జగన్ కేసుల విలువ ఎంతో తెలుసా?

తిరుమల తిరుపతిపై వైఎస్ సర్కార్ వున్నప్పుడు సిబిఐ విచారణకు అసెంబ్లీలో 2008 లో మీరెందుకు విచారణ జరపాలని కోరారని ఉండవల్లి ప్రశ్నించారు. ‘‘అంటే మీరు అడగొచ్చు కాని, రమణ దీక్షితులు కానీ ఇతర రాజకీయ పార్టీలు అడిగినా వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మసకబారుస్తున్నట్లా ..? శ్రీనివాసుడి పరువు కాదు అక్కడ పోయేది టిటిడి పరువు లేదా అధికారుల పరువు. ఆ దేవుడి పరువు తీసే స్థాయి ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ మీ ప్రతిష్ట సన్నగిల్లుతోందని మీ ఆందోళన. గతంలో ఏడు కొండలు కాదు రెండు కొండలంటూ వైఎస్ పై బురదజల్లేందుకు ప్రయత్నం చేస్తే ఆయన ఏడుకొండలు ఆ దేవుడివే అంటూ జీవో ఇచ్చారు. పోటు లో తవ్వకాల ఫోటోలు, ప్రసాదం బయట తయారు చేస్తున్న అంశాలుచ ఇలా ఇక వజ్రం కెంపు గొడవ ఇలా అనేక వివాదాలు నడుస్తుంటే ఐవైఆర్ కు మీకు పడదు కాబట్టి ఆయన్ను పక్కన పెట్టి మాజీ ఐఏఎస్ లతో ఎందుకు విచారణ తిరుమలపై జరపకుడదు’ అని ప్రశ్నించారు అరుణ కుమార్.

బిజెపి వారిని ఎలా సభ్యులు చేశారు …?

వైసిపి , జనసేనలు బిజెపి తో కలిసిపోయాయి అంటున్న చంద్రబాబు మహారాష్ట్ర బిజెపి నాయకులను ట్రస్ట్ బోర్డు లో ఎందుకు నియమించారని కడిగేశారు ఉండవల్లి. ‘‘గతంలో శేఖర రెడ్డి కి జయలలిత రికమెండేషన్ అన్నారు. జయతో సంబంధాలు బానే ఉన్నందున మీ వాదన సబబే . కానీ బిజెపితో మీకు సఖ్యత లేనప్పుడు వారిని ఎందుకు ఎలా నియమించారో’’ చెప్పాలన్నారు అరుణ కుమార్.

జేసీ ఆరోపణలపై ప్రధాని విచారణ జరపాలి…

జగన్ కి ప్రధాని మోడీ 1500 కోట్ల రూపాయలు ఇచ్చారంటూ జెసి దివాకర రెడ్డి చేసిన ఆరోపణ చాలా తీవ్రమైనవని, దీనిపై మోడీ తక్షణం వివరణ ఇచ్చి విచారణ జరపాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ. దివాకర రెడ్డి సీనియర్ చట్ట సభ సభ్యుడని, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో ఒక దానికి ఛైర్మెన్ గా వున్నారని, అలాంటి వ్యక్తి ఆరోపణలకు విలువ ఇవ్వాలని, కనుక తక్షణం విచారణ జరిపి తీరాలన్నారు. ఇక యనమల రామకృష్ణుడు జగన్ ఆస్తులు 43 వేలకోట్ల రూపాయలు స్వాధీనం చేసుకోవాలంటూ ఆర్ధికమంత్రి హోదాలో చెప్పడాన్ని ఆక్షేపించారు. ఆ కేసుల్లో మొత్తం విలువ 12, 13 వందల కోట్లని ఇప్పటికే 500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రిలీజ్ అయ్యాయని గుర్తు చేశారు. పరస్పరం తీవ్రమైన దారుణమైన ఆరోపణలు పెరిగిపోయాయని అన్నారు.

తెలంగాణాలో చూడండి…..

బిజెపితో కలవడం వల్ల సీట్లు తగ్గాయని మునిసిపల్ ఎన్నికల ఫలితాలు చూపి టిడిపి తప్పుదారి పట్టిస్తోందని అది నిజం కాదన్నారు ఉండవల్లి. తెలంగాణాలో కాంగ్రెస్ కి గత ఎన్నికల్లో టిఆర్ ఎస్ కన్నా ఎక్కువ విజయాలు లభించినా సాధారణ ఎన్నికల్లో గులాబీ పార్టీ స్వీప్ చేసిన విషయం మరువొద్దన్నారు అరుణ కుమార్. తీవ్రమైన వ్యక్తిగతమైన ఆరోపణలకు దిగి దేశానికి ఎపి ప్రజలను దూరం చేయొద్దని అందరిని అన్నిపార్టీలు కలుపుకు వెళ్లి రాష్ట్రానికి న్యాయం చేసేందుకు కృషి చేయాలని చంద్రబాబు కి సూచించారు. ఇక వైసిపి ఎంపీలు జూన్ 5,6 తేదీల్లో స్పీకర్ ముందు హాజరు కాకుండా వర్షాకాల సమావేశాల్లో ఎపి రీ ఆర్గనైజేషన్ బిల్లు పై చర్చ జరిగేలా చేయాలని అలా కానీ పక్షంలో రాజీనామా చేసి రావాలని చివరిగా రాష్ట్ర ప్రయోజనాలు ఆశిస్తూ కోరుతున్నా అన్నారు ఉండవల్లి అరుణ కుమార్.

 

-రాజమండ్రి నుంచి ప్రత్యేక ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*