దినకరన్, ఆళగిరి సేమ్ టు సేమ్…!

ఇల్లు అలకగానే పండగ కాదంటున్నారు ఆళగిరి. పార్టీ అధ్యక్షుడయినంత మాత్రాన సరిపోదని, దానిని సమర్థవంతంగా నడిపే శక్తి, సామర్థ్యాలు కావాలంటున్నారు. కరుణానిధి కుమారులు ఆళగిరి, స్టాలిన్ ల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. తనకు అన్నలేడని, కేవలం సోదరి మాత్రమే ఉందని స్టాలిన్ అంటుంటే, తనను డీఎంకేలో చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు చూడక తప్పదని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కు హెచ్చరికలు పంపారు. ఇలా అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రమయింది. డీఎంకే నేతలందరికీ స్టాలిన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 5వ తేదీన జరిగే ర్యాలీలో పాల్గొంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని హెచ్చరికలు పంపారు.

రెండు విషయాల్లో క్లారిటీ…..

ఇదిలా ఉండగా ఆళగిరి రెండు విషయాల్లో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి తాను వచ్చే నెల 5వ తేదీన చెన్నైలో జరపెట్టిన ర్యాలీని సక్సెస్ చేసుకోవడం. దీని ద్వారా స్టాలిన్ కు మాత్రమేకాకుండా పార్టీలోని అందరికీ తన బలమేంటో చూపించడం. తద్వారా డీఎంకేలో అసంతృప్తిగా ఉన్న స్టాలిన్ వర్గీయులను ఆకర్షించడం. రెండోది త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయడం. డీఎంకే అధినేత కరుణానిధి, అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ మరణంతో రాష్ట్రంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయ్యాయి. తిరువారూర్ తిరవరన్ కుండ్రంలో ఉప ఎన్నికలకు ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించకపోయినా, త్వరలోనే జరిగే అవకాశముంది. అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లో భర్తీ చేయాల్సి ఉండటంతో త్వరలోనే ఈ రెండింటికి నోటిఫికేషన్ విడుదలవుతుందని అనుకుంటున్నారు.

తిరువారూర్ నుంచి…..

దీంతో ఆళగిరి కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కరుణానిధికి ఇష్టమైన నియోజకవర్గం కావడంతో అక్కడ ఉప ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నారు. తండ్రి వారసుడిగా నిరూపించుకోవడానికి ఇదే మంచి మార్గమని ఆళగిరి భావిస్తున్నారు. కరుణానిధి ఆయన రాజకీయ జీవితంలో అనేక నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 1957లో తొలిసారి పోటీ చేసిన కరుణానిధి కులిత్తరై నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఆ తర్వాత 1962లో తంజావూర్ నియోజకవర్గానికి మారారు. 1971లో చెన్నై నగరంలోనే ఉన్న సైదాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 1977, 1980లో చైన్నైలోని అన్నానగర్, 1989, 1991 ఎన్నికల్లో చెన్నైలోని హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1996, 2001, 2006లో చెన్నైలోని చెపాక్ నియజకవర్గాన్ని కరుణ ఎంచుకుని పోటీచేసి వరుసగా విజయాలను సాధించారు. అయితే 2011లో తిరువారూర్ నియోజకవర్గానికి మారారు. తిరిగి 2016లోనూ తిరువారూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

ఉప ఎన్నికల్లో…..

గత దశాబ్దకాలంగా అనుబంధమున్న తిరువారూర్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆళగిరి నిర్ణయించారు. డీఎంకే సీటు కావడంతో ఖచ్చితంగా స్టాలిన్ కూడా అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంటుంది. స్టాలిన్ తనకుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను బరిలోకి దించాలని యోచిస్తున్నారు. స్టాలిన్ కు ఇప్పుడు కుమారుడి అండదండలు అవసరం. తన తర్వాత రాజకీయాలను కొనసాగించడానికి ఇప్పుడే ఉదయనిధిని రాజకీయాల్లోకి దించాలని భావిస్తున్నారు. అందుకోసం తిరువారూర్ నియోజకవర్గంలో పోటీకి దింపుతారు. ఆళగిరి మాత్రం తాను ఖచ్చితంగా పోటీ చేస్తానని చెబుతున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దినకరన్ ఎలా భారీ మెజారిటీతో విజయం సాధించారో…అదే మళ్లీ తిరువారూర్ లో పునరావృతమవుతుందని ఆళగిరి ధీమాగా ఉన్నారు. అదే జరిగితే తిరువారూర్ వేదికగా అన్నదమ్ముల మధ్య పోరు పీక్ కు చేరుకునే అవకాశముంది. మొత్తం మీద ఆళగిరి దినకరన్ తరహాలోనే తొలుత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించి తర్వాత కొత్త పార్టీ పెట్టాలన్న యోచనలో ఉన్నారు. కాని తాజాగా ఆళగిరి తనను పార్టీలో చేర్చుకుంటే స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తామని చెప్పడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*