వంగవీటికి దారులన్నీ మూసుకుపోయాయా?

వంగవీటి రాధాకు వేరే దారిలేదా? తన నియోజకవర్గంలో సన్నిహితులు, ముఖ్యులతో సమావేశమైన వంగవీటి రాధా ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఎటు వెళ్లినా సెంట్రల్ సీటు దక్కదని తేలిపోయిందా..? ఇప్పుడు బెజవాడలో అదే టాక్. వంగవీటి రాధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి వంగవీటి రంగా సమకూర్చిన రాజకీయ నిచ్చెనతో ఒక్కొక్క మెట్టూ ఎదుగుతూ వచ్చారు. అయితే రాధాకు కాలం కలసి రావడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆయన వైఖరేనన్నది చెప్పక తప్పదు. రాధా తనకు సంబంధించిన కొద్దిమందితో మాత్రమే టచ్ లో ఉంటారు. ప్రజాసమస్యలు పెద్దగా పట్టించుకోరన్న విమర్శ ఉంది.

చొరవ లేకపోవడంతో……

తండ్రి వంగవీటి రంగా, తల్లి రత్నకుమారిలు ప్రజల్లోకి దూసుకెళ్లేవారు. వారిద్దరి చొరవ రాధాకు లేదంటున్నారు. వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వరని దాదాపుగా తేలిపోయింది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ నియోజకవర్గ బాధ్యతను మల్లాది విష్ణుకు అప్పగించడమంటేనే రాధాను పక్కనపెట్టినట్లే అన్నది ఆయనకు తెలియంది కాదు. మల్లాదికి బాధ్యతలను అప్పగించడంతో రగిలిపోయిన రాధా వెంటనే అనుచరులతో సమావేశమయ్యారు. అనుచరులు కూడా పార్టీ నుంచి బయటకు రావాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే రాధాకు అత్యంత సన్నిహితుడు ఒకరు పార్టీని వీడొద్దని సూచించారట.

తొందరపడవద్దని…..

ఇప్పటికే వంగవీటి రాధాను వైసీపీ సీనియర్ నేత పార్థసారధి కలిసి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. అయితే రాధా మాత్రం తనకు సెంట్రల్ సీటు కావాల్సిందేనని పట్టు బడుతున్నారు. రాధాకు మరొక ఆప్షన్ జనసేన మాత్రమే. జనసేనలోకి వెళ్లేందుకు రాధాకు ఎలాంటి ఇబ్బందులుండవు. గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఇదే నియోజకవర్గం నుంచి రాధా ఓటమిపాలయ్యారు. అయితే జనసేన, సీపీఐ,సీపీఎం పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నుంచి సీపీఎం సీనియర్ నేత సీహెచ్ బాబూరావు పోటీ చేయనున్నారు. ఈమేరకు పవన్ తో సీపీఎం మధు సెంట్రల్ విషయాన్ని మాట్లాడినట్లు సమాచారం. పవన్ కూడా సెంట్రల్ నియోజకవర్గం ఇచ్చేందుకు సిద్ధమని తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

జనసేనలోనూ గ్యారంటీ లేక……

దీంతో రాధా జనసేనలోకి వెళ్లాలన్న ఆశలు నీరుగారిపోయినట్లేనని చెబుతున్నారు. జనసేన లో చేరితే ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి. లేకుంటే పార్టీ మారి వేస్ట్ అన్నది రాధా సన్నిహితుల అభిప్రాయం. సీటు విషయంలో కన్ ఫర్మ్ చేసుకోవడం నేరుగా రాధా సామాజిక వర్గం నేతలు కొందరు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నేరుగా కలసి కోరాలని నిర్ణయించారు. పవన్ ఓకే అంటే జనసేనలోకి రాధా వెళ్లే అవకాశముంది. పవన్ ఆ సీటును సీపీఎంకు కేటాయించామని చెబితే మాత్రం రాధా పార్టీ మారరనన్నది అంతర్గతంగా ఆయన అనుచరుల్లో జరుగుతున్న చర్చ. మరి రాధా కు వేరే దారిలేదని, అన్ని ద్వారాలూ మూసుకుపోయాయన్నది బెజవాడలో హాట్ టాపిక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*