ఉత్తమ్ ఎత్తుగడతో…. చిత్తయినట్లేనా….??

పొత్తులు కుదరిన వేళ… సీట్లు సర్దుబాటు కొలిక్కి వస్తున్న తరుణంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాకూటమిలోని పార్టీలను పక్కన పెడితే సీట్ల పంపకంలో సొంత పార్టీ నేతల నుంచే ముప్పు ఉందని ఉత్తమ్ గ్రహించారు. వీరిలో సీనియర్ నేతలే ఉండటంతో ఉత్తమ్ కూడా ఏమీ చేయలేకపోతున్నారు. సీనియర్ నేతలందరూ తమతో పాటు తమ వారసులకు టిక్కెట్లు కోరుతున్నారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇందులో సీనియర్ నేత జానా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డీకే అరుణ వంటి వారు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. ఇది హైకమాండ్ కు కూడా తలనొప్పిగా మారింది.

సీనియర్లకు రెండు టిక్కెట్లు…..

అయితే పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా ఈ సమస్య ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడంతో అధిష్టానం కూడా ఈ ఇద్దరికీ సీట్లు ఇచ్చేందుకు సుముఖంగానే ఉంది. అయితే సీనియర్ నేతలు తమ కుటుంబానికి రెండు టిక్కెట్లు కావాలని గట్టిగా కోరుతుండటం అధిష్టానానికి మింగుడుపడటం లేదు. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో టిక్కెట్ ఆశిస్తుండగా, ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డి రాజేంద్ర నగర్ టిక్కెట్ ను కోరుకుంటున్నారు.

తన భార్య సీటును త్యాగం చేసి….

ఇక మహబబూనగర్ జిల్లాలో గద్వాల నుంచి డీకే అరుణ పోటీకి దిగుతుండగా, ఆమె కుమార్తెను బరిలోకి దింపడానికి మక్తల్ సీటును ఆశిస్తున్నారు. ఇక జానారెడ్డి తాను నాగార్జున సాగర్ లోనూ, ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి మిర్యాల గూడ టిక్కెట్ ను ఆశిస్తున్నారు. గత కొంతకాలంగా సీనియర్ నేతల వత్తిడితో అధిష్టానం కూడా తలపట్టుకుని కూర్చుంది. ఉత్తమ్ ఢిల్లీ పర్యటనలో కూడా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ప్రస్తావించడంతో ఉత్తమ్ కు ఏం చెప్పాలో పాలుపోలేదు. ఇంటికి ఒక టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో రెండు సీట్లు విధిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాబట్టి.

టీడీపీకే కోదాడ సీటు…

అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి తనంతట తానే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఈసారి తన భార్య పద్మావతిని బరిలోకి దించకూడదని డెసిషన్ తీసుకున్నారు. ఈరకంగా అధిష్టానానికి వెసులుబాటు కల్పించడంతో పాటు రెండు సీట్లు అడుగుతున్న సీనియర్లకు కూడా చెక్ పెట్టే వీలుంది. కోదాడ సీటును మిత్రపక్షాలకు ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది. కోదాడ అసెంబ్లీ స్థానాన్ని ప్రజాకూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కోరుతోంది. కోదాడ నుంచి ఈసారి ప్రజాకూటమి తరుపున మల్లయ్య యాదవ్ ను పోటీలోకి దింపుతున్నారని తెలుస్తోంది. పొత్తుల కోసం భార్య సీటును త్యాగం చేసి ఒకరకంగా ఇటు సీనియర్లకు పొత్తులతో సీట్లు కోల్పోయే కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టేందుకే ఉత్తమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద ఉత్తమ్ వ్యూహాత్మక ఎత్తుగడ సత్పలితాలనిస్తుందన్న విశ్లషణలు విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*