మా అమ్మ కోరిక వైఎస్ తీర్చారు….!!!

undavalli-arunkumar-ys-rajasekharreddy

మాటల మాంత్రికుడు ఉండవల్లి అరుణ కుమార్ ప్రసంగాలంటే తెలుగు రాష్ట్రాల్లో మహా క్రేజ్. అలాంటిది ఆయనకు మించి పంచ్ లతో ఉండవల్లి సతీమణి జ్యోతి చేసిన ప్రసంగం వైఎస్సాఆర్ తో ఉండవల్లి అరుణ కుమార్ పుస్తకావిష్కరణ సభలో హైలెట్ గా నిలిచింది. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఇంకా మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మాజీ ముఖ్య ప్రభుత్వ కార్యదర్శులు ఇలా మహామహులంతా పాల్గొన్న ఈ ఆవిష్కరణలో శ్రీమతి ఉండవల్లి అలా మాట్లాడతారని ఎవ్వరు ఊహించలేదు. ఆమె ప్రసంగం ఆద్యంతం నవ్వులు పూయించింది.

పిల్లను ఇవ్వను పొమ్మన్నారు …

తమ పెళ్లికి ముందు జరిగిన జ్ఞాపకాలను ఉండవల్లి జ్యోతి ఇలా చెప్పారు. తమ కుటుంబానికి అరుణ కుమార్ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉండేదని ఆయన తల్లి గారు తన అమ్మగారు మంచి స్నేహితులు కావడంతో తమ మధ్య పరిచయం పెళ్లి వరకు వెళ్లిందని తెలిపారు. తన తండ్రి బ్యాంక్ ఉద్యోగి, తల్లి డాక్టర్ కావడంతో ఏ ఉద్యోగం లేకుండా రాజకీయాలంటూ గాలికి తిరిగే వాడికి ఎలా ఇస్తామని ఇంట్లో నిరాకరించారన్నారు. తమ తల్లితండ్రులు ఆందోళనను తెలిసినవారు బంధువులు జతకలిసి మీ అల్లుడు అక్కడ జెండాలు కట్టిస్తున్నారని రోడ్డుమీదే రోజు ఖాళీగా తిరుగుతు న్నారంటూ చెప్పడంతో తమవారికి తనను ఇచ్చి పెళ్ళి చేసేందుకు చాలా కాలం ఆలోచించారని వెల్లడించారు. ఆ తరువాత తమ ఇద్దరి ఇష్టం ముందు వారి అయిష్టం నెగ్గుకురాలేక పెళ్ళి చేశారని కానీ అప్పటినుంచి తన తల్లి అల్లుడిని ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని ప్రభుత్వ ఉద్యోగం అయితే జీతం పెన్షన్ వస్తాయంటూ అనేక ఉద్యోగాలకు పరీక్షలు రాయించేదని ఉండవల్లి జ్యోతి తమ ఫ్లాష్ బ్యాక్ కష్టాలను నవ్వుతూ చెప్పుకొచ్చారు. అత్తగారి పోరు పడలేక తన భర్త పరీక్షలు రాసినా ఉద్యోగాలు రాలేదని దాంతో తన కొచ్చిన ఉద్యోగం రాజకీయమే అంటూ ఆయన తాను నమ్మిన సిద్ధాంతం తోనే ముందుకు వెళ్లారన్నారు.

మా అమ్మ కోరిక తీర్చిన వైఎస్ …

అయితే తన తల్లి కోరికను మాత్రం వైఎస్ ఆర్ తీర్చారని రెండు సార్లు ఎంపిని చేయడమే కాదు పెన్షన్ కూడా వచ్చేలా చేశారని ఆయనకు తాము రుణపడి ఉన్నామన్నారు. ఇప్పుడు తన తల్లి ఎంతో సంతోషంగా ఉందని చెప్పి నవ్వించారు శ్రీమతి ఉండవల్లి . వైఎస్ , కెవిపి రామచంద్రరావు లు తమ కుటుంబ సభ్యులకన్నా ఎక్కువేనని వారిని తలుచుకొనని రోజు ఉండదన్నారు. వైఎస్ తో ముప్పైఏళ్ళ అనుబంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. కెవిపి తరచూ ఫోన్ చేసేవారని, కాంగ్రెస్ బ్యానర్ల దగ్గరనుంచి అనేక అంశాలపై తన భర్తతో తరచూ సంప్రదించేవారని చెప్పారు జ్యోతి. తాను, తన కుమార్తె బ్యానర్స్ ట్యాగ్ లైన్ లకోసం టైటిల్స్ కోసం ఆయనకు సహకరించేవారమని వివరించారు. ఎప్పుడు వేదికలు ఎక్కి మాట్లాడేందుకు ముందుకు వచ్చేందుకు ఇష్టపడని నన్ను వైఎస్ కోసం నాలుగు విషయాలు చెప్పాలనే మైక్ అడిగానంటూ తమ కుటుంబం రాజశేఖర రెడ్డి పట్ల వున్న ప్రేమ, అభిమానాలను శ్రీమతి ఉండవల్లి చక్కని రీతిలో ఆవిష్కరించి సభికుల మనసు దోచారు

Ram Tatavarthi
About Ram Tatavarthi 815 Articles
Ram has been continuing in the journalism for the past 25 years. He started his career from Samacharam and worked for various print and electronic media houses like Eenadu, Andhra Bhoomi, the evening daily Sandhya, in cable, Andhra Prabha, Citi Cable, TV 9, CCC channel etc.. By having extensive experience in journalism and also by always keeping up to date with the latest technology he is now working as a freelance journalist.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*