రాముల‌మ్మ…. అంతా… క‌న్‌ఫ్యూజ‌న్‌..!

రాముల‌మ్మ వ‌చ్చేస్తోంది.. మ‌ళ్లీ రాజ‌కీయాల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు రంగంలోకి దిగుతోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత నాలుగేళ్లుగా మౌనంగా ఉన్న ఆమె ఇటీవ‌ల మ‌హంకాళి అమ్మ‌వారికి ఏకంగా బంగారుబోనం స‌మ‌ర్పించారు. ఈ బంగారు బోన‌మే త‌న రీ ఎంట్రీకి సంకేత‌మ‌ని ఆమె చెప్ప‌క‌నే చెప్పేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగుతున్నాన‌ని ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చేశారు. కాంగ్రెస్ పార్టీలో కీల‌క పాత్ర‌పోషించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారా..? అనే చ‌ర్చ‌కు అమ్మ‌వారి సాక్షిగా ఆస్కార‌మిచ్చారు. నిజానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌క‌త్వం చేప‌ట్టిన ప్రజాచైత‌న్య బ‌స్సుయాత్ర సంద‌ర్భంగానే రాముల‌మ్మ మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్నార‌నే టాక్ వినిపించింది. కానీ, పార్టీ విడత‌లుగా చేప‌ట్టిన బ‌స్స‌ుయాత్ర‌ల్లో రాముల‌మ్మ క‌నిపించ‌లేదు. ఇప్ప‌డు అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించ‌డంలో మ‌ళ్లీ ఆమె రాక‌పై చ‌ర్చ జ‌రుగుతోంది.

రాజకీయాల్లోనూ……

నిజానికి తెలుగు చిత్ర‌సీమ‌లో విజ‌య‌శాంతిది చెర‌గ‌ని ముద్ర‌. స్టార్ హీరోల‌తో సమానంగా రాణించిన హీరోయిన్‌. న‌ట‌న‌లో, డ్యాన్స్‌లో చిరంజీవిలాంటి హేమాహేమీల‌తో పోటాపోటీగా రాణించారు. స్టార్ హీరోల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక వుమెన్ ఓరియెంటెడ్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్నారు. త‌న‌కంటూ సొంత అభిమాన లోకాన్ని సృష్టించుకున్నారు. ఈ క్ర‌మంలో ఎందరో హీరోయిన్లు వ‌స్తున్నారు.. పోతున్నారు.. కానీ.. రాముల‌మ్మ‌గా విజ‌య‌శాంతి అభిమానుల గుండెల్లో త‌ల‌దాచుకున్నారు. అనంత‌రం రాజ‌కీయ‌రంగంలోనూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ఆమె ఉద్య‌మించారు. ఈ క్ర‌మంలో సొంతంగా త‌ల్లి తెలంగాణ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. అనంత‌రం ఆ పార్టీ కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు.

మళ్లీ యాక్టివ్ గా……..

ఒకానొక ద‌శ‌లో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ త‌ర్వాత రెండో స్థానంలో నిలిచారు. 2009 ఎన్నిక‌ల్లో ఆమె మెద‌క్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆత‌ర్వాత విభేదాలు రావ‌డంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014ఎన్నిక‌ల్లో మెద‌క్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మాదేవేంద‌ర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక ఆ త‌ర్వాత దాదాపుగా రాజ‌కీయాల‌కు పూర్తిగా దూర‌మ‌య్యారు. అయితే, ఇటీవ‌ల మ‌ళ్లీ ఆమె రాజ‌కీయాల్లో చురుగ్గా వ్య‌వ‌హ‌రించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు పార్టీ అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌స్తుతం.. మెద‌క్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ నేత శ‌శిధ‌ర్‌రెడ్డి చురుగ్గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీ శ్రేణులు రెండు వ‌ర్గాలు విడిపోయిన‌ట్లు స‌మాచారం.

రాహుల్ టూర్ లో…..

ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలోనూ శ‌శిధ‌ర్‌రెడ్డి, విజ‌య‌శాంతి వ‌ర్గీయులు బాహీబాహీకి దిగడం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో టికెట్ విష‌యంలో పార్టీవ‌ర్గాల్లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో మెద‌క్ కాంగ్రెస్ అసెంబ్లీ సీటు ఎవ‌రికి ద‌క్కుతుందా ? అన్న‌ది క్లారిటీ లేకుండా పోయింది. మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌య‌శాంతి పోటీ చేస్తార‌నే టాక్ కూడా వినిపిస్తోంది. పార్టీ అధిష్టానం మాత్రం ఆమెకు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో మెద‌క్ ఎంపీ లేదా సెటిల‌ర్లు ఎక్కువుగా ఉన్న మ‌ల్కాజ్‌గిరి ఎంపీ సీటు నుంచి కూడా లోక్‌స‌భ‌కు పోటీ చేయిస్తే ఎలా ఉంటుంద‌ని కూడా ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, రాములమ్మ రీఎంట్రీ ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో క‌ల‌క‌లం సృష్టిస్తుందా..? లేక పార్టీలోనే అయోమ‌యం క‌లుగ‌జేస్తుందా..? అన్న‌ది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఈనెల 13న హైదరాబాద్ లో జరిగే రాహుల్ టూర్ లో రాములమ్మ పాల్గొంటారా? లేదా? అన్నది కూడా కన్ఫ్యూజనే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*