వెంటాడుతున్న ఉండవల్లి

ఏపీ సర్కార్ లో కీలకమైన భూమిక వహిస్తూ మీడియా ముందు ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఇటీవల కాలంలో ఆయన చాలా హైలెట్ అవుతూ వస్తున్నారు. ఆయనే ఎపి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు. ఇప్పుడు ఆయన పై మాటల దాడి తీవ్రం చేశారు ఏపీ ఫైర్ బ్రాండ్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్. అమరావతి బాండ్ల జారీతో ప్రజలకు బ్యాండ్ బాజా మోగిస్తున్నారంటూ ఉండవల్లి చెప్పిన లెక్కలను, ఆరోపణలను, విమర్శలను తిప్పికొడుతూ కుటుంబరావు మీడియా లో ఫైర్ అయ్యారు. అమరావతి బాండ్లు , రాజా ఆఫ్ కరపక్షన్ పుస్తకంపై చర్చకు రావాలంటూ ఉండవల్లికి సవాల్ సైతం చేశారు. దీన్ని అందిపుచ్చుకున్నారు ఉండవల్లి.

వెనుకంజ వేస్తున్న కుటుంబరావు …?

అరుణ కుమార్ సవాల్ ను స్వీకరించాక ఆయన లేవనెత్తిన అనేక అంశాలకు వివరణ ఇచ్చిన కుటుంబరావు చర్చ అంశంపై రెండు విధాలుగా స్పందించారు. టిడిపి తరపున ఇచ్చిన నోట్ లో చర్చకు సిద్ధమని, టిడిపి అనుకూల మీడియా లో మరోలా స్పందించడంతో ఉండవల్లి మళ్ళీ రంగంలోకి దిగిపోయారు. కుటుంబరావు పై తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. కులం కోసం ఎవరు మాట్లాడారంటూ ఆయన కులాన్ని ఛీఛీ అన్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పుకొచ్చారు. మరోసారి వేదిక సమయం నిర్ధారిస్తే ఎవరు లేకుండా ఎవరి కెమెరా వాళ్ళు తెచ్చుకుని రహస్యంగా చర్చిద్దామన్నారు ఉండవల్లి.

బిగ్ బాస్ తరహాలో …

ఇటీవల పాపులర్ అయిన బిగ్ బాస్ టివి షో తరహాలో చర్చ జరిగితే నిజాలు ప్రజలకు తెలుస్తాయన్నారు ఉండవల్లి. అమరావతి బాండ్లు కొన్న 9 మందికి తప్ప ఎవరికీ లాభం తెచ్చేవి కావని అదీకాక రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలు ఈ అప్పును కట్టుకోవాలన్నారు. అమ్మ పెట్టా పెట్టదు…. అడుక్కు తిననివ్వదు అంటున్న చంద్రబాబు ఆడి కారులో వెళ్ళి భవతి బిక్షం దేహి అంటే ఛీ అవతలకు పో అంటారని, ఆయన తీరు అలానే ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆయన. ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ రాష్ట్రాన్ని అధోగతి నుంచి ఆదుకోవాలంటే ఎవరు సాయం చేస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. హడ్కో 8 శాతం లోపు వడ్డీకిస్తేనే సంతకం పెడతామని చెప్పినవారు 10.33 శాతం వడ్డీకి ఎలా అప్పు తెచ్చారని నిలదీశారు. చంద్రబాబు ఎప్పుడెప్పుడు ఎంత ?ఎంత? అప్పు ఏ వడ్డీకి తెచ్చారో లెక్క ల చిట్టా విప్పారు మాజీ ఎంపి.

మని టేకింగ్ కి మేకింగ్ కి తేడా తెలియదా ….?

రాజకీయాల్లో వున్న ప్రతిఒక్కరు మని టేకింగ్ చేస్తారని అది తనతో సహా అందరు చేసేదే అని కానీ చంద్రబాబు సచ్ఛీలురు కనుక ఎవరిదగ్గర ఎప్పుడు రూపాయి తీసుకుని ఉండరని ఎద్దేవా చేశారు అరుణ కుమార్. టేకింగ్, మేకింగ్ లకు అర్ధం తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నానని కుటుంబరావు చెప్పడం హాస్యాస్పదమన్నారు. సీఆర్డీఏ ఏర్పాటు చేసింది క్యాపిటల్ కోసమా ? వ్యాపారం కోసమా అన్నది తేల్చాలని కంపెనీ కింద దాన్ని మార్చుకుని వ్యాపారం చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదని, అలా కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ తాకట్టు పెట్టడం సరికాదన్నారు.

ఏదీ నిరూపించలేం …

అవినీతికి రశీదులు ఉండవని ఏది నిరూపించలేమన్నారు ఉండవల్లి. తప్పులు చేసే వారు అన్ని పక్కాగా చూసుకునే చేస్తారని లేకపోతే అధికారుల ఉద్యోగాలు పోతాయన్నారు. తమకు కావలిసిన వారికి టెండర్లు ఎలా ఇవ్వాలో అధికారంలో ఉండేవారికి బాగా తెలుసునని, కనుక వీటి వెనుక అవినీతిని నిరూపించలేమన్నారు. అన్ని రూల్ ప్రకారం నమోదు చేసే సొమ్ములు నొక్కేస్తారన్నారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డొంకతిరుగుడు మాటలెందుకని తనకన్నా ఆయన అన్ని విధాలా సమాధానం చెప్పగల సత్తా వున్న కుటుంబరావు చర్చకు అంగీకరించి రావాలన్నారు.

ఆరు అంశాలు… వారం గడువు …

కుటుంబరావు తో చర్చకు ఆరు ప్రధాన అంశాలను ఉండవల్లి ప్రతిపాదించారు. 1. బాండ్లు , 2. పోలవరం , 3. రాష్ట్రంలో జరిగిన అన్ని పంపింగ్ స్కిం లపై చర్చ 4. పేదలకు పక్కా గృహాల్లో జరిగిన అవినీతి , 5 రాజా ఆఫ్ కరపక్షన్ 6. రాష్ట్రంలో 18 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు వచ్చాయా లేదా అన్న అంశం .తాజాగా అమరావతి బాండ్ల జారీపై చర్యలు లేనిపక్షం లో సెబీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు ఉండవల్లి . ఈ 18 లక్షల రూపాయల విలువైన పరిశ్రమలు ఎక్కడ పెట్టారో ? పెట్టబోతున్నారో? చూసి వచ్చేందుకు తన మిత్రుడి హెలికాఫ్టర్ అద్దెకు తెస్తానని ఉండవల్లి కుటుంబరావు కి ఆఫర్ చేశారు. వారం రోజుల్లో చర్చకు సిద్ధం కావాలని చర్చలో తాను చేసిన ఆరోపణలు తప్పులని తేలితే క్షమాపణ కోరేందుకు సిద్ధమన్నారు ఉండవల్లి.