దినకరన్ అదే చేస్తే….??

ttv dinakaran new stratagy in bypolls

తన వర్గానికి చెందిన 18 మంది అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి గెలిపించుకోవాలన్నదే టీటీవీ దినకరన్ ముందున్న అతి పెద్ద సవాల్. అన్నాడీఎంకే బహిష్కరించడంతో మేనత్త శశికళ సూచనలతో అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని దినకరన్ స్థాపించిన సంగతి తెలిసిందే. తాను ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత దినకరన్ కొత్త పార్టీ ఆలోచన చేశారు. తమవైపు తమిళ ప్రజలు ఉన్నారన్నది ఆర్కే నగర్ ఉప ఎన్నికల ద్వారా స్పష్టమయిందని ఆయన ఈ కొత్త పార్టీ పెట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల సంగతి మాట ఎలా ఉన్నా…తన వెంట వచ్చిన 18 మందిని తిరిగి తాను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఇప్పటికే నియోజకవర్గాల్లో…..

తమిళనాడులో త్వరలోనే 20 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగే అవకాశముంది. ఇంకా తేదీలు ఖరారు కానప్పటికీ లోక్ సభ ఎన్నికలతో పాటు లేదా ముందుగానే ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సు ఉందంటున్నారు. అదే జరిగితే దినకరన్ కు లోక్ సభ ఎన్నికల కంటే 18 నియోజకవర్గాల ఉప ఎన్నికలే ప్రాధాన్యం. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. దినకరన్ కూడా విడతల వారీగా ఆ యా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వారిలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగా కూడా ఆ ఎన్నికల ఖర్చును భరించేందుకు దినకరన్ సిద్ధమయినట్లు తెలుస్తోంది.

పొత్తు పెట్టుకుంటారా?

అయితే ఈ ఉప ఎన్నికల్లో మిగిలిన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్నది దినకరన్ యత్నంగా ఉంది. ఇటీవల పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళను కలసి తన మనసులో మాటను వెల్లడించారని తెలుస్తోంది. 18 నియోజవకర్గాల్లో గెలవాలంటే డీఎంకే వంటి పార్టీలతో పొత్తుకు సిద్ధమవ్వాలన్నది దినకరన్ ఆలోచన. వారికి లోక్ సభలో తాము మద్దతిచ్చే విధంగా దినకరన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు 18 మందిలో 11 మంది గెలిచినా ప్రభుత్వాన్ని కూలదూసే వీలుంటుంది. తన వర్గం ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రభుత్వం కూలదోసేందుకు, డీఎంకే ప్రభుత్వం ఏర్పాటుకు తాను సహకరించాలన్న యోచనలో దినకరన్ ఉన్నట్లు తమిళనాడులో చర్చ జరుగుతోంది.

స్టాలిన్ అంగీకరిస్తారా…??

ఈ నియోజకవర్గాలన్నీ తమవే కావడంతో తమకు వదిలేయాలని స్టాలిన్ ను దినకరన్ కోరే అవకాశముంది. అయితే స్టాలిన్ ఇందుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఎక్కువ సంఖ్యలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు 18 స్థానాలను దినకరన్ కు వదిలేయడం అవివేకమే అవుతుందన్నది డీఎంకే నేతల వాదన. జయలలిత మరణం తర్వాత మరింత బలం పెంచుకున్న డీఎంకేను ఉప ఎన్నికల్లో దినకరన్ తో పొత్తు పెట్టుకుని బలహీన పర్చవద్దని కొందరు ఇప్పటికే స్టాలిన్ కు సూచించినట్లు సమాచారం. అలాగాకుండా ఆ నియోజకవర్గాల్లో స్నేహ పూర్వకపోటీ అయినా బాగుంటుందని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద త్వరలో జరగనున్న 20 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో దినకరన్ వ్యూహం ఫలిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*