చెబుతున్నారు. పార్టీ బలం, తన వ్యక్తిగత ఇమేజ్, టీడీపీ పొత్తుల సాయంతో గెలుపు ఖాయమన్న అభిప్రాయంతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీతో మంచి సాన్నిహిత్యం ఉన్న టీఎస్సార్ ఈ సీటు కోరితే చంద్రబాబు సైతం అభ్యంతరం పెట్టకపోవచ్చునని అంటున్నారు. మరో వైపు బాబుతోనూ టీఎస్సార్ కి మంచి స్నేహం ఉండడం కూడా ఉపకరిస్తుందని చెబుతున్నారు.

వైసీపీకి ఇబ్బందేనా….

టీఎస్సార్ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఇక్కడ నుంచి పోటీకి దిగితే మాత్రం వైసీపీకి కష్టాలు తప్పవని అంటున్నారు. వైసీపీ తరఫున పెద్దగా పరిచయం లేని రియల్టర్ ని జగన్ బరిలోకి దింపాలనుకుంటున్నారు. ఓ వైపు జనంలో పేరున్న సుబ్బరామిరెడ్డి పోటీగా ఉంటే వైసీపీకి గెలుపు అసాధ్యమేనని అంటున్నారు. మరి టీఎస్సార్ ని నిలువరించే క్యాండిడేట్ ని అపుడు వైసీపీ చూసుకోవాల్సిఉంటుంది. ఇక టీఎస్సార్ రంగంలో ఉంటే అసెంబ్లీ సీట్లకు కూడా అది ఉపయోగపడుతుందని, ఆ ప్రభావంతో గెలిచేయవచ్చునని కూడా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*