ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీకి రాజ‌కీయ పాఠాలు

ప‌క్కా కాంగ్రెస్ వాదిగా ముద్ర‌ప‌డిన రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ 2014 వ‌ర‌కు కాంగ్రెస్‌లో ఉన్నా.. రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆయ‌న త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంబించారు. ఏ పార్టీలోనూ చేర‌కుండా ఇప్ప‌టి వ‌ర‌కు నెట్టుకొచ్చారు. అయితే, ఇటీవ‌ల కాలంలో ఏపీ ప్ర‌త్యేక హోదా స‌హా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఆయ‌న గ‌ళం వినిపిస్తున్నారు. . విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందంటూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలనే ప్రధాన ఆయుధంగా మలచుకొని పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పోరాటం చేయాలని సీఎం చంద్రబాబుకు ఉండవల్లి సూచించారు.

ఇంతకాలం చంద్రబాబును విమర్శించినా…

ఈ ప‌రిణామం రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించింది. చంద్ర‌బాబు అంటే విరుచుకుప‌డే ఉండ‌వ‌ల్లి ఉన్న‌ట్టుండి ఆయ‌న‌కే పాఠాలు నేర్పించేందుకు అమ‌రావ‌తికి వెళ్ల‌డం అంద‌రినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నాలుగేళ్ల‌లో ఉండ‌వ‌ల్లి చంద్ర‌బాబును తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టారు. ప‌ట్టిసీమ ప్రాజెక్టు, రాజ‌ధాని, పోల‌వ‌రం ఇలా ప్ర‌తి అంశంలోనూ బాబును టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వారం రోజుల క్రితం చంద్ర‌బాబును త‌క్క‌వ అంచ‌నా వేయ‌లేం అని.. ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్‌లో ఆయ‌న్ను ఢీకొట్టే శ‌క్తి జ‌గ‌న్ లేద‌ని చెప్పారు.

ఏ పార్టీలో లేనని చెబుతున్నా…

ఇక తాజాగా చంద్ర‌బాబుతో స‌మావేశం అయిన ఉండ‌వ‌ల్లి ఏపీ విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయుధంగా చేసుకుని పోరు సాగించాల‌ని చెప్పారు. అదే స‌మయంలో సుప్రీంకోర్టులో తాను వేసిన వ్యాజ్యం, రాష్ట్రపతి, ప్రధానికి గత ఏడాది తాను రాసిన లేఖల ప్రతులనూ బాబుకు అందజేశారు. రాష్ట్ర విభజన అంశంపైనా, దాని పై మోడీ చేసిన వ్యాఖ్యలపైనా పార్లమెంటు సమావేశాల్లో నిలదీయాలని సీఎంకు సూచించారు. నిజానికి గ‌త కొన్నాళ్లుగా ఉండ‌వ‌ల్లి ఏ పార్టీలోనూ లేన‌ని చెబుతున్నారు. అలాంటిది అక‌స్మాత్తుగా ఆయ‌న చంద్రబాబుతో భేటీ కావడం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. నిజానికి ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చిన నినాదం మేర‌కు పాత కాపులంద‌రూ కాంగ్రెస్‌కు ఏదో ఒక విధంగా మేలు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక‌, ఎన్నిక‌లకు ఇంకా ప‌దిమాసాల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో  సీనియ‌ర్ లాయ‌ర్ అయిన ఉండ‌వ‌ల్లి ఎలాంటి లాజిక్  తో స‌మాధానం చెబుతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*