విజయసాయి పార్టీకి ప్లస్సా.? మైనస్సా?

ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి వైసీపీ మైన‌స్ అవుతున్నారా..? ప్లస్ అవుతున్నారా? రింగ‌రింగ బొంగ‌రంలా తిరుగుతూ గంద‌ర‌గోళం సృష్టిస్తున్నారా..? ఆయ‌న వ్యవ‌హార‌శైలితో పార్టీకి ఒకింత న‌ష్టం జ‌రుగుతోందా..? లేక లాభం చేకూరేనా? ఇదే ఇప్పుడు…వైసీపీ, టీడీపీల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. నిజానికి మొద‌టి నుంచీ కూడా జ‌గ‌న్‌కు విజ‌య‌సాయిరెడ్డి అండ‌గా ఉంటున్నారు.. కానీ.. ఇప్పుడు ఆయ‌న ప‌నితీరే జ‌గ‌న్‌కు ఇక్క‌ట్లు తెచ్చిపెడుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు జ‌గ‌ను అనుమ‌తితోనే విజ‌య‌సాయిరెడ్డి ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే టాక్ కూడా పార్టీవ‌ర్గాల్లో వినిపిస్తోంది. రాజ‌కీయంగా సంక్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్న‌సంద‌ర్భాల్లో ఆయ‌న ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఇంటాబ‌య‌టా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

మొన్న బడ్జెట్ సమావేశాల్లో….

పార్ల‌మెంటు చివ‌రి బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నస‌మ‌యంలో విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరు అందరినీ విస్తుగొల్పింది. బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఏపీకి నిధులు కేటాయించ‌డంలో కేంద్రం మొండిచేయి చూపించింది. అలాగే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని కూడా తేల్చిచెప్పిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇదే స‌మ‌యంలో కేంద్రంపై అవిశ్వాసం ప్ర‌వేశ‌పెడుతున్నామ‌ని వైసీపీ ఎంపీలు చెబ‌ుతూనే మ‌రోవైపు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ధాని కార్యాల‌యం చుట్టూ చ‌క్క‌ర్లు కొట్ట‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

స్వప్రయోజనాల కోసమేనంటూ….

ఇదే స‌మ‌యంలో టీడీపీ నేత‌లు కూడా వైసీపీపై దాడి మొద‌లుపెట్టారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా న‌మ్మ‌ద్రోహం చేసిన బీజేపీతో వైసీపీ అంట‌కాగుతూ కుట్ర‌రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌యోజనాల‌ను ప‌క్క‌న‌బెట్టి.. స్వీయ‌ప్ర‌యోజ‌నాల కోసం జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి పాకులాడుతున్నార‌న్న విష‌యాన్ని జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్లారు. దీంతో వైపీపీపై తీవ్ర ప్ర‌భావ‌మే ప‌డింది. అస‌లు వైసీపీ – బీజేపీ మిలాఖ‌త్‌పై ఎవ‌రెన్ని విమ‌ర్శ‌లు చేసినా విజ‌య‌సాయే ఎక్కువుగా మోడీ కార్యాల‌యం చుట్టూ తిర‌గ‌డంతో పాటు ఆ పార్టీ వాళ్ల‌తో ట‌చ్‌లోకి వెళ్ల‌డంతో సామాన్య జ‌నాల్లోనూ ఈ రెండు పార్టీల మైత్రిపై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

మోత్కుపల్లి భేటీతో….

తాజాగా.. టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులును విజ‌య‌సాయిరెడ్డి హైద‌రాబాద్‌లో భేటీ కావ‌డం కూడా చ‌ర్చ‌నీయాశంగా మారింది. నిజానికి మోత్కుప‌ల్లి కొత్త‌గా.. ర‌హ‌స్యంగా చెప్పేది ఏమీ ఉండ‌దు.. అనేక‌సార్లు త‌న మ‌న‌సులో ఉన్న‌దంతా మీడియా ముఖంగా వెల్ల‌గ‌క్కిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న కొత్త‌గా చెప్పిన విష‌యం ఏమిటంటే.. చంద్ర‌బాబు ప‌త‌నం కోసం అన్ని పార్టీలు ఏకం కావాల‌ని, అవ‌స‌ర‌మైతే జ‌గ‌న్‌తో క‌లిసి పాద‌యాత్ర‌లో పాల్గొంటాన‌ని ప్ర‌క‌టించారు.

మైండ్ గేమ్ లో భాగంగానే….

అయితే విజయసాయి రెడ్డి ఇదంతా మైండ్ గేమ్ లో భాగంగనే చేస్తున్నారన్నది ఒక టాక్. అధికారంలో ఉన్న పార్టీని మానసికంగా దెబ్బతీయాలంటే వారి శత్రువులను కలుపుకుని పోవడం మేలని ఆయన భావించి మోత్కుపల్లిని కలిశారంటున్నారు. అంతేకాదు టీటీడీలో నగల మాయం వంటి విజయసాయి ఆరోపణలు కూడా చంద్రబాబును మానసికంగా దెబ్బతీయడానికేనని చెబుతున్నారు. ప్రజల్లో పదిశాతం మంది విజయసాయి మాటలను నమ్మినా అది చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది తెచ్చిపెడుతుంది. అందుకే విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగానే ముందుకు వెళుతున్నారన్నది ఆ పార్టీ వర్గాల టాక్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*