అందుకే జగన్ సీఎం కావాలనుకుంటున్నా …!!

ఏపీ ఫైర్ బ్రాండ్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు ను ఒక రేంజ్ లో ఉతికి ఆరేశారు. ఇటీవల ఏపీ విడుదల చేసిన బాండ్లు దగా అంటూ దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి భారం సర్కార్ మోపుతుందో తనదైన శైలిలో ఉండవల్లి కొద్దిరోజుల కిందట వివరించిన సంగతి తెలిసిందే. దానిపై ఏపీ ప్రభుత్వం తరపున కుటుంబరావు ఉండవల్లి పై విరుచుకుపడ్డారు. ఆయన ఒక పేపర్ టైగర్ అని, వైఎస్ చేసిన అవినీతి ఆయనకు కనపడలేదా అని, పార్లమెంట్ లో ఆయన విభజన సమయంలో చేసిందేమీ లేదని, రామోజీ రావు పై కేసులో సైతం స్టే తెచ్చుకున్నారంటూ ఫైర్ అయ్యారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలంటూ కూడా కుటుంబరావు ఉండవల్లి కి సవాల్ విసిరారు.

సవాల్ ను స్వీకరించిన ఉండవల్లి …

కుటుంబరావు సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు ఉండవల్లి. గతంలో వైఎస్ పై టిడిపి వేసిన పుస్తకాలపై చర్చకు రెడీ అన్నారు. అలాగే అమరావతి భూముల బాగోతం, మార్గదర్శి కేసు వ్యవహారం, ఎపి బాండ్లు ప్రజలకు ఎలా బ్యాండ్ కాబోతున్నాయో ఆధారాలతో నిరూపిస్తానని అన్నారు. విభజన సమయంలో పార్లమెంట్ లో తాను ఏమి చేసిందీ వెల్లడిస్తా అని చెప్పారు. పేపర్ టైగర్ అనడం అలవాటుగా మారిపోయిందని మీరు రియల్ టైగర్ల అంటే క్రూర మృగాలా అంటూ సెటైర్ వేశారు. కుటుంబరావు తనపై లేవనెత్తిన ప్రతి అంశం పైనా చర్చకు సిద్ధమని అన్నారు ఉండవల్లి.

చంద్రబాబు ను అందుకే కలిశా …

ఏ పార్టీతో సంబంధం లేకుండా ప్రస్తుతం రాజకీయాల్లో వున్న తనకు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిశానని వివరించారు. అయితే అవిశ్వాసం సమయంలో ఆయనకు చెప్పిన ఏ పని చేయలేదని, టిడిపి ఎంపీలు సైతం ఇందులో విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. కేశినేని నానికి తాను స్వయంగా రాతపూర్వకంగా కొన్ని కీలక అంశాలు లేవనెత్తాలని రాసిచ్చినా ఆయన ప్రస్తావించలేదని, అవే అంశాలు చంద్రబాబు దృష్టికి ముందే తెచ్చినా పెడచెవిన పెట్టారన్న బాధ తనకు ఉందన్నారు. చంద్రబాబు పై వ్యక్తిగత ద్వేషం ఏమి లేదని ఆయన వ్యవహార శైలితో రాష్ట్రం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మరోసారి ముఖ్యమంత్రి అయినా తనకు వ్యక్తిగతంగా వచ్చిన నష్టం ఏమీ లేదని, లాభం కూడా లేదని, జగన్ పార్టీ మరోసారి ఓడినా బాధ ఉండదన్నారు.

జగన్ సిఎం కావాలని …

రాజశేఖర రెడ్డి ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అభిమానిస్తానని అన్నారు ఉండవల్లి. అందుకే ఆయన కుమారుడు ముఖ్యమంత్రి అయితే తండ్రిలా పాలన చేస్తాడేమో అన్న ఆశ తనకు ఉండటం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. ఇష్టమైన వాళ్ళు దగ్గరగా వుండే వాళ్ళు పైకి రావాలని కోరుకోవడం అందరు చేసే పనే అని తాను అందరిలాంటి వాడినేనని చెప్పారు.

పేపర్ టైగర్ వ్యాఖ్యలపై …

తనను పేపర్ టైగర్ గా కుటుంబరావు ప్రస్తావించడం పై ఉండవల్లి విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో మాట రాతే బ్రహ్మాస్త్రాలని చెప్పారు. దురదృష్టం కొద్ది రాష్ట్రప్రయోజనాలు పార్లమెంట్ సాక్షిగా దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకోలేక తన కంఠ శోష పెట్టాలిసివస్తుందన్నారు. పేపర్ మీద రాసిచ్చిన పార్లమెంట్లో విభజన అన్యాయాలపై ప్రస్తావించలేని దద్దమ్మల పక్షాన కుటుంబరావు మాట్లాడటం విడ్డురమని ఉండవల్లి ఒక రేంజ్ లో రెచ్చి పోయారు. తనకన్నా అన్ని విధాలా ఉన్నత స్థానంలో వున్న తనతో చర్చకు వచ్చి నిజాలు ప్రజలకు తెలిపేందుకు సిద్ధ పడాలని కోరి ప్రార్ధించారు.

వినూత్న ప్రతిపాదన చేసిన  …

గతంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తో కృష్ణా జిల్లాలో బహిరంగ చర్చ కు చేదు అనుభవం ఎదురైన దృష్ట్యా ప్రజల్లో చర్చ జరుగుతుందన్న నమ్మకం పోయిందన్నారు. కనుక ఆయన పిలిచిన చోటికి రమ్మంటే తాను వచ్చేందుకు సిద్ధంగా వున్న అని అలాగే ఆయన రాజమండ్రి వస్తానంటే ఒకే అన్నారు అరుణ కుమార్. ఇద్దరి నడుమ నాలుగు గోడల మధ్య చర్చ కొనసాగేలా ఏర్పాటు చేస్తామని కుటుంబరావు తో పాటు తామిద్దరం వాడే సెల్ ఫోన్ల లో ఎవరి రికార్డింగ్ వారు చేసుకుని అన్ని అంశాలపై నిజా నిజాల నిగ్గు తేలుద్దామన్నారు. చర్చ ఎప్పుడు ఎక్కడా అన్న విషయం రహస్యంగా ఉంచి చర్చ పూర్తి అయ్యాకా ఎవరు ఏమి మాట్లాడింది రికార్డ్ చేసిన వీడియో ప్రజలకు విడుదల చేద్దామని సూచించారు ఉండవల్లి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరపున మాట్లాడుతున్న ఆయన అంటే చాలా గౌరవమని చర్చలో తన తప్పులు ఉంటే క్షమాపణ కోరేందుకు సిద్ధమని, అలాగే నిరాధారంగా తాను చర్చకు రానని ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన పత్రాలతోనే అన్ని విషయాలపై నాలుగు ఐదు గంటలు చర్చించేందుకు సై అన్నారు.

ఆయన చర్చకు వస్తారా …? రమ్మంటారా ..?

ఏ అంశం పై అయినా అనర్గళంగా పండితుడి దగ్గరనుంచి పామరుడి దాకా అర్ధం అయ్యేలా మాట్లాడటం ఉండవల్లి కి వెన్నతో పెట్టిన విద్య. ఆయనతో గతంలో అనేకమంది హేమాహేమీలు టివి చర్చల్లో పాల్గొని తమవాదాన్ని సమర్ధించుకోలేక చతికిల పడ్డారు. రాష్ట్ర విభజన లోని లోపాలపై మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ని సైతం ఆత్మరక్షణలో పడేలా గతంలో దుమ్మురేపారు ఉండవల్లి. అలాంటి అరుణ కుమార్ తో బహిరంగ చర్చకు నే రెడీ అని మొదట ప్రకటించిన కుటుంబరావు ఇప్పుడు ముందుకు వస్తారా వెనక్కు పోతారా అన్న ఆసక్తి నెలకొంది. ఇటీవల కుటుంబరావు వాయిస్ ఆఫ్ టిడిపి గా చక్కటి వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం పక్షాన సమర్ధవంత బాధ్యతలు నిర్వర్తిస్తూ సవ్యసాచిగా దూసుకువెళుతు చంద్రబాబు ను సైతం ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి కుటుంబరావు ఛాలెంజ్ కి అంగీకరించిన నేపథ్యంలో వీరిద్దరి నడుమ చర్చ జరుగుతుందా లేక సవాళ్ళు ప్రతిసవాళ్లకు పరిమితం అవుతుందా అన్నది ఆసక్తికరం గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*