సైలెన్స్ వెనుక అదే ఉందా?

ప్రత్య‌ర్థుల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ అమ్ముల‌పొదిలో అస్త్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వాటిని స‌మ‌యం.. సంద‌ర్భాన్ని బ‌ట్టి వాడ‌డంలో కేసీఆర్‌కు మ‌రెవ‌రూ సాటిరార‌ని ప‌లువురు అంటుంటారు. తాజాగా.. టీపీసీపీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిపై కూడా తిరుగులేని అస్త్రాన్ని సంధించిన‌ట్లు స‌మాచారం. అందుకే కొద్దిరోజులుగా ఉత్త‌మ్ సైలెంట్ అయిన‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యంపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనూ హాట్‌హాట్‌గా చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు అందిన‌ట్లు కూడా స‌మాచారం. ఇంత‌కీ, ఉత్త‌మ్‌కు, కేసీఆర్‌కు మ‌ధ్య ఉన్న రిలేష‌న్ ఏమిట‌ని అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ క‌థ‌నం చ‌ద‌వాల్సిందే.

టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ….

గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి గృహ నిర్మాణ శాఖామంత్రిగా ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంలో భారీగా అక్ర‌మాలు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ నేత‌లు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు కూడా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. టీపీసీసీ చీఫ్‌గా బాధ్య‌తలు చేప‌ట్టిన త‌ర్వాత ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి ప్ర‌ధానంగా టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. కేసీఆర్‌ను తీరును ఎండ‌గ‌డుతున్నారు. ఇదే క్ర‌మంలో ప్ర‌జాచైత‌న్య బ‌స్సుయాత్ర చేప‌ట్టి విజ‌య‌వంతంగా కొన‌సాగించారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు కూడా రాష్ట్ర నాయ‌క‌త్వాన్ని మెచ్చుకున్నారు. ఇక ఉత్త‌మ్ మాత్రం కేసీఆర్ పాల‌న‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

సైలెంట్ అవ్వడం వెనుక….

అయితే.. కొద్ది రోజులుగా ఉత్త‌మ్ సైలెంట్ అయిపోయారు. రాష్ట్ర ప్ర‌భుత్వాన్నిగానీ, కేసీఆర్‌ను గానీ పెద్ద‌గా విమ‌ర్శించింది లేదు. దీనికి ప‌లు కార‌ణాలున్నాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త ప్ర‌భుత్వం హయాంలో గృహ నిర్మాణ శాఖ‌లో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌ను వెలికితీస్తామ‌నీ, ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌బోమ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో కేసీఆర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటున్న ఓ పారిశ్రామిక‌వేత్త ద్వారా ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి కేసీఆర్‌తో రాజీ కుదిర్చుకున్న‌ట్లు తెలుస్తోంది. అందుకే కేసీఆర్ విష‌యంలో మౌనంగా ఉంటున్నార‌నే చ‌ర్చ పార్టీలో వ‌ర్గాల్లో విన‌బ‌డుతోంది. ఇక ఇదే విష‌యంపై పులువురు నేత‌లు పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిసింది.

వీరిద్దరి వల్లనే….

ఇదిలా ఉండ‌గా… శాస‌న‌స‌భ ప‌క్ష నేత జానారెడ్డి తీరుపై కూడా అధిష్టానానికి ఫిర్యాదులు అందిన‌ట్లు స‌మాచారం. ఉత్త‌మ్‌, జానారెడ్డి తీరువ‌ల్లే రాష్ట్రంలో పార్టీ న‌ష్ట‌పోతోంద‌నీ ప‌లువురు నేతలు గుర్రుగా ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో టీపీసీసీ చీఫ్ నుంచి ఉత్త‌మ్‌ను త‌ప్పిస్తార‌నీ, జానారెడ్డి స్థానంలో భ‌ట్టివిక్ర‌మార్క‌కు అవ‌కాశం ఇస్తార‌నే టాక్ వినిపిస్తోంది. ఇక పార్టీ ప్ర‌చార బాధ్య‌త‌ల విష‌యంలో మాత్రం రేవంత్‌రెడ్డికే ఎక్కువ అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. కేసీఆర్ లాంటి బ‌ల‌మైన నేత‌ను ఎదుర్కొనాలంటే.. రేవంత్‌రెడ్డే స‌రైన నేత అని ప‌లువురు నేత‌లు అంటున్న‌ట్లు స‌మాచారం.. కానీ.. కొంద‌రు సీనియ‌ర్లు మాత్రం ఇందుకు ఒప్పుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*