జగన్…ఏక్ నిరంజన్…..!

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల పొత్తులు, ఎత్తులపై ఇప్పుడే దృశ్యం ఆవిష్కృతమయింది. ఏపీలో జగన్ ఒంటరిపోరుకు సిద్ధమవ్వక తప్పదు. మంగళవారం జరిగిన ఈ సంఘటన వచ్చే ఎన్నికల్లో జగన్ ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నారు.ప్రత్యేక హదా కోసం జగన్ పార్టీ ఇచ్చిన పిలుపుకు అన్ని పార్టీలూ దూరంగా ఉన్నాయి. వైసీపీ ఒక్కటే ఏపీ బంద్ ను నిర్వహించింది.  ఇప్పటి వరకూ కుదిరితే….జనసేన …కమ్యునిస్టుల వంటి పార్టీలతో జగన్ పార్టీ పొత్తు కుదుర్చుకుంటుందన్న ఊహాగానాలు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ పవన్ కల్యాణ్ తో చర్చిస్తున్నారని, జనసేన మద్దతుతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పీకే రంగం సిద్ధం చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

జగన్ పలుమార్లు ప్రకటించినా…..

కాని అది సాధ్యం కాకపోవచ్చు. జగన్ తొలి నుంచి తాను ఒంటరిగానే బరిలోకి దిగుతానని చెబుతున్నారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని, గత ఎన్నికల్లో మాదిరిగానే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు పలుమార్లు జగన్ ప్రకటించారు.కాని మంగళవారం వైసీపీ ఇచ్చిన బంద్ కు ఏ పక్షమూ కలసి రాలేదు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ, విభజన హామీలు అమలు చేయాలంటూ ఈరోజు వైసీపీ ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిచ్చింది. అయితే సాధారణంగా కమ్యునిస్టులు ఈ ఆందోళనకు కలసి రావాల్సి ఉంది.

కామ్రేడ్లు కూడా దూరం…..

కాని జనసేన అధినేత నుంచి బంద్ పై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో కమ్యునిస్టులు కూడా వైసీపీ బంద్ కు మద్దతు ఇవ్వలేదు. జనసేనాని తో కలసి వెళదామనుకుంటున్న కామ్రేడ్లకు వైసీపీతో కలసి నడవటం ఇష్టం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ కు మద్దతివ్వబోమని స్పష్టం చేసింది. కాంగ్రెస్ అధికార టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడుతోంది. రాష్ట్రాన్ని విభజించినా…విభజన హామీలు అమలు చేయకపోవడంతో బీజేపీపై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పై ప్రజల్లో ఆవేశం పాళ్లు కొంత తగ్గినట్లు ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే చంద్రబాబుతో కలసి నడవాలని నిర్ణయించుకున్నారు.

నేరుగానా? లోపాయికారీగానా?

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో చంద్రబాబు నేరుగా పొత్తు పెట్టుకుంటారా? లేక లోపాయికారీ అవగాహన కుదుర్చుకుంటారా? అన్నది ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ మాత్రం పొత్తుకోసం అర్రులు చాస్తుందని చెప్పక తప్పదు. అందుకే వైసీపీకి దూరంగా టీడీపీకి దగ్గరవ్వడానికి ఈ బంద్ ను కాంగ్రెస్ ఉపయోగించుకుందంటున్నారు. ఇక జనసేన, కమ్యునిస్టులు కలసి పోటీ చేస్తే ఏపీలో ఈ సారి త్రిముఖ పోటీ తప్పదు. బీజేపీని కలుపుకుని వెళ్లే ధైర్యం ఏ పార్టీ చేయదు కాబట్టి అది ఒంటరిగానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. సో…మంగళవారం వైసీపీ ఇచ్చిన బంద్ రానున్న ఎన్నికల్లో పొత్తులపై ఒక క్లారిటి ఇచ్చిందంటున్నారు విశ్లేషకులు. ఇక జగన్ ఏక్ నిరంజన్ అని చెప్పక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*