ఉండవల్లి వ్యూహం ఉల్టా అయ్యిందా …?

బాల్ స్పిన్ తిప్పి కాంగ్రెస్, బిజెపి వికెట్లు ఒకే దెబ్బకు తీసేయాలని టిడిపి అధినేతకు కోచింగ్ ఇచ్చారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్. కానీ టిడిపి వైడ్ , నో బాల్స్ వేసి ప్రత్యర్థికి అడ్వాంటేజ్ ఇచ్చేసింది. రాజ్యాంగ విరుద్ధ ఆంధ్రప్రదేశ్ విభజన లో దోషులను దేశం ముందు నిలబెట్టి పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ఉండవల్లి ఆశించారు. చర్చ ఆ దిశగా నడిపితే కాంగ్రెస్, బిజెపి నాడు చేసిన తప్పులు ఒకరికొకరు బయటపెట్టుకుంటారని ఉండవల్లి భావించారు. కానీ టిడిపి ఎంపీలు తమపంధాలో తాము పోయారు తప్ప లోతుగా నాటి ఘోరాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పడంలో విఫలం అయ్యారు. దాంతో కాంగ్రెస్ ముక్తసరిగా ఎపికోసం ప్రస్తావిస్తే బిజెపి నేతలు రాజకీయ ప్రసంగాలతో చర్చను పూర్తి స్థాయిలో పక్కదారి పట్టించేశారు.

ఆఖరి ప్రయత్నంలో ఉండవల్లి …

టిడిపి ఎంపీలతో టచ్ లో వున్న ఉండవల్లి ఈ వర్షాకాల సమావేశాల్లో ఎన్ని అవకాశాలు వస్తే అన్ని ఉపయోగించుకోవడానికి పార్లమెంట్లో వున్న నిబంధనలు వారికి తెలియచేసే పనిలో బిజీగా వున్నారు. అవిశ్వాసం పై జరిగిన చర్చలో ఎపి పేచేయి…. సాధించలేకపోయిందనే ఆవేదనలో వుండవల్లి వున్నారు. దాంతో సమావేశాలు చివరివరకు ఏపీ ఎంపీలు రంగంలో వుండే అలుపెరగని పోరాటం సాగించాలని అరుణ్ కుమార్ పిలుపునిస్తున్నారు. ప్రధాని గత సమావేశాల్లో వాయిదా తీర్మానంపై మాట్లాడుతూ తలుపులు మూసి మరీ కాంగ్రెస్ ఎపికి ద్రోహం చేసిందని వారు రాజేసిన నిప్పులు చల్లారడం లేదని పేర్కొన్నారని అరుణ కుమార్ గుర్తు చేస్తున్నారు.

ఉక్కిరి బిక్కిరి చేయాలని…..

అగ్నిగుండంగా ఎపి వాసుల హృదయాలు చల్లార్చే స్థితిలో వున్నా ఆయన మాత్రం చిద్విలాసంగా ఈ పరిణామాలు చూస్తూ ఉండటాన్ని ఉండవల్లి తప్పుపడుతున్నారు. అవిశ్వాసం పై చర్చలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునే ప్రక్రియ చేపట్టాలని సూచిస్తున్నారు. కేంద్రాన్ని పార్లమెంట్ వేదికగానే ఉక్కిరి బిక్కిరి చేయాలని ప్రశ్నోత్తరాలనుంచి అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుతున్నారు ఉండవల్లి. చంద్రబాబు సైతం ఇప్పటికే తమ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశించారు. పార్లమెంట్ లోపలా వెలుపలా పోరాటం చేయాలని సూచించడంతో బాటు ఏపీలో ఆందోళనలు పార్టీ పరంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎపి టిడిపి ఎంపీలు లోక్ సభను వినియోగించుకునే తీరును దేశవాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*