దానికోసమే దినకరన్ వెయిటింగ్…?

ఆయన ఆశంతా దానిపైనే పెట్టుకున్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంపై పగ తీర్చుకోవాలంటే దానికోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై హైకోర్టు తీర్పు ఏ క్షణాన్నైనా వచ్చే అవకాశముంది. ఆ తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందని టీటీవీ దినకరన్ పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. తమ కుటుంబాన్ని అన్నాడీఎంకే నేతలు పార్టీ నుంచి బహష్కరించగానే ఇటీవల అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం అనే పార్టీని దినకరన్ స్థాపించారు. గత ఆరు నెలలుగా దినకరన్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళ డైరెక్షన్ లోనే దినకరన్ పార్టీని నడుపుతున్నారు. ముఖ్యమైన నేతలను శశికళ వద్దకు పంపి ఆమె చేత పార్టీ కోసం పనిచేయాలని చెప్పిస్తున్నారు.

ఏ క్షణంలోనైనా…..

జయలలిత మరణం తర్వాత ఏర్పడిన అన్నడీఎంకేలో అనూహ్య పరిస్థితులు తలెత్తాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పెద్దల సహకారంతో శశికళ కుటుంబాన్ని పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు బహిష్కరించి పార్టీని, గుర్తును తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. తన వెంట నడిచిన 18 మంది ఎమ్మెల్యలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో దీనిపై దినకరన్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఆ కోర్టు తీర్పు ఎప్పుడైనా రావచ్చు. తొలుత ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉండటంతో మూడో న్యాయమూర్తి ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంది.

అవిశ్వాస తీర్మానంతో…..

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే దినకరన్ కు రెండు విధాలుగా లాభం చేకూరుతుంది. తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన వెంటనే పళనిస్వామి ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతారు. ఇందులో పళని ప్రభుత్వం కూలి పోవడం ఖాయమంటున్నారు. అలాగే తీర్పు తమకు అనుకూలంగా వచ్చిన వెంటనే మరికొందరు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని దినకరన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన జిల్లాల్లో తిరుగుతూ క్యాడర్ కు సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ, గుర్తు లేకపోయినా అమ్మ జయలలిత తమ వెంట ఉందని ఆయన ప్రచారంచేస్తున్నారు. మరోవైపు దినకరన్ సభ్యత్వంపైనే దృష్టి పెట్టారు.

అనూహ్య స్పందన……

ఇప్పటికే దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం పార్టీని జనంలోకి తీసుకెళ్లగలిగారంటున్నారు. ఇప్పటికి దాదాపు 75 లక్షల సభ్యత్వాన్ని దినకరన్ చేర్చగలిగారు. ఒకవైపు తమిళనాడులో రజనీకాంత్, కమల్ పార్టీలు వస్తున్నప్పటికీ దినకరన్ పార్టీకి ఊహించని స్థాయిలో సభ్యత్వం పెరగడం పట్ల ఆ పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. అన్నాడీఎంకే జయలలిత ఉన్నప్పుడే ఒకటన్నర కోట్ల మంది సభ్యులు ఉండేవారు. అలాంటిది దినకరన్ ఆరు నెలలు తిరక్క ముందే 75 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్చడంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా ఆలోచనలో పడ్డారు. ఇలా దినకరన్ అన్నాడీఎంకేలో చీలిక తెచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరి టీటీవీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*