ఈ సిఎం సిక్సర్ కొడతారా? మిస్సవుతారా?

what-about-mizoram-cheif-minister-laltanhwalas-future

మిజోరామ్ ముఖ్యమంత్రి లాల్ తన్హ్ వాలాపై కాంగ్రెస్ గట్టి ఆశలనే పెట్టుకుంది. పార్టీని ఒడ్డున పడేసే బాధ్యతను ఆయన భుజస్కంధాలపై మోపింది. ఈశాన్య భారతంలో హస్తం పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమిదే. ఆ మాటకు వస్తే దేశ వ్యాప్తంగా పంజాబ్ తర్వాత అధికారంలో ఉన్నది మిజోరాం మాత్రమే. కర్ణాటకలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి మాత్రమే. అందువల్లే హస్తం పార్టీకి మిజోరాం ప్రతిష్టాత్మకంగా మారింది. సాధారణంగా ఈశాన్య భారతంలో జాతీయ పార్టీ నాయకులకు పెద్దగా ప్రజాదరణ ఉండదు. ప్రాంతీయ పార్టీల నాయకులదే హవా. జాతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీలోని స్థానిక నాయకులదే పెత్తనం. గెలుపోటములు స్థానిక నాయకత్వంపై ఆధారపడి ఉంటాయి. మిజోరాంలో కాంగ్రెస్ పార్టీ పరస్థితీ అంతే. రాష్ట్రపరంగా చూస్తే లాల్ తన్హ్ వాలా హస్తం పార్టీకి కళ్లు, చెవులు వంటి వారు. 1973 నుంచి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఆయనే. అంటే నాలుగున్న దశాబ్దాల నుంచి పార్టీ వ్యవహరాలను చక్కబెడుతున్నది ఆయనే కావడం విశేషం. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా, అయిదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన లాల్ తన్హ్ వాలా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సీనియర్ నాయకుల్లో ఒకరు.

క్లర్క్ నుంచి ముఖ్యమంత్రి వరకూ……

1942 మే 19న జన్మించిన తన్హ్ వాలా 1958లో మెట్రిక్యులేషన్ చేశారు. తర్వాత బీఏ చదివారు. డీఈవో కార్యాలయంలో క్లర్కుగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అనంతరం అసోం కో-ఆపరేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ గా పనచిేశారు. 60వ దశకంలో ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాలపై దృష్టి సారించారు. 1966లో మిజో నేషనల్ ఫ్రంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. దీంతో ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి సిల్బార్ జైలుకు తరలించింది. 1967లో జైలు నుంచి విడుదలయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన దశ తిరిగింది. అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, పీసీీసీ చీఫ్ గా, ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు కృషి చేశారు. కాంగ్రెస్ అంటే లాల్ తన్హ్ వాలా అన్నంతగా ఎదిగిపోయారు. 1973లో పీసీసీ చీఫ్ గా నియమితులైన ఆయన ఇప్పటి వరకూ ఆ పదవిలోనే కొనసాగుతుండటం విశేషం. 45 సంవత్సరాల నుంచి పదవిలో ఉంటూ రాష్ట్ర వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్నారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అది మొదలు ఆయనకు తిరుగులేకుండా పోయింది. 1984లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్నారు. 1986లో కేంద్రానికి, మిజోనేషనల్ ఫ‌్రంట్ (ఎంఎన్ఎఫ్) కు శాంతి ఒప్పందం కుదరడంతో పార్టీ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఎంఎన్ఎఫ్ నాయకుడు లాల్ డెంగా ముఖ్యమంత్రి కావడంతో ఆయన వద్ద లాల్ తన్హ్ వాలా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1987లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాల్ డెంగా పార్టీ పరాజయం పాలైంది. లాల్ తన్హ్ వాలా ఆధ్వర్యంలోని హస్తం పార్టీ విజయం సాధించడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు అందుకున్నారు. 1998లో మాత్రం ఓటమి చవి చూశారు. తిరిగి 2003లో అధికారాన్ని చేజిక్కించుకుని ముఖ్యమంత్రి అయ్యారు. 2013లోమళ్లీ ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లిన హస్తం పార్టీ విజయదుందుభి మోగించింది. మొత్తం 40 స్థానాలకు గాను 34 గెలుచుకుని తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడం ఇది అయిదోసారి. 1978, 1979, 1984, 1987, 1993, 2003, 2008, 2013 ఎన్నికల్లో వరసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ అయిదు స్థానాల్లో నెగ్గగా, మిజోరాం పీపుల్స్ కాన్ఫరెన్స్ ఒక స్థానానికి మాత్రమే పరిమితమైంది.

కమలం కన్ను వారిపైనే……

ప్రస్తుత ఎన్నికల్లో లాల్ తన్హ్ వాలాకు గట్టిపోటీ ఎదురవుతోంది. మిజో నేషనల్ ఫ్రంట్, బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు, మిజో నేషనల్ కన్వెక్షన్ వంటి ప్రాంతీయ పార్టీలు హస్తం పార్టీని సవాల్ చేస్తున్నాయి. బీజేపీకి ఇక్కడ పెద్దగా బలం లేనప్పటికీ ప్రాంతీయ పార్టీల సాయంతో కాంగ్రెస్ ను ఢీకొట్టాలని చూస్తోంది. క్రైస్తవులు ఆధిక్యంగల రాష్ట్రంలో హిందుత్వ పార్టీ అయిన బీజేపీకి పునాదులు లేవు. 1993 నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఒక్క చోటా గెలవలేదు. మతమార్పిడులకు పాల్పడుతుందన్న భయం క్రైస్తవుల్లో ఉండటమే ఇందుకు కారణం. చక్మా బౌద్ధులు, హిందువులు, ఇతర మైనారిటీలు ఆధిక్యం గల 11 నియోజకవర్గాలపై దృష్టి సారించింది. త్రిపుర నుంచి వలస వచ్చిన బ్రూ తెగకు చెందిన వారికి ఇక్కడ ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర హోంశాఖ కల్పించింది. వీరి ఓట్లపై కమలం పార్టీ ఆశలు పెట్టుకుంది. మొత్తం మీద ఈ ఎన్నికలను ఎదుర్కొనడం హస్తం పార్టీకి, లాల్ తన్హ్ వాలాకు అంత తేలికకాదు. కమలం పార్టీ తనంతట తాను ఢీకొనలేకపోయినా ప్రాంతీయ పార్టీల మద్దతుతో హస్తం పార్టీని గద్దె దించడానికి కృషి చేసింది. ఎన్నికల అనంతరమే కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు. “కాంగ్రెస్ ముక్త్ భారత్” నినాదాన్ని అమిత్ షా నిజం చేయలేకపోయినా ” కాంగ్రెస్ ముక్త ఈశాన్య భారత్” నినాదాన్ని సాకారం చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*