సీన్ లేని వీహెచ్…ఎందుకా చిందులు….?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే జరుగనున్న తెలంగాణలో సత్తా చాటాలని ఆ పార్టీ అధిష్ఠానం పట్టుదలతో ఉంది. పైగా తెలంగాణలో ఆ పార్టీకి గెలిచేందుకు ఎంతోకొంత అవకాశం ఉంది. దీంతో పార్టీ అధిష్ఠానం ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. కేవలం ఎన్నికల కోసమే ప్రత్యేకంగా 10 కమిటీలు వేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వేసిన ఈ కమిటీలు ఇప్పుడు కొత్త సమస్యలు తీసుకువస్తున్నాయి. పార్టీలోని కొందరు సీనియర్లు కమిటీల్లో తమకు ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తనకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించలేదని, తాను రాష్టమంతా తిరిగి కాంగ్రెస్ ను గెలిపించాలనుకున్నానని, ఇందుకోసం ప్రచారరథాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నానని అన్నారు. అయితే, పార్టీ పెద్దలు మాత్రం వీహెచ్ ను వ్యూహ రచన కమిటీకి ఛైర్మన్ గా నియమించారు. తనను గాంధీ భవన్ కే పరిమితం చేస్తారా..? అని హనుమంతరావు ప్రశ్నిస్తున్నారు.

పోటీ ఎక్కువగానే ఉన్నా…

అనేక రోజుల పాటు కసరత్తు చేసిన తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం కమిటీల నియామకం చేపట్టింది. ఎన్నికల్లో ప్రచార కమిటీ బాధ్యతలు చాలా కీలకమైనవి. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయాల్సి ఉంటుంది. పార్టీ ప్రచార వ్యవహారం మొత్తాన్ని సమన్వయం చేసుకోవాలి. పైగా ప్రచార బాధ్యతలు నిర్వహించే వారు బాగా ఫోకస్ అవుతారు. దీంతో వీహెచ్, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి వంటి వారు ఈ పదవిని ఆశించారు. అయితే, వివిధ అంశాలపై పూర్తి అవగాహన, ప్రజల్లో మంచి గుర్తింపు, వాక్చాతుర్యం ఉండాలి. అలా అయితేనే ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీకి కొంత మేలు జరుగుతుంది. అందుకే ఈ బాధ్యతలను ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్కకు పార్టీ అధిష్ఠానం అప్పగించింది. ఆయనకు ఈ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించే సామర్థ్యం ఉందని విశ్లేషకుల అంచనా. పైగా ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా క్యాడర్ లో, ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీ దళితులను పూర్తిగా తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నందున భట్టి విక్రమార్క ద్వారా ఈ ప్రయత్నం కూడా కొంత ఫలించవచ్చు.

వీహెచ్ ను ఎందుకు పక్కన పెట్టారు..?

ఇక, ఈ పదవి దక్కని వి.హనుమంతరావు విషయానికి వస్తే… పార్టీలో సీనియర్ నేత. గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడు. ఏనాడూ పార్టీ గీత దాటలేదు. అందుకే ఆయనను పార్టీ రెండుసార్లు రాజ్యసభకు పంపించింది. కానీ, ప్రజల్లో మాత్రం ఆయనకు అంత బలం లేదు. గత ఎన్నికల్లో ఆయన అంబర్ పేట నుంచి పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఆయన తరచూ బీసీ కార్డును తెరపైకి తెచ్చినా… రాష్ట్రంలోని బీసీలంతా ఆయనను ఓన్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఇక వయస్సు రీత్యా కూడా రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా పర్యటించలేదు. ప్రసంగాల్లో తన మార్కుతో సభకు వచ్చినవారందరినీ నవ్వించగలరు. కానీ, ఓట్లు వేయించగలరా..? అంటే అనుమానమే. అందుకే ఆయనకు పార్టీ పెద్దలు ఈ బాధ్యతలు అప్పగించలేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వీహెచ్ కు వ్యూహ రచన బాధ్యతలే కరెక్ట్ అని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి. తనకు ఆశించిన పదవి రాకున్నా వీహెచ్ పార్టీ మాత్రం మారరు. ఇది పక్కా. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి హనుమంతుని లెక్క అని అందరికీ తెలిసిందే. మొత్తానికి కాంగ్రెస్ అధిష్ఠానం కమిటీల నియామకంలో కొంత సీరియస్ గానే దృష్టి పెట్టినట్లు కనపడుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*