వంగవీటి రియాక్షన్ ఎలా ఉంటుందో?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించగానే రెండు ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 1. టీడీపీ నేత యలమంచలి రవి పార్టీలో చేరడం. 2. గౌతమ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు ఎత్తి వేయడం. యలమంచలి రవి టీడీపీ నుంచి వైసీపీలో చేరడం వాస్తవానికి పార్టీకి మంచిదే. ఆయనకు ఒక సామాజిక వర్గం అండ ఉంది. దీంతో రవి రాకతో కొంత మేర వైసీపీ బలపడుతుందని ఆశించవచ్చు. అందులోనూ రవి పార్టీలో చేరుతున్న సందర్భంగా టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను టీడీపీ నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. తనను నాలుగేళ్లు వాడుకుని వదిలేసిందన్నారు. ప్రత్యేకహోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకోవడం తనకు నచ్చలేదని అందుకే వైసీపీలో చేరుతున్నట్లు రవి ప్రకటించారు. ఇంతవరకూ బాగానే ఉంది.

గౌతంరెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేత….

ఇక రెండో అంశం…పూనూరు గౌతంరెడ్డి పై సస్పెన్షన్ ను ఎత్తి వేయడం. వంగవీటి రంగాపై పూనూరు గౌతం రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌడీలాంటి రంగాను హత్య చేయడంలో తప్పేమీ లేదన్నారు. దీనిపై రంగా కుమారుడు వంగవీటి రాధా ఆగ్రహించి రోడ్డుపై బైఠాయించి ఆందోళన కూడా చేశారు. దీంతో కొన్ని నెలల క్రితం గౌతం రెడ్డిని పార్టీ నుంచి వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. గతంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గౌతంరెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నిజానికి గౌతంరెడ్డికి బెజవాడలో అంత పట్టేమీ లేదు. కార్పొరేటర్ గా గెలిచిన అనుభవం తప్ప ఆయనకు పెద్దగా ఓటు బ్యాంకు కూడా లేదు.

రెండు నెలల క్రితమే జగన్ ను కలిసి….

కాగా గౌతం రెడ్డి జగన్ కుటుంబ సభ్యులతో బంధుత్వం ఉండటంతో ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని ఎప్పటి నుంచో ఊహాగానాలు విన్పిస్తున్నాయి. దీనికి తోడు ఆయన రెండు నెలల క్రితం నెల్లూరు జిల్లాలో ఉన్న జగన్ ను కలవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌతమ్ రెడ్డిపై కాపు సామాజిక వర్గం గుర్రుగా ఉంది. రంగా చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కాపు సామాజిక వర్గానికి ఆరాథ్యదైవమే. అలాంటి రంగాను తూలనాడిన గౌతమ్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు తొలగించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

గుర్రుగా రాధా వర్గం….

విజయవాడలోకి జగన్ యాత్ర ప్రవేశించగానే ఆయనకు స్వాగతం పలికిన వారిలో వంగవీటి రాధా కూడా ఉన్నారు. పాదయాత్ర వద్దకు వచ్చిన రాధా కొద్దిసేపు ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గౌతమ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయడాన్ని రాధా వర్గీయులు తప్పుపడుతున్నారు. విజయవాడ కు వచ్చిన వెంటనే పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం గౌతమ్ రెడ్డి ఇచ్చిన వివరణతో తాము సంతృప్తి చెందామని అందుకే ఆయనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేశామని చెబుతున్నారు. మరి రాధా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*