ఉండవల్లి చేతిలో మరో బాంబు ..?

మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ ఇప్పుడు ఏపిలో ప్రధాన ప్రతిపక్షంగా మారిపోయారు. అధికార టిడిపికి ఆయన కొరకరాని కొయ్యగా వున్నారు. వైసిపి, జనసేన ల విమర్శలు ఆరోపణలను సునాయాసంగా తిప్పికొడుతున్న అధికార పార్టీ ఉండవల్లి అరుణ కుమార్ సంధించే ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నీళ్లు నములుతుంది. తాత్కాలికంగా ఒకరిద్దరు ఆయనను విమర్శించినా ఆయన అడిగిన వాటికి జవాబు చెప్పే ప్రయత్నం చేసినా అవి పస లేకుండా పోతున్నాయి. ఆ తరువాత ఆయన తో యుద్ధానికి సై అంటే సై అనేవారు పత్తా లేకుండా పోతున్నారు. చంద్రబాబు సర్కార్ చేసే పనుల్లో లోపాలను ఎప్పటికప్పుడు వెలికి తీసి మీడియా సాక్షిగా ప్రజల్లోకి తెస్తున్న ఉండవల్లి అరుణ కుమార్ చేతికి ఇప్పుడు బాబు ప్రభుత్వం దోపిడీపై కీలక సమాచారం మరింత లభించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గత నాలుగేళ్ళుగా పోలవరం పై అలుపెరగని పోరాటం చేస్తున్న ఉండవల్లి కి భూసేకరణకు సంబంధించి జరిగిన ఘోరాలు చేతికి సాక్ష్యాలతో అందాయి.

బాధితులు చలో ఉండవల్లి …

సమస్య ఏదైనా వస్తే అధికార పార్టీ పట్టించుకోదు అనుకుంటే బాధితులు విపక్ష నేతలను ఆశ్రయిస్తారు. లేదా కోర్టు ద్వారా పోరాడి న్యాయం కోసం ప్రయత్నం చేస్తారు. కానీ చిత్రంగా ఈ మార్గం లో కాకుండా ఇప్పడు ప్రభుత్వ బాధితులు ఉండవల్లి ని ఆశ్రయించడం చర్చనీయాంశం. తాజాగా పోలవరం లో భూములు, ఇళ్ళు కోల్పోయే నిర్వాశితులు అరుణ కుమార్ మాత్రమే తమకు న్యాయం చేస్తారేమో అంటూ ఆయన పంచన చేరారు. ముఖ్యంగా భూసేకరణలో జరిగిన ఘోరాలు ఎవరికీ చెప్పుకున్నా న్యాయం జరక్కపోవడంతో ఉండవల్లిని తమ ప్రాంతానికి తీసుకువెళ్ళి కోట్ల రూపాయల ప్రజాధనం పట్టపగలే దోపిడీ చేసిన వైనాన్ని కళ్ళకు కట్టేలా చూపించేశారు. సెంటు భూమి లేకుండా కోట్ల పరిహారం, దేవుడు భూమికి సైతం తామే యజమానులమని మరికొందరు కోట్లు కొల్లగొట్టిన వైనాన్ని ఇలా అనేక సాక్ష్యాలను ఆయనకు చూపించి మరి అందించేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం రైతు నాయకులు పలు గ్రామాల మాజీ సర్పంచ్ లు ఈ అన్యాయమని ప్రపంచానికి చాటాలని మాజీ ఎంపిని అభ్యర్ధించడం విశేషం.

త్వరలో వెల్లడించనున్న ఉండవల్లి …

పోలవరం ప్రాజెక్ట్ బాధితులు అందించిన కీలక దోపిడీ అంశాలను శాస్త్రీయం గా విశ్లేషించి ప్రజల్లో పెట్టేందుకు అధ్యయనం మొదలు పెట్టారు ఉండవల్లి. భూసేకరణ చట్టాలు, పరిహారానికి సంబంధించిన నిబంధనలు, ఏ గ్రామం లో ఎలా అమలు చేసింది ఏ సామాజిక వర్గానికి ఏ లెక్క ఎలా ఇచ్చారో అన్ని వివరాలను బయటకు తీస్తున్నారు అరుణ కుమార్. అందుకోసం తన బృందంతో పరిశీలన అనంతరం పెద్ద ఎత్తున పరిశోధన మొదలు పెట్టారు. మరి ఉండవల్లి పేల్చనున్న బాంబులను బాబు సర్కార్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*