అన్నీ ఇచ్చేయ్….నాదేం పోయింది….!

రాష్ట్ర విభజన చేసిన పాపం కడిగేసుకుని తిరిగి పార్టీకి పూర్వవైభవం తేవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతల కలలు నిజమవుతాయా? తిరిగి ఆ పార్టీ ఓటు బ్యాంకు దాని దరి చేరతుందా? ఈసారి ఎన్నికల్లోనైనా శాసనసభలో పార్టీ సభ్యుడు అడుగుపెట్టే పరిస్థితి ఉందా? అంటే ఏమో చెప్పలేం. ఏదైనా జరగొచ్చు….అయితే ఇందులో కాంగ్రెస్ నేతల కృషిని మాత్రం ప్రశంసించకుండా ఉండలేం. రాష్ట్ర విభజన అడ్డగోలుగా చేశారంటూ ఇప్పటికీ కాంగ్రెస్ పై ఆంధ్రప్రజల్లో ఆగ్రహావేశాలు చల్లారలేదు. ఏపీ ప్రజలను ఒప్పించి విభజన చేసి ఉంటే బాగుండేదని, అడ్డగోలుగా అర్థరాత్రి తలుపులు మూసి చేయడం వల్లనే ఏపీ ప్రజలు హర్ట్ అయ్యారన్నది వాస్తవం.

రాష్ట్ర విభజన చేయడంతో…..

అందుకే గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు దక్కలేదు. ఓడిపోయినా డిపాజిట్లు కూడా రాలేదు. దీన్నిబట్టే ప్రజాగ్రహానికి ఆ పార్టీ ఎంత గురయిందో చెప్పకనే తెలుస్తోంది. ఈ నాలుగేళ్ల నుంచి పార్టీని తిరిగి పునాదుల నుంచి పైకి తీసుకురావడానికి కాంగ్రెస్ నేతలు గట్టిగానే ప్రయత్నించారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను నిరసిస్తూ ఆందోళన చేశారు. విపక్షాలతో కలసి ఉద్యమించారు.

చాందీ రాకతో…..

ఇక తాజాగా మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ వచ్చిన తర్వాత పార్టీ కొంత ఊపు వచ్చిందనే చెప్పాలి. ఉమెన్ చాందీ అన్ని జిల్లాలను పర్యటిస్తున్నారు. ఇచ్చిన హామీ ఇవ్వకుండా ఇస్తున్నారు. ప్రత్యేకహోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తొలి సంతకం ఆ ఫైలుపైనే రాహుల్ పెడతారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో కొంత సక్సెస్ అయ్యారు. అలాగే కాపు రిజర్వేషన్లకు కూడా కాంగ్రెస్ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ కు కాపులు పట్టుకొమ్మలన్నారు. అధికారంలోకి రాగానే కాపు రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

అడిగిన వారికి..అడగని వారికీ….

ఇలా హామీలు ఇస్తూనే కాంగ్రెస్ ను వీడిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు ఉమెన్ చాందీ ప్రారంభించారు. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి వాళ్లు పార్టీలోకి వస్తే మరింత బలం పెరుగుతుందని భావించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ రాకతో కాంగ్రెస్ కు ప్రత్యేకించి ఓటు బ్యాంకు రాకపోయినా ఒక ముఖ్యనేత వచ్చారన్నది వాస్తవం. ఇక హర్షకుమార్ అయితే రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలకు కాంగ్రెస్ బహిరంగ క్షమాపణ చెబితేనే పార్టీలో చేరతానని షరతు విధించినట్లు తెలుస్తోంది. అదిసాధ్యం కాదు. ఏపీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెబితే తెలంగాణ ప్రజలను అవమానపర్చినట్లే. అందుకే ఆ క్షమాపణ అనేది జరగదని, పార్టీలో చేరి క్రియాశీలకంగా మారాలని హర్షకుమార్ కు ఉమెన్ చాందీ వర్తమానం పంపినట్లు తెలుస్తోంది. ఇలా కాంగ్రెస్ నిలదొక్కుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*