ఏమి సేతురా…లింగా…!

ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని ఆ పార్టీలో అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మీద ఎమ్మెల్యేలు కొందరు నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల విజయ్ రూపానీని ముఖ్యమంత్రిగా మార్చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారని పాటేదార్ ఆందోళన సంఘం నేత హార్థిక్ పటేల్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే హార్థిక్ ఆరోపణలను బీజేపీనేతలు కొట్టిపారేశారు. విజయ్ రూపానీ మీద ఎవరూ అసంతృప్తిని ప్రకటించలేదని, ఆయనే సీఎంగా కొనసాగుతారని ప్రకటించారు.

తిరుగుబాటు……

ఈనేపథ్యంలో గుజరాత్ లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు విజయ్ రూపానీ సర్కార్ పై ధ్వజమెత్తడం విశేషం. ఇటీవల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చచ్చీ చెడీ గెలిచింది. చావు తప్పి కన్నులొట్లబోయిన చందంగా గెలిచినా బీజేపీ అధిష్టానం మరోసారి విజయ్ రూపానీనే ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెట్టింది. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలోనూ అలకలు ప్రారంభమయ్యాయి. ప్రాధాన్యత కలిగిన శాఖలు దక్కలేదంటూ అసమ్మతి స్వరాన్ని కొందరు గట్టిగానే విన్పించినా అధిష్టానం వారికి నచ్చజెప్పింది. సముదాయించింది. అంతా బాగుందనుకున్న సమయంలో మళ్లీ అసమ్మతి రాజుకుంది.

సీనియర్ ఎమ్మెల్యేలే….

వడోదర జిల్లాకు చెందిన మధు శ్రీవాస్తవ, యోగేష్ పటేల్, కేతన్ ఇందార్ లు సీనియర్ ఎమ్మెల్యేలు. వారి ప్రాంతంలో పట్టున్న నేతలు. అయితే వారిప్పుడు ముఖ్యమంత్రి విజయ్ రూపానీపై అసమ్మతితో రగలి పోతున్నారు. ఏకంగా మీడియా సమావేశం పెట్టి ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిగారు. తమ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించం లేదని, వినతి పత్రాలు ఇస్తే అధికారులు, మంత్రులు పట్టించుకోవడం లేదని వాళ్లు ముగ్గురూ ఆరోపిస్తున్నారు. ఇందులో మధువాస్తవ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

సర్కార్ పనితీరు బాగాలేదంటూ…

బీజేపీ సర్కార్ పనితీరు బాగాలేనందునే తాము ప్రజల పక్షాన నిలబడాల్సి వచ్చిందని వారంటున్నారు. అసలే మ్యాజిక్ ఫిగర్ కు అతి దగ్గరగా ఉన్న బీజేపీ వీరి అసమ్మతితో ఆందోళనకు గురవుతుంది. వీరితో పాటు భవిష్యత్లో పదమూడు నుంచి 23 మంది ఎమ్మెల్యేలు విజయ్ రూపానికి వ్యతిరేకంగా గళం విప్పుతారన్న సమాచారం కూడా కమలదళానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్ లో అసమ్మతిని పారదోలేందుకు అమిత్ షా యే స్వయంగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆరు రోజుల పర్యటనకు విదేశాలకు వెళ్లారు. ఆయన వచ్చే లోగా మరెంత మంది అసమ్మతి గళం విన్పిస్తారోనన్న టెన్షన్ పార్టీ అధినాయకత్వానికి పట్టుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*