తీరని దుఃఖానికి న్యాయం జరిగేనా..?

గుండెలు పిండేసిన విషాదం అది. తెలుగు వారిని కన్నీరు పెట్టించిన ఘటన. ఆ బాధను తట్టుకోలేక తండ్రి గుండె ఆగిపోయింది. మనోవేదనతో తల్లి కూడా కన్నుమూసింది. ఆ పసిబిడ్డ హత్యపై ఎనిమిదిన్నరేళ్ల పాటు.. విచారణ సాగింది. ఇంతటి హృదయ విదారక, పాశవిక హత్యాకాండపై రేపు తీర్పు వెలువడబోతోంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ సంఘటనలో కన్న బిడ్డను, కట్టుకున్న భర్తను కళ్లెదుటే కోల్పోయిన ఓ మహిళ దీనగాధ ఇది. విచారణ ఎంతకీ పూర్తి కాకపోవడం, ఆప్తులను కోల్పోయిన మానసిక క్షోభ, కుటుంబ సభ్యులు దూరమయ్యారనే ఆవేదన ఆమెను కూడా కబళించేసింది. పగవాడికి కూడా రాకూడని ఈ పరిస్థితి సరిగ్గా ఎనిమిదిన్నర సంవత్సరాల క్రితం బెజవాడలో జరిగింది.

గారాలపట్టి వద్దకే చేరిన తల్లిదండ్రులు

నడిరోడ్డుపై కారు డ్రైవర్ లక్ష్మణరావును హతమార్చి చిన్నారి నాగవైష్ణవిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత అత్యంత పాశవికంగా హత్య చేసిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కన్నబిడ్డను కళ్లెదుటే కిడ్నాప్ చేసి హతమార్చడంతో తల్లడిల్లిన తండ్రి గుండె కూడా ఆగిపోయింది. ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తి చేస్తామన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హామీ నెరవేరలేదు. ఈలోగా మానసక క్షోభతో తల్లడిల్లిన ఆ తల్లి నర్మదాదేవి కూడా కన్నుమూసిన ఘటన అందర్నీ కలచివేసింది.

ఆరుగురు మగ పిల్లలను కోల్పోయి…

విజయవాడకు చెందిన వ్యాపారి పలగాని ప్రభాకరరావుకు నలుగురు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. వారిది ఉమ్మడి కుటుంబం. కుటుంబ సభ్యులు అందరూ ఎంతో అన్యోన్యంగా వుంటారు. ఆ కుటుంబానికి ప్రభాకరరావు పెద్దవాడు. సోదరి వెంకటేశ్వరమ్మకు వివాహం చేశాక కొంతకాలానికి ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె కొడుకు, కుమార్తెను తీసుకుని సోదరుల వద్దకే వచ్చేసింది. సోదరి భర్త చనిపోవడం, తమ కుటుంబమే ఆసరా కావడంతో.. ఆమె కుమార్తెను ప్రభాకరరావు వివాహం చేసుకున్నాడు. వారికి ఆరుగురు మగపిల్లలు అంగవైకల్యంతో పుట్టి మృతిచెందారు. వైద్యులను సంప్రదిస్తే మేనరికం వల్లనే ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు.

బలవంతంగా రెండో వివాహం…

అయితే ప్రభాకరరావుకు పిల్లలంటే అమితమైన ఇష్టం. కుటుంబసభ్యులు మరో వివాహం చేయాలని ఆలోచించినప్పటికీ.. సోదరి వద్ద ఈ విషయం గురించి ప్రస్తావించలేకపోయారు. తర్వాత కొంతకాలానికి ప్రభాకరరావు సమీప బంధువైన నర్మదాదేవిని రెండవ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కాగా అందులో ఇద్దరు మగపిల్లలు, ఒక పాప నాగవైష్ణవి. ప్రభాకరరావుకు రెండవ వివాహం జరిగాక రెండు కుటుంబాల మధ్య మనస్ఫర్ధలు తలెత్తాయి. ఒక్కగానొక్క కుమార్తె కావడంతో నాగవైష్ణవి అంటే ప్రభాకరరావుకు ఎనలేని ప్రేమ. దీంతో ప్రభాకరరావు రెండవ భార్య ఇంటి వద్దే ఎక్కువ సమయం గడిపేవారు. దీంతో మెదటి భార్య, ఆమె సోదరుడు వెంకట్రావు.. తరచూ ప్రభాకరరావుతో వాదనకు దిగేవారు.

సంచలనం రేపిన ఘటన…

ఈ వివాదం జరుగుతున్న నేపథ్యంలోనే 2010 జనవరి 30వ తేదీన కారులో పాఠశాలకు వెళ్తున్న చిన్నారి నాగవైష్ణవిని దుండగులు కిడ్నాప్ చేశారు. అడ్డు వచ్చిన కారు డ్రైవర్ లక్ష్మణరావును కత్తితో గొంతులో పొడిచి హత్య చేశారు. ఇదే సమయంలో కారులో ఉన్న నాగవైష్ణవి సోదరుడు కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్నాడు. అప్పట్లో ఈ కిడ్నాప్, హత్య ఘటనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టవ్యాప్తంగా సంచలనం కలిగించాయి.

ఎముకలు కూడా మిగలకుండా…

నాగవైష్ణవిని ఎత్తుకెళ్లిన దుండగులు విజయవాడ నుంచి గుంటూరు వైపునకు వెళ్లారు. మార్గమధ్యంలోనే నాగ వైష్ణవిని గొంతు నులిమి చంపేశారు. ఆనవాళ్లు చిక్కకుండా ఉండేందుకు గుంటూరు ఆటోనగర్ లోని ఐరన్ బ్లాస్ ఫర్నీస్‌లో ఆమె మృతదేహాన్ని ఉంచి, ఎముకలు కూడా కరిగిపోయే విధంగా వేడిని పెంచి బూడిద చేశారు. అయితే బ్లాస్ట్ ఫర్నీస్ నుంచి నాగవైష్ణవి చెవి పోగులను సేకరించి ఎఫ్.యస్.ఎల్ కు పంపారు దర్యాప్తు అధికారులు. వజ్రం కావడంతో ఈ సాక్ష్యం హత్య కేసు విచారణలో కీలకంగా మారింది. పైగా కారు డ్రైవర్ ను హత్య చేసిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చారు. నాగవైష్ణవి తిరిగి వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులు ఇక కన్నకూతురు లేదనే చేదు నిజం తెలిసి తల్లడిల్లిపోయారు. తన గారాల పట్టి నాగవైష్ణవి ఇక లేదనే విషయం తెలుసుకున్న తండ్రి ప్రభాకర్ గుండె ఆగిపోయింది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పట్లో వైష్ణవి హత్య, తండ్రి గుండె ఆగి మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది.

నెరవేరని ప్రభుత్వ హామీ…

ఆనాడు హోంమంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి వైష్ణవి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ కేసు విచారణ ఎనిమిదిన్నరేళ్ళ పాటు జరిగింది. ఈ కేసులో ఎ-1గా మోర్ల శ్రీనివాసరావు, ఎ-2 గా యంపరాల జగదీష్, ఎ-3గా పలగాని ప్రభాకరరావు బావమరిది పంది వెంకటరావు గౌడ్ లను నిందితులుగా చేర్చిన పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 79మంది సాక్షులను, ఢిఫెన్స్ 30మంది సాక్షులను విచారించింది. పంది వెంకట్రావు గౌడ్‌ను కుట్రదారునిగా ఈ కేసులో పేర్కొన్నారు. అయితే.. నిందితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేస్తే పూర్తి వాస్తవాలు బయటపడతాయని అప్పట్లో వైష్ణవి తల్లి నర్మదాదేవి విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షిస్తే.. ఇటువంటి దారుణాలు ఆగుతాయని ఆమె చెప్పారు.

కూతురు, భర్త చెంతకు చేరిన తల్లి…

కన్న బిడ్డను, కట్టుకున్న భర్తను కళ్ళ ముందే కోల్పోయిన నర్మదాదేవి.. తీవ్ర మానసిక క్షోభను అనుభవించారు. కేసు విచారణ ఎంతకీ పూర్తి కాకపోవడంతో ఆమె పోలీసు అధికారుల చుట్టూ తిరిగారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ మారిన ప్రతిసారీ వెళ్లి తన కుమార్తె, భర్త చావుకు కారణమైన వారిని శిక్షించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. యేళ్ళ తరబడి సాగుతున్న కేసు విచారణతో ఆమె మరింత కుంగిపోయింది. దీనికి తోడు బ్రెయిన్ క్యాన్సర్ కూడా రావడంతో నాగవైష్ణవి తల్లి యేడాదిన్నర క్రితం మరణించారు.

కుటుంబాన్ని మొత్తం కోల్పోయి అనాధలైన పిల్లలు…

కుటుంబంలో తల్లి, తండ్రి, చెల్లెలిని కోల్పోయిన ఇద్దరు అబ్బాయిలు మిగిలిపోయారు. వారు కూడా ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోలేక పోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఇటువంటి కేసులలో కూడా విచారణ యేళ్ళ తరబడి సాగడంపై ప్రజా సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగ వైష్ణవిని కిడ్నాప్ చేసి, దారుణంగా హతమార్చిన ఘటన అందరి కలిచి వేసిందని, ఆ మనోవేదనతోనే తండ్రి పలగాని ప్రభాకర్ గుండె పోటుతో మృతి చెందారని ఎపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా మంత్రులు, అధికారులు వచ్చి వెళ్లారే తప్ప కేసు విచారణ మాత్రం పూర్తి కాలేదని విమర్శించారు. ఆ మానసిక క్షోభతోనే వైష్ణవి తల్లి నర్మదాదేవి, బాబాయి పలగాని సుధాకర్‌లు కూడా కన్నుమూశారని.. చిన్నారి వైష్ణవి మరణంతో ఆ కుటుంబం కకావికలంగా మారిపోయిందని తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క నాగవైష్ణవి హత్య పర్యవసానంగా.. మరో మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇటువంటి కేసులలో త్వరితగతిన తీర్పులు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందని దుర్గాభవాని అభిప్రాయ పడ్డారు.

ఎనిమిదేళ్లు జైలులోనే నిందితులు….

సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో గుంటూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది బ్రహ్మానందరెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. కేసు విచారణకు సంబంధించి అనేకమార్లు సుప్రీంకోర్టు, హైకోర్టుల వరకు వెళ్లడంతో కేసు విచారణలో జాప్యం జరిగింది. అయితే నిందితులైన మోర్ల శ్రీనివాస్, యంపరాల జగదీష్, పంది వెంకట్రావులు ఎనిమిది సంవత్సరాల నుంచి జైలులోనే ఉన్నారు. వారికి బెయిల్ కూడా లభించలేదు. ఇటువంటి కేసులలో విచారణ సత్వరమే జరిగి దోషులకు శిక్ష పడుతుందని అందరూ భావించారని, కానీ కేసు విచారణలో తీవ్ర జాప్యం జరిగిందని ప్రముఖ న్యాయవాది, పౌరహక్కుల సంఘం నేత పిచ్చుక శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కేసు విచారణ పూర్తవడంతో విజయవాడ కోర్టు న్యాయమూర్తి గురువారం తీర్పును ప్రకటించనున్నారు. దీంతో.. కేసు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

Sandeep
About Sandeep 5585 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*