దినకరన్ వంటకం ఉడుకుతుందా?

తమిళనాడులో ఈసారి ఎన్నికలు చాలా రంజుగా జరుగుతున్నాయి. అనేక పార్టీలు, అనేక మంది నేతలు…కొత్త పార్టీలు, కొత్త నాయకులు ఇలా తమిళనాడు రాజకీయాలు వచ్చే లోక్ సభ ఎన్నికలు నాటికి రసవత్తరంగా మారనున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే ముందుగానే లోక్ సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కమల్ హసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టి ఇప్పటికే జనంలోకి వెళ్లారు. రజనీకాంత్ పార్టీని ఇంకా ప్రకటించాల్సి ఉన్నా, గ్రౌండ్ వర్క్ మాత్రం వేగంగానే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే, ఆ పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్ పరిస్థితి ఏమిటన్నది అగమ్యగోచరంగా తయారైంది.

చిన్నమ్మ సలహాతోనే….

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జీవించి ఉన్నంతకాలం ఆమె చరిష్మా మీదనే పార్టీ నడిచింది. ఆమె కారణంగానే రెండు దఫాలు వరుసగా విజయాలు సాధించింది. అయితే ఈసారి జయలలిత లేరు. చిన్నమ్మ శశికళ జైలులో ఉన్నారు. ఇప్పుడు అన్నాడీఎంకే ను నడపాల్సింది ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాత్రమే. ఇద్దరికీ చరిష్మా లేదు. ఇమేజ్ లేదు. అమ్మ రెండుసార్లు ముఖ్యమంత్రినిచేసిన పన్నీర్ సెల్వంకే కొద్దోగోప్పో తమిళనాడులో క్రేజ్ ఉందన్నది వాస్తవం. ఇక అన్నాడీఎంకే బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ అమ్మా మక్కళ్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించారు. తమను నమ్మించి మోసం చేసి, పార్టీని, గుర్తును లాక్కోవడంతో పన్నీర్, పళనిని ఇరుకున పెట్టేందుకే చిన్నమ్మ సలహాతోనే దినకరన్ సొంత పార్టీ పెట్టారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో సాధించిన విజయంతో ఆయన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్నారు.

గుర్తు రాకపోయినా…..

రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. అమ్మ పేరిట పెట్టిన పార్టీని సానుభూతితో వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించాలని ఆయన భావిస్తున్నారు. పార్టీ కోసం, రెండాకుల గుర్తుకోసం ఆయన ఇంకా న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. కాని అది సాధ్యం కాదని తేలడంతో తనకు అచ్చి వచ్చిన గుర్తునే ఎంచుకోవాలని దినకరన్ భావిస్తున్నారు. ఆర్కే నగర్ ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించిన ‘‘కుక్కర్’’ గుర్తు పైనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 234 నియోజకవర్గాల్లో అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగం అభ్యర్థులు కుక్కర్ గుర్తుపైనే పోటీ చేస్తారని ప్రకటించారు.

జిల్లాల పర్యటనలతో….

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పన్నీర్, పళనిస్వామిలు తమకు చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. చిన్నమ్మ జైలుకెళ్తూ ఎన్ని వత్తిడులు వచ్చినా పళనిస్వామిని ముఖ్యమంత్రి చేసి వెళ్లారని, కనీసం ఆయనకు కృతజ్ఞత లేకుండా శశికళకు వెన్నుపోటు పొడిచారన్నారు. అలాగే పన్నీర్ సెల్వాన్ని కూడా తాను 2001లో జయలలితకు పరిచయం చేశానని, లేకుంటే తాను అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాడినని ప్రజలకు వివరిస్తున్నారు. పన్నీర్, పళనిలు బీజేపీతో అంటకాగుతూ అమ్మ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద దినకరన్ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు, కుక్కర్ గుర్తుపైనేపోటీ చేయాలని నిర్ణయించడం విశేషం.