అంతా ఉండవల్లి స్కెచ్ ప్రకారమే …?

ఆంద్రప్రదేశ్ విభజన జరిగిన తీరుపై నాలుగేళ్ళుగా సుప్రీమ్ కోర్టు లోను వివిధ వేదికలపై పోరాడుతూ వస్తున్నారు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్. దారుణంగా, ఏకపక్షంగా లోక్ సభలో ఏ మాత్రం సంఖ్యాబలం లేకుండా రాజ్యాంగ విరుద్ధంగా విభజించారంటూ ఆయన సొంత పార్టీ తీరునే వ్యతిరేకించి ఆ పార్టీ నుంచి బహిష్కృతుడై తాను నమ్మిన సత్యాన్ని ప్రచారం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని చర్చను లేవదీశారు. గత నాలుగేళ్ళుగా సుమారు 100 మీడియా సమావేశాలు ఉండవల్లి పెడితే అందులో సగానికి పైగా పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్, బిజెపి లు ఏపీకి చేసిన అన్యాయాన్ని కడిగేస్తూ వచ్చారు. ఈ ప్రయాణంలో అనేక విమర్శలను నేతలనుంచి, ప్రజల నుంచి కూడా ఎదుర్కొన్నారు ఉండవల్లి. పార్లమెంట్లో అప్పుడేమి చేయకుండ బయటకు వచ్చి ప్రచార కండూతితో ఇవన్నీ చెబుతున్నారంటూ ఇప్పటికి అనేక మంది అరుణ కుమార్ పై వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.

ముందు వైసిపికి దిశా నిర్దేశం …

పార్లమెంట్ లో విభజనపై నోటిస్ ఇచ్చి చర్చించండని వైసిపికి పదేపదే చెబుతూ వచ్చారు ఉండవల్లి అరుణ కుమార్. కానీ ఆ పార్టీ బిజెపికి లోపాయికారి మద్దత్తు కొనసాగిస్తూ వస్తున్న నేపథ్యంతో పాటు ఐదుగురు ఎంపీలు మాత్రమే ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో ఆయన కోరిక నెరవేరలేదు. అయినా ప్రతి పార్లమెంట్ సెషన్ కి హాజరైన అరుణ కుమార్ అక్కడ కనిపించే ఎపి టిడిపి, వైసిపి ఎంపిలను వివిధ పార్టీల ఎంపిలను కలిసి నాటి అశాస్త్రీయ రాజ్యాంగ విరుద్ధ విభజన పై చర్చ జరిపి, జరిగిన అన్యాయం దేశవాసుల దృష్టికి తేవాలని అభ్యర్ధించే వారు. వైసిపి, టిడిపి ఎంపీలు దీనిపై సైలెంట్ అయితే దేశంలోని ఇతర పార్టీల ఎంపీలు మీ వారికి లేని బాధమాకెలా అన్నట్లు చెప్పడంతో ఆయన నిరాశ పడలేదు. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా ప్రతి సెషన్ కి హాజరయ్యి తన గోడు వెళ్ళబోసుకుంటూ సుప్రీం కోర్ట్ లో విభజన కేసు స్టేటస్ పరిశీలిస్తూ వస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పిలుపుతో మారిన సీన్ …

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వివాదాంపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఉండవల్లి అరుణ కుమార్ ను తాను ఎంపిక చేసిన ప్రముఖుల్లో ఒకరిగా పిలిచారు. ఆ అవకాశాన్ని చక్కగా వాడుకున్నారు ఉండవల్లి. పవన్ నోటి తో కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలనే డిమాండ్ ను ఆయన వినిపించేలా చేశారు. అది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్ట్టించింది. ఎవరు అవిశ్వాసం ప్రతిపాదించడానికి ముందుకు వచ్చినా అందుకు అవసరమైన 50 మంది ఎంపీల మద్దత్తు కూడగడతానంటూ పవన్ ఆఫర్ ఇవ్వడం అధికార విపక్షాలను రింగ్ లోకి లాగేలా చేసింది. దాంతో ఆనాటి నుంచి మోడీ సర్కార్ పై అవిశ్వాసం అనే చర్చ రచ్చ రచ్చ గా నడిచింది. దీనిపై వైసిపి తొలుత పార్లమెంట్లో నోటిస్ ఇవ్వడం, ఆ వెనుకే టిడిపి, వీరికి మద్దత్తుగా కాంగ్రెస్ సిద్ధం కావడంతో కీలకమైన ఆ సమావేశాల్లో బిజెపి సభ ఆర్డర్ లో లేదంటూ స్పీకర్ తోసిపుచ్చేలా చేస్తూ వచ్చింది. మొత్తం సెషన్ అంతా ఇలాగే నడిచి పార్లమెంట్ సమావేశాలపై ప్రజల్లో అసహనం, అసంతృప్తి కలిగేలా అన్ని పక్షాల వ్యవహారం సాగింది.

ఉండవల్లి లేఖకు స్పందించిన బాబు …

నాలుగేళ్ళుగా మాజీ ఎంపీ ఉండవల్లి రాసిన ఏ లేఖకు స్పందించని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎట్టకేలకు ఆయన తాజా లేఖను స్వాగతించి తనతో భేటీకి ఆహ్వానించారు. పార్లమెంట్లో టిడిపి అనుసరించాలిసిన వ్యూహాన్ని ఉండవల్లి తో చర్చించారు చంద్రబాబు. ఆయన సూచనలు తీసుకున్నారు. గంటన్నరకు పైగా సుదీర్ఘంగా చర్చించారు వీరిద్దరూ. అవిశ్వాసం చర్చకు రాకపోయినా ఏ నిబంధనల పేరుతో చర్చ జరపాలన్న అంశాలు చర్చించారు. విభజన బిల్లు జరిగిన తీరు, హామీల అమలుపై బిజెపిని కాంగ్రెస్ ను ఎలా దోషులుగా నిలబెట్టాలో రాజ్యాంగ విరుద్ధ ఉల్లంఘనలు ఎలా నిస్సిగ్గుగా జరిగాయో ముఖ్యమంత్రి కి సవివరంగా ఆధారాలతో అందించారు ఉండవల్లి. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఉండవల్లి తాను సేకరించిన రికార్డ్ ఎవిడెన్స్ ద్వారా సుప్రీం లో కూడా అఫిడవిట్ ప్రభుత్వం తరపున దాఖలు చేయాలని కూడా కోరారు.

ఇక వైసిపి ఎంపీల రాజీనామాలు ఆమోదించాకా మొదలైన వర్షాకాల సమావేశాలకు బిజెపి సర్వ సన్నద్ధమై అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి సై అంది. అలా నడిచిన ఈ ఎపిసోడ్ మొత్తానికి కర్త కర్మ క్రియ మాత్రం ఉండవల్లి కావడం విశేషం. సత్యమేవ జయతే అంటూ ఆయన సాగించిన సుదీర్ఘ పోరాటానికి ఇప్పుడు పార్లమెంట్ వేదికగా ఏమి జరగబోతున్నది అన్నది శుక్రవారం తేలిపోనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*