బెజ‌వాడ‌లో ఇలా బ‌తికిస్తార‌ట‌..!

ఇప్ప‌టికే దాదాపు కోమాలోకి వెళ్లి పోయిన బెజ‌వాడ కాంగ్రెస్‌ను బ‌తికించుకునేందుకు నేతలు వ్యూహాల మీద వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. నిజానికి ఇక్క‌డ నేత‌లు అంద‌రూ వైసీపీలోకి జంప్ చేసేశారు. కొంద‌రు టీడీపీ బాట ప‌ట్టారు. ఇలా మొత్తంగా బెజ‌వాడ కాంగ్రెస్ భ్ర‌ష్టుప‌ట్టిపోయింది. క‌నీసం ఇక్క‌డ పార్టీకి న‌గ‌ర అధ్య‌క్షుడు కూడా లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇలాంటి ప‌రిస్థితి నుంచి పార్టీని ర‌క్షించేందుకు నాయ‌కులు త‌హ‌త‌హ లాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. ఖాళీగా ఉన్న విజయవాడ నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష పదవిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు కొనసాగుతున్న సంప్రదాయానికి స్వస్తిచెప్పి కొత్త సంప్రదాయానికి తెర తీయాలని ఆలోచిస్తున్నారు.

మైనారిటీలకు కేటాయించి…..

ఇందులో భాగంగానే కమిటీ అధ్యక్ష పదవిని మైనారిటీలకు కేటాయించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత వైభవాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీకి నగర కమిటీ అధ్యక్షులుగా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన మల్లాది విష్ణు పనిచేశారు. ఆయన వైసీపీలోకి వెళ్లాక ఆ బాధ్యతలను కాపు సామాజికవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాసకుమార్‌కు అప్పగించారు. ఆయన కొన్ని కారణాలతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఈ పదవి ఖాళీ గానే ఉంది. విజయవాడ నగర కమిటీ అధ్యక్షుడి అవకాశాలను దక్కించున్న సామాజిక వర్గాలకు కాకుండా మైనారిటీలకు అవకాశం ఇవ్వాలన్న యోచనలో పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా ఇన్‌చార్జిలు యోచిస్తున్నారు.

గతంలోనూ….

మైనారిటీ వర్గానికి చెందిన ఇద్దరు మాత్రమే ఇప్పటివరకు నగర కమిటీకి అధ్యక్షులుగా పనిచేశారు. మాజీమంత్రి ఎస్‌ఎం బేగ్‌, నాడు కాంగ్రెస్‌లో ఉండగా, జలీల్‌ఖాన్‌ నగర అధ్యక్షుడిగా వ్యవహరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ మైనారిటీలకు ఛాన్స్‌ దక్కలేదు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ నగర కమిటీ అధ్యక్షుడిగా మైనారిటీలను నియమించలేదు. వాస్తవానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆ కోటాలో పదవులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మైనారిటీ సెల్‌లో గానీ, ఇతర కమిటీల్లో గానీ ఇస్తున్నారు. ముస్లింలు మైనారిటీ విభాగాల్లో పదవులకు తప్ప ఇతర పదవులకు పనికి రారా? అన్న ప్రశ్న ఆ వర్గం నుంచి వినిపిస్తోంది. దీంతో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్న ముస్లింలను కీలక పదవుల్లో కూర్చోబెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పార్టీ కూడా డెవ‌ల‌ప్ అవుతుంద‌ని అనుకుంటున్నారు. అయితే, కీల‌క‌మైన ఈ పోస్టుకు స‌రితూగ‌గ‌లిగే.. నాయ‌కుడు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*