ఆలస్యమయిపోయిందిగా….!!!

రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే గడ్డు పరిస్థిితిని ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా ఒక్క మాటలో చెప్పాలంటే వసుంధర విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నది వాస్తవం. సీనియర్ నాయకురాలిగా, అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనచేసిన ఆమెపై వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాన చేర్చాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. కానీ ఇది అంత తేలిక కాదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. వివిధ ఎన్నికల సర్వేలు కూడా కమలనానికి కష్టకాలమేనని జోస్యం చెబుతున్నాయి. దీంతో వసుంధర ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన ఆమెను ఆందోళన వెంటాడుతోంది.

సీనియర్ నేత అయి ఉండి….

వసుంధర ఆషామాషీ నాయకురాలు ఏమీ కాదు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి, ఉప రాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్ తర్వాత పార్టీలో ఆమే సీనియర్ నాయకురాలు. గత ఇరవేఏళ్లుగా రాష్ట్ర బీజేపీ ఆమె కనుసన్నల్లోనే నడుస్తోంది. 2003, 2013 లో రాష్ట్రంలో పార్టీని విజయపథాన నడిపించిన ఘన చరిత్ర ఉంది. పదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన రాష్ట్ర బీజేపీ నాయకురాలు కూడా ఆమే కావడం గమనార్హం. బీజేపీ దివంగత దిగ్గజం భైరాన్ సింగ్ షెకావత్ కూడా అంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేయలేకపోయారు. గ్వాలియర్, థోల్ పూల్ రాజకుటుంబానికి చెందిన రాజే సుదీర్ఘ రాజకీయ అనుభవశాలి. 1953 మార్చి 8న ముంబయిలో జన్మించిన ఆమె తమిళనాడులోని కొడైకెనాల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం ముంబయి లోని సోఫియా కళాశాలలో ఆర్థిక, రాజకీయ శాస్త్రాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన ఆమె తల్లి విజయరాజ సింధియా కరడుగట్టిన కమలం వాది. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఆమె ఒకరు. తండ్రి జీవరాజ్ సింధియా.

కుటుంబంలో విభేదాలు…..

రాజకీయంగా కుటుంబంలో విభేదాలున్నాయి. వసుంధర సోదరుడు మాధవరావు సింధియా కరడు కట్టిన కాంగ్రెస్ వాది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పలుమార్లు ఎన్నికైన ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. రాజకీయంగా రెండు కుటుంబాల మధ్య బద్ధ వైరం ఉంది. ఒకరి పొడ మరొకరికి గిట్టదు. కనీసం మాటలు కూడా లేవు. వాస్తవానికి గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన వసుంధరరాజే 1972 నవంబరు 17న రాజస్థాన్ లోని ధోల్ పుర రాజకుటుంబానికి చెందిన మహారాజా రాణాహమ్ సింగ్ ను పెళ్లి చేసుకున్నారు. కానీ వసుంధర రాజే వివాహ జీవితం కొద్దికాలానికే విచ్ఛిన్నమైంది. దీంతో ఆమె అత్తింటి రాష్ట్రమైన రాజస్థాన్ ను తన రాజకీయ క్షేత్రంగా మలచుకున్నారు. ఆమె తనయుడు దుష్యంత్ సింగ్ ప్రస్తుతం లోక్ సభ సభ్యుడు.

అంచెలంచెలుగా ఎదిగి…..

1984లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన వసుంధర రాజే అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర ఎనిమిదో అసెంబ్లీ ఎన్నికల్లో (1985)ధోల్ పూర్ నుంచి ఎన్నికయ్యారు. 1989లో లోక్ సభకు ఎన్నికయ్యారు. 1991 లోక్ సభ మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. 1996, 98,99 లోక్ సభ ఎన్నికల్లో కూడా వరుసగా విజయాలు సాధించి ప్రజల్లో తన సత్తా చాటుకున్నారు. 1999-2003 మధ్య కాలంలో వాజ పేయి మంత్రివర్గంలో వివిధ శాఖలను సమర్థవంతంగా నిభాయించారు. విదేశాంగ సహాయ మంత్రిగా, చిన్నతరహా పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమల శాఖలను స్వతంత్ర హోదాలో నిర్వహించారు. 2003లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో “ఝల్రాపటన్” నియోజకవర్గం నుంచి ఎన్నికై తొలిసారి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు. 2008, 2013 ఎన్నికల్లో ూడా అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2013లో మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం మళ్లీ ఝట్రాపలన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

అన్నింటా వ్యతిరేకత…..

అధికార పార్టీ ని ఓడించి విపక్షాన్ని గద్దెపై కూర్చోబెట్టే సంప్రదాయం రాజస్థాన్ లో గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. తాజాగా అదే ఆనవాయితీ కొనసాగుతున్న ఆందోళన వసుంధరకు లేకపోలేదు. ఏ ఒక్క సర్వే కూడా ఆమెకు అనుకూలంగా చెప్పలేదు. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వంలో, పార్టీలో అనైక్యత పార్టీ కొంపముంచే ప్రమాదం బలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో రెండు లోక్ సభ, ఒక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఫల్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత, జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, పెట్రోలు, డీజీల్ ధరల పెంపు, రాజపుత్రులు, గుజ్జర్లలో ఆగ్రహం తదితర అంశాలు పార్టీని నట్టేట ముంచుతున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలోని 9 శాతం ముస్లిం జనాభా గంపగుత్తగా హస్తం పార్టీకి మద్దతు తెలుపుతోంది. శాసనసభ్యుల పనితీరుపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత, వ్యక్తిగతంగా వసుంధర వ్యవహారశైలి పార్టీకి చేటు తెస్తాయన్న ఆందోళన అంతర్గతంగా పార్టీ వర్గాల్లో ఉంది. పరిస్థితిని గమనించిన వసుంధర ఇటీవల జన సంపద్ పేరుతో 16 జిల్లాల్లోని 50 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు జరిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ప్రజల సమక్సంలో కొందరు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే ఇప్పటికే ఆలస్యంగా మేల్కొన్నారని, దానివల్ల ఫలితం ఉండదన్నది రాజకీయ పండితుల అంచనా.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*