కడపపై జగన్ నిర్ణయం మారిందా?

రాష్ట్రంలో అత్యంత ప్ర‌తిష్టాత్మక ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం క‌డ‌ప‌. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 1989 నుంచి వైఎస్ కుటుంబ‌మే గెలుస్తూ వ‌స్తోంది. ఎంత‌టి ఉద్ధండులు ఇక్కడ పోటీ చేసినా.. కూడా వైఎస్ కుటుంబ‌మే గెలుపు గుర్రం ఎక్కుతోంది. ఇక్కడ నుంచి 2009లో వైఎస్ జ‌గ‌న్ ఎంపీగా పోటీ చేసిన స‌మ‌యంలో అత్యధిక మెజారిటీతో గెలుపొంద‌డం సంచ‌ల‌నం సృష్టించింది. అప్పట్లో జ‌గ‌న్ ఐదు ల‌క్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొంది దేశంలోనే రికార్డు సృష్టించారు. ఇక‌, అప్పటి నుంచి ఇక్కడ బ‌రిలో దిగే అభ్యర్థుల‌పై రాజ‌కీయ నేత‌ల అంచ‌నాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. ఓవ‌రాల్‌గా చూస్తే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు ద‌శాబ్దాలుగా ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ వాళ్లే ఎంపీలుగా గెలుస్తున్నారు.

వైఎస్ ఫ్యామిలీదే…..

దివంగ‌త మాజీ సీఎం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నాలుగుసార్లు, ఆయ‌న సోద‌రుడు వివేకానందరెడ్డి రెండుసార్లు, వైఎస్ త‌న‌యుడు జ‌గ‌న్ రెండుసార్లు, ప్రస్తుతం వైఎస్ సోద‌రుడి కుమారుడు అవినాష్ ఇలా గెలుస్తూ వ‌స్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ఈయ‌న ల‌క్షా 90 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి ఏంటి? ఇక్కడ ఓట్ల శాతం పెరుగుతుందా? అనేక వ్యూహాల‌తో ముందుకు వెళ్తున్న టీడీపీని ఇక్కడి ప్ర‌జ‌లు ఆద‌రిస్తారా? ఇప్పుడు ఇవే కీల‌క ప‌రిణామాలుగా, ప్రశ్నలుగా మిగిలాయి.

గత ఎన్నికల్లో…….

గ‌త 2014 ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీ స్థానం నుంచి టీడీపీ త‌ర‌ఫున రెడ్డప్పగారి శ్రీనివాస‌రెడ్డి బ‌రిలో నిలిచారు. ఏదో నిలిచామంటే నిలిచామ‌ని కాకుండా.. ఆయ‌న చాలా గ‌ట్టి పోటీనే ఇచ్చారు. అవినాష్ రెడ్డికి తొలి రెండు రౌండ్ల‌లోనూ చెమ‌ట‌లు ప‌ట్టించారు. దాదాపు 4 ల‌క్షల 81 వేల పైచిలుకు ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఈ రేంజ్‌లో గ‌తంలో ఎవ‌రూ ఇక్కడ ఓట్లు పొంద‌క‌పోవ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. ఇప్పుడు వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. అవినాష్ రెడ్డిపై టీడీపీ వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఇక్కడ గెలుపొంది బెంగ‌ళూరుకే ప‌రిమిత‌మవుతు న్నాడ‌ని, ఆయ‌న కోసం ప్రజ‌లు అప్పాయింట్‌మెంటు తీసుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని టీడీపీ చేస్తున్న ప్రచారం ఒకింత వర్కవుట్ అవుతోంది.

టీడీపీ టిక్కెట్ ఆయనకే…..

అదే స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ఈ టికెట్‌ను శ్రీనివాస‌రెడ్డికే కేటాయించాల‌ని నిర్ణయించుకోవ‌డం, ఆయ‌నైతేనే.. వైఎస్ ఫ్యామిలీకి స‌రైన ప్రత్యర్థిగా ప్రచారం జ‌రుగుతుండ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ `నువ్వా-నేనా` అనే రేంజ్‌లోనే సాగ‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్ ఫ్యామిలీ నుంచి క్క‌డ పోటీ చేసిన అవినాష్ రెడ్డి క్లాస్ పొలిటిషీయన్ అవ్వడం వైసీపీకి మైన‌స్‌గా మారింది. క‌డ‌ప లాంటి చోట్ల ఫుల్ మాస్ యాంగిల్ ఉంటేనే టీడీపీకి స‌రైన ప్రత్యర్థిగా ఉన్నట్లవుతుంద‌ని భావిస్తోన్న జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవినాష్‌ను ప‌క్కన పెట్టేస్తార‌న్న టాక్ కూడా వినిపిస్తోంది.

సోదరికి అవకాశమిస్తారా?

దీనికి తోడు క‌డ‌ప జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బాధ్యత‌లు అవినాష్‌కు అప్పగిస్తే ఆయన మేనేజ్‌మెంట్ ఫెయిల్ అయ్యి వివేక ఓడిపోయారు. ఇది వైఎస్ ఫ్యామిలీకి మాయ‌ని మ‌చ్చ. అప్పటి నుంచి అవినాష్ విష‌యంలో జ‌గ‌న్ అసంతృప్తిగా ఉంటున్నారు. ఇక పులివెందుల‌లో కూడా టీడీపీ పుంజుకుంటుండటం జ‌గ‌న్‌కు న‌చ్చడం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో నేరుగా త‌న సోద‌రి ష‌ర్మిల‌ను ఇక్కడ నుంచి రంగంలోకి దింపాల‌ని నిర్ణయించుకున్నట్టు స‌మాచారం.

టీడీపీ విస్తృత ప్రచారం…..

ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన శ్రీనివాస‌రెడ్డి.. గ‌త కొంత‌కాలం కింద‌టే క‌డప వ్యాప్తంగా త‌న ప్రచారం ముమ్మరం చేశారు. అధికారికంగా త‌న పేరు ప్రక‌టించ‌క‌పోయినా.. అధినేత చంద్రబాబు ఆశీస్సులతో ఆయ‌న ఈ ప్రచారం ప్రారంభించార‌ని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఇక్కడ టీడీపీ ప‌వ‌నాలు బాగానే వీస్తున్నాయి. ఇక‌, ఇక్కడి రైతుల‌కు ప్రభుత్వం నీరు అందించ‌డం, గ‌తంలో ఎన్నడూ లేనివిధంగా తాగునీటి స‌మ‌స్యను ప‌రిష్కరించ‌డం.. గ‌త రెండు ద‌శాబ్దాల్లో చూస్తే టీడీపీ ఇక్కడ బాగా పుంజుకోవ‌డం త‌న‌కు లాభిస్తాయ‌ని శ్రీనివాస‌రెడ్డి చెబుతున్నారు. ఏది ఎలా ఉన్నప్పటికీ.. ఇక్కడ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీని ఢీకొట్టడం అంత సులువు కాదన్నది మాత్రం వాస్తవం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*