అయ్యా.. విష్ణు.. మీదే స్కూలు?!

చెరువు గ‌ట్ల ప‌క్క‌న కూర్చునే స‌మ‌యంలో మాట్లాడుకునే మాట‌ల్లా ఉన్నాయ‌ని అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్య‌లు. నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కొంత సేపు టీడీపీ అధినేత చంద్ర‌బాబును దుమ్మెత్తిపోస్తూనే.. మ‌రోప‌క్క‌, ఆయ‌న అమాయ‌కుడ‌ని చెబుతున్నారు. దీంతో అస‌లు విష్ణు.. మీరే స్కూల్‌లో చ‌దివారు? అంటూ నెటిజ‌న్లు కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. దీంతో ఒక్క‌సారిగా ఆయ‌న ఏ విధంగా ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాడు? ప్ర‌స్తుతం ఆయ‌న ఏం చేస్తున్నారు? రాబోయే రోజుల్లో ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఎలా ఉండ‌నుంది? వ‌ంటి కీల‌క విష‌యాలు తాజాగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. విశాఖప‌ట్నం ఉత్త‌ర నియోక‌వ‌ర్గం నుంచి 2014లో పోటీ చేసి గెలుపొందారు విష్ణుకు మార్ రాజు.

గత ఎన్నికల్లో…..

వాస్త‌వానికి అప్ప‌టి టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా విష్ణుకు ఆ సీటు కేటాయించారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి చొక్కాకుల వెంక‌ట్రావుపై 18000 పైచిలుకు ఓట్ల ఆధిక్య‌త‌తో గెలుపొందారు విష్ణు. అప్ప‌టి నుంచి ఈ ఏడాది ప్రారంభం వ‌ర‌కు కూడా ఆయ‌న బీజేపీ ఎమ్మెల్యేగా కంటే.. అధికార టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతూ వ‌చ్చారు. అంతేకాదు, రాష్ట్ర ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు నేరుగా భాగ‌స్వామ్యం లేన‌ప్ప‌టికీ.. ఉన్న‌ట్టుగానే ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. చంద్ర బాబును మ‌హానాయ‌కుడిగా పోల్చి.. అసెంబ్లీలో అంద‌రినీ నివ్వెర‌ప‌రిచాడు.

చంద్రబాబు మాత్రమే కట్టగలరని…..

ఇక‌, పోల‌వ‌రం ప్రాజెక్టును అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైంద‌ని, క‌డితే బాబు మాత్రమే క‌ట్ట‌గ‌ల‌ర‌ని పొగ‌డ్త‌లు కురిపించేవారు. అదేస‌మ‌యంలో విప‌క్షం వైసీపీపై నిప్పులు చెరిగేవారు. ఇక‌, ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీని రాష్ట్ర టీడీపీ నేత‌లు ఇరుకున పెట్టినా విమ‌ర్శించినా విష్ణు ఎప్పుడూ నోరు మెద‌ప‌లేదు. దీంతో అంద‌రూ విష్ణు అస‌లు బీజేపీ నాయ‌కుడా? టీడీపీలోచేరాడా? అని చ‌ర్చించుకునేవారు. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. టీడీపీ.. బీజేపీతోను, ఎన్డీయేతో నూ బంధాన్ని తెంచుకున్న నేప‌థ్యంలో విష్ణు కూడా త‌న స్వ‌రం మార్చుకున్నాడు. కాబోయే సీఎం జ‌గ‌నే నంటూ వ్యాఖ్య‌లు కుమ్మ‌రించాడు.

బాబు తప్ప అంతా ముదుర్లే…..

ఇంత‌లోనే చంద్ర‌బాబు అమాయ‌కుడ‌ని, టీడీపీలో బాబు త‌ప్ప మిగిలిన వారు ముదుర్ల‌ని పేర్కొన్నాడు. దీంతో అస‌లు విష్ణు రాజ‌కీయాల్లో ఇలాంటి కుప్పిగంతులు ఏంట‌ని అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. కొంత సేపు బాబును తిడుతున్న విష్ణు.. మ‌రికొంత సేపు ఇలా పొగడ్త‌ల‌తో కాలం గ‌డుపుతున్నారు. మొత్తానికి ఆయ‌న వ్య‌వ‌హారం రాష్ట్రంలోను, బీజేపీలోనూ కూడా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది మ‌రి విష్ణు త‌న రాజ‌కీయాల గురించి ఏదో ఒక క్లారిటీ ఇస్తే.. బాగుంటుంది క‌దా?! అంటున్నారు ఆయ‌న అభిమానులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*