జగన్ కి దెబ్బ పడటం ఖాయమా …?

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి ఈక్వేషన్స్ మారిపోతుంటాయి. గత ఎన్నికల్లో వైఎస్సాఆర్ పార్టీ హవాకు బ్రేక్ వేసేందుకు టిడిపి, బిజెపి, జనసేన ఒక్కటై పోరాడి అధికారాన్ని దక్కించుకున్నాయి. ఆ మూడు పార్టీలు కలిసినా కేవలం టిడిపి వైసిపి నడుమ ఐదు లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉండటం చర్చనీయాంశం అయ్యింది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి మరణం తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజల్లో సానుభూతి వెల్లువలా వస్తున్న అంశాలను గమనించే రాజకీయ చతురుడు చంద్రబాబు పక్కా వ్యూహాన్ని అమలు చేశారు. ఆయన ఎత్తులకు ప్రత్యర్థి జగన్ అధికారానికి దగ్గర వచ్చి బోల్తా పడ్డారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తన అపార రాజకీయ అనుభవాన్ని మొత్తం రంగరించి వైసిపిని మరోసారి అడ్డుకోవడానికి సరికొత్త వ్యూహం రచించారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఏడాది ముందే స్కెచ్ …

సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు ఏపీలో రాజకీయాలు ఒక రేంజ్ లో హీటెక్కిపోయాయి. కారణం పవన్ కళ్యాణ్. గత ఎన్నికల్లో చంద్రబాబు కి మద్దతు ఇచ్చిన జనసేన ఏ స్థానానికి పోటీ చేయలేదు. ఓట్ల చీలిక నివారించడానికి జనసేన పోటీకి దూరంగా వున్నా బిజెపి, టిడిపి ల విజయానికి తీవ్రంగా శ్రమించింది. తాజాగా ఇప్పుడు జనసేన టిడిపి పై యూటర్న్ తీసుకుంది. పవన్ కొట్టిన దెబ్బకు టిడిపి మైండ్ బ్లాంక్ అయ్యిందనే చెప్పాలి. కోస్తాలో బలమైన కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ టిడిపి కి దూరంగా పోతుందనేది స్పష్టం అయిపొయింది. మరోపక్క బిజెపి తో కూడా పవన్ ఎప్పటినుంచో దూరం పాటిస్తున్నారు. హోదా, విభజన అంశాలు పై కేంద్రం మొండి చెయ్యి చూపినప్పటి నుంచి ఆయన మోడీ వ్యతిరేక వైఖరినే అనుసరిస్తూ వస్తున్నారు. సో ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసిపి వైపు మళ్ళకుండా జనసేన టిడిపి పక్కా వ్యూహంగా కొందరు నిర్ధారిస్తున్నారు. ఫలితంగా ఎన్నికల అనంతరం టిడిపి, జనసేన, బిజెపి తిరిగి ఏకం అయి తమ ఉమ్మడి ప్రత్యర్థికి మరోసారి అధికారం లోకి రాకుండా చెక్ పెట్టడానికే ఎత్తుగడలు అంటున్నారు.

టిడిపి, జనసేన వైరం అందుకేనా …

నియోజక వర్గాల పెంపు ఎప్పుడైతే లేదో అధికారపార్టీ కి అనేక తలనొప్పులు మొదలయ్యాయి. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి వున్న పార్టీని నమ్ముకుని టికెట్ ఆశిస్తున్న వారికి న్యాయం చేయలేని దుస్థితి. ఈ నేపథ్యంలో ప్రత్యమ్నాయం టిడిపికి జనసేన మాత్రమే. సో రెండు పార్టీల నడుమ యుద్ధం అనివార్యంగా మార్చి కాపు వెర్సెస్ బిసి లుగా విడతీసి పరమపద సోపానం లో చివరి నిచ్చెన ఎక్కాలన్నది బాబు మాస్టర్ స్కెచ్ అంటున్నారు కొందరు. 2009 ఎన్నికల్లో ఇదే స్కెచ్ తో చిరంజీవి పార్టీ పెట్టేలా చేసి టిడిపికి చెక్ పెట్టి ఆ తరువాత కాంగ్రెస్ లో ప్రజా రాజ్యం విలీనం అయ్యేలా వైఎస్ చేసిన వ్యూహ రచనే బాబు కాపీ కొట్టారన్నది విశ్లేషకుల అనుమానం. వైసిపి అధినేత జగన్ కి మైనారిటీ, క్రిస్టియన్ ల ఓటు బ్యాంక్ తో బాటు సొంత సామాజిక వర్గం అండగా వున్నాయి. ఈ ఓటు బ్యాంక్ లకు తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు జత అయితే అధికారం ఖాయం అన్న ఈక్వేషన్ సామాన్యులు సైతం చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి వ్యూహాత్మక అడుగులు వేస్తూ గత మిత్రులను శత్రువులుగా మార్చుకుని తాజా కురుక్షేత్రంలో జగన్ సేనను మట్టికరిపించాలని చూస్తుందన్న రాజకీయ విశ్లేషకుల పరిశీలన ఈమేరకు నిజమో రాబోయే ఎన్నికలే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*