పెళ్లామే పగబడితే….?

విజయనగరం జిల్లాలో నవదంపతులపై దోపిడీ దొంగల దాడి కేసు ఊహించని మలుపు తిరిగింది. భర్తను చంపి భార్య మెడలో నగలు కాజేసిన సంఘటన రేపిన కలకలం అంతా ఇంతా కాదు. విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్‌ సమీపంలో ఆ దోపిడీ ఓ పెద్ద నాటకమని తేలిపోయింది. భార్య వేసిన స్కెచ్‌ ప్రకారమే ఇదంతా జరిగినట్టు విచారణలో బయటపడింది. భర్త అడ్డు తొలగించుకునేందుకు భార్యే ప్రియుడితో కలిసి మర్డర్‌ స్కెచ్‌ వేసినట్టు తెలుసుకొని ఇప్పుడంతా షాకవుతున్నారు.

పెళ్లయిన పదిరోజులకే….

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరావు ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. కర్ణాటకలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతితో ఈ ఏడాది ఏప్రిల్‌ 28న పెళ్లైంది. అంటే పెళ్లై పదిరోజులు మాత్రమే. దంపతులిద్దరూ సోమవారం బైక్‌ సర్వీసింగ్‌ ఇచ్చేందుకు పార్వతీపురం వచ్చారు. సాయంత్రం సమయంలో ఇంటికి తిరిగి బయల్దేరారు. గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్‌ సమీపంలోని ఐటీడీఏ పార్కు దగ్గర టాయిలెట్‌ వెళ్లేందుకు కాసేపు ఆగారు. సరిగ్గా అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి దాడి చేశారు. రాడ్డుతో శంకర్రావును తలపై గట్టిగా కొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు.

దోపిడీదొంగలు చంపేశారంటూ….

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శంకర్రావు మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సరస్వతిని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. తన భర్తను దోపిడీ దొంగలు కొట్టి చంపేశారంటూ సరస్వతి కన్నీరుమున్నీరైంది. తన మెడలో ఆరు తులాల గొలుసు దోచుకెళ్లారంటూ పోలీసులతో చెప్పుకొని ఏడ్చింది. రంగంలోకి దిగిన ఏఎస్పీ బాధితురాలిని పరామర్శించి వివరాలు సేకరించారు. దొంగలు ఒరియాలో మాట్లాడారని ఓసారి, తెలుగులో అని ఇంకోసారి చెప్పడంతో పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేశారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తే ఎలాంటి క్లూస్‌ దొరకలేదు. దొంగలు తనను కొట్టారని సరస్వతి చెప్పినా… ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదు.

ఇష్టంలేని పెళ్లి చేసినందుకు….

దీంతో సరస్వతిపై అనుమానంతో పలు కోణాల్లో ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానాలు బలపడ్డాయి. సరస్వతి కాల్ డేటాను విశ్లేషించారు. గత పది రోజులుగా ఆమె ఎవరెవరితో టచ్‌లో ఉంటోంది అని ఆరా తీశారు. అప్పటి వరకు దోపిడీ దొంగలు దాడి చేసి శంకర్రావును చంపారని, నగలు దోచుకెళ్లారని అంతా అనుకున్నారు. కానీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేయడంతో అసలు కథ బయటపడింది. అది అసలు దోపిడీ దొంగల దాడి కాదు. పక్కా ప్రీప్లాన్డ్‌ మర్డర్‌. చంపించింది ఎవరో కాదు. కట్టుకున్న భార్యే.కేసులో క్లారిటీ రావడంతో ప్రధాన సూత్రధారి సరస్వతిని తెల్లవారుజామున అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. ఇష్టం లేని పెళ్లి చేసినందుకే హత్య చేయించినట్టు నిందితురాలు ఒప్పుకుంది. శంకర్రావు తల్లిదండ్రులు, బంధువుల్ని పిలిపించి పెళ్లికి ముందు జరిగిన వ్యవహారంపై ఆరా తీశారు. పెళ్లి ఫోటోల్లో ముభావంగా కనిపించడానికి కారణం అసలు పెళ్లి సరస్వతికి ఇష్టం లేకపోవడమేనని తేలింది.

ఫేస్ బుక్ లో పరిచయం…..

అసలు సరస్వతి ఎవరు? శంకర్రావు ఎవరు? వీరికి పెళ్లి ఎలా కుదిరింది? ఆ తర్వాత ఏం జరిగింది? అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిశాయి. శంకర్రావు సరస్వతికి స్వయానా మేనబావ. ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. గత నెల 28న ఘనంగా పెళ్లి చేశారు. కానీ సరస్వతికి ఈ పెళ్లి ఇష్టం లేదు. అందుకే కట్టుకున్నవాడిని హత్య చేయించింది.మేనబావ శంకర్రావుతో సరస్వతికి పెళ్లి చేయాలని ఇరువైపుల పెద్దలు చాలా ఏళ్లుగా అనుకుంటున్నదే. కానీ ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదు. కారణం మరొకరితో ప్రేమాయణమే. సరస్వతి ప్రియుడి పేరు శివ. వీరిద్దరికీ రెండేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు శంకర్రావుతో పెళ్లి కుదిర్చారు. ఇంకా చదువుకుంటానన్నా, ఉద్యోగం చేస్తానని చెప్పినా సరస్వతి మాట వినిపించుకోలేదు. చివరకు పెద్దల ఒత్తిడితో సరస్వతి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.

మనసంతా శివమీదే….

పెళ్లైతే చేసుకుంది కానీ… మనసంతా శివ మీదే. పెద్దలు తనకు ఇష్టం లేని పెళ్లి చేశారన్న ఆవేదనతో ఉంది సరస్వతి. ఇదే విషయాన్ని తన ప్రియుడు శివతో పంచుకుంది. కాపురం చేయలేకపోతున్నానని చెప్పింది. తన భర్తతో కాపురం చేయడం ఇష్టం లేదని, అడ్డుతొలగించాలని ప్రియుడి సాయం కోరింది. అతను వైజాగ్‌కు చెందిన మెరుగు గోపిని పరిచయం చేశాడు. ముగ్గురూ కలిసి శంకర్రావు మర్డర్‌కు స్కెచ్చేశారు. దీంతో ప్లాన్‌ ప్రకారం భర్తను సోమవారం పార్వతీపురం తీసుకొచ్చింది భార్య. తిరిగి వెళ్లేటప్పుడు నిర్మానుష్య ప్రాంతంలో ఆగాలని ముందే ప్లాన్‌ చేసుకున్నారు. అప్పటికే నిందితులు ఆటోలో సిద్ధంగా ఉన్నారు. సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్‌పై వెళ్తుండగా ఆటోలో అనుసరించారు నిందితులు. ఓచోట దంపతులు ఆగినప్పుడు ప్లాన్‌ అమలు చేద్దామనుకున్నారు. కానీ అక్కడ జనం ఉండటంతో హత్యకు ప్రయత్నించలేదు. ఆ తర్వాత పార్కు దగ్గర టాయిలెట్‌ వెళ్లేందుకు బైకు ఆపారు. దంపతులు పార్క్‌ దగ్గరకు రావడం… నిందితులు శంకర్రావుపై దాడి చేసి చంపడం… అంతా నిమిషాల్లో జరిగిపోయింది.

ఎస్పీకి కంటపడిన…..

నిందితులు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయిన తర్వాత నగలు దాచిపెట్టిన సరస్వతి దోపిడీ డ్రామా మొదలుపెట్టింది. ఎక్కడా అనుమానం రాకుండా నాటకాన్ని రక్తికట్టించింది. పోలీసులు సైతం కాసేపు దోపిడీ దొంగల దాడేనని నమ్మేశారు కూడా. ఆ తర్వాత ఉన్నతాధికారులు రంగంలోకి దిగిన తర్వాత అనుమానాలు తొలగిపోయాయి. ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ వస్తున్న సమయంలో… మానాపురం సమీపంలో ఆటోలో పారిపోతున్న నిందితులు కంటపడ్డారు. వారి తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆటోను ఆపి ఎస్పీ ప్రశ్నించారు. విజయనగరం వెళ్తున్నామని ఓసారి, వైజాగ్‌ వెళ్తున్నామని మరోసారి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎస్పీకి అనుమానం వచ్చింది. గట్టిగా ప్రశ్నించడంతో… శంకర్రావు హత్యతో వారికి సంబంధం ఉందని తేలిపోయింది. నిందితుల్ని గజపతినగరం స్టేషన్‌కు తరలించి విచారించారు. సరస్వతితో పాటు నిందితుల వాట్సాప్‌ ఛాటింగ్‌, ఫేస్‌బుక్‌, టవర్‌ లొకేషన్‌, కాల్‌ డేటా… అన్నీ మూడున్నర గంటల్లో విశ్లేషించడంతో మిస్టరీ వీడిపోయింది.

గోపీ గ్యాంగ్ అరెస్ట్….

ఈ కేసులో సరస్వతితో పాటు గోపి గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. పరారీలో ఉన్న సరస్వతి ప్రియుడు శివ కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్లు, ఆటో, బంగారు ఆభరణాలు, ఇనుప రాడ్డు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు బీటెక్‌ స్టూడెంట్‌ ఉండటం పోలీసుల్ని విస్మయపర్చింది. రిమాండ్‌ తర్వాత నిందితుల్ని మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారిస్తామంటున్నారు పోలీసులు. శంకర్రావును హత్య చేయించింది కట్టుకున్న భార్యేనని తెలుసుకొని బంధువులు, కుటుంబ సభ్యులు షాక్‌ తిన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*