పల్స్ అందడం లేదే….??

visakhapatanma-parlament-cosnituency-profile

కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేని పార్లమెంటు నియోజకవర్గమిది. ఇక్కడ గతంలో గెలిచిన వారిని చూసుకుంటే అదే అర్థమవుతుంది. అన్ని కులాల వారికీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో పట్టం కట్టారు. అలాగే ఇతర ప్రాంతాల వారినీ అక్కున చేర్చుకున్నారు. వివిధ భాషలు, సంస్కృతులకు నిలయమైన విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డవారు ఎక్కువే. ఇక్కడ ఓటర్లలోనూ ఉత్తర భారతదేవానికి చెందిన వారూ ఉన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ కొలువుదీరి ఉండటంతో ఇక్కడ ప్రాంతాలను, మతాలను, కులాలను కూడా పట్టించుకోరన్న పేరుంది.

స్థానికేతరులకే…..

విశాఖ పార్లమెంటు పరిధిలో విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం దక్షిణ, విశాఖ పట్నం ఉత్తర, విశాఖపట్నం పశ్చిమ, గాజువాక, ఎస్.కోట, భీమిలి శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఇప్పటివరకూ విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే తొమ్మిదిసార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుపొందింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు టి.సుబ్బరామిరెడ్డి, నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి, ఉమా గజపతిరాజు, దగ్గుబాటి పురంద్రీశ్వరిలు గెలుపొందారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులే కావడం విశేషం. స్థానికులుగా ద్రోణంరాజు సత్యనారాయణ, ఎంవీవీఎస్ మూర్తి, కంభంపాటి హరిబాబులు విజయం సాధించారు.

గత ఎన్నికల్లో…..

ఈలెక్కలన్నీ చూస్తే స్థానికులు కంటే స్థానికేతరులే ఎక్కువసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలసి పోటీ చేశాయి. బీజేపీ అభ్యర్థిగా కంభంపాటి హరిబాబు పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో విజయమ్మ లక్షా ముప్ఫయి వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడం విశేషం. విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏ ఒక్క అసెంబ్లీ సీటు కూడా వైసీపీ గెలవకపోవడం కూడా ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. దీంతో విజయమ్మ ఘోరంగా ఓటమి పాలు కావాల్సి వచ్చింది.

త్రిముఖ పోటీలో….

ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కంభంపాటి హరిబాబు బరిలోకి దిగుతున్నారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించాక బీజేపీ కొంత పుంజుకుంది. అలాగే టీడీపీ తరుపున అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున రియల్టర్ సత్యనారాయణ పోటీ చేస్తారంటున్నారు. టీడీపీ తన అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావును పోటీ చేయించే అవకాశముందని తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా బరిలోకి దిగనుంది. జనసేన కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. భారతానికి చెందిన ఓటర్లపైనే బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుండటంతో గెలుపు ఎవరదనేది చెప్పడం కష్టమే. హోరా హోరీ పోరు మాత్రం జరగనుంది. మరి ఈసారి విశాఖ పార్లమెంటు నుంచి ఏ పార్టీ జెండా ఎగరనుందో వేచిచూడాల్సిందే.

Ravi Batchali
About Ravi Batchali 15976 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*