ఈసారి గుంటూరు “గోల్” కొట్టేదెవరు?

రాజ‌ధాని జిల్లా అయిన గుంటూరు జిల్లాలో సాధార‌ణ ఎన్నిక‌ల హీట్ స్టార్ట్ అయ్యింది. జిల్లాలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు మ‌రో 8 నెల‌ల స‌మ‌యం ఉన్నా అప్పుడే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల గెలుపు ఓట‌ములు ఎలా ఉంటాయి ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇప్పుడున్న వారిలో ఎవ‌రు గెలుస్తారు ? ఎవ‌రు అవుట్ అవుతారు ? అనే అంశంపై సామాన్యుడి నుంచి ఎన‌లిస్టుల వ‌ర‌కు ఎవ‌రి లెక్కలు వారు వేసుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలో 17 సీట్లలో టీడీపీ 12, వైసీపీ 5 గెలుచుకున్నాయి. వైసీపీ మంగ‌ళ‌గిరి సీటును కేవ‌లం 12 ఓట్లతో, మాచర్ల, బాపట్ల, గుంటూరు తూర్పు సీట్లను 3 వేల పైచిలుకు ఓట్లతోనే గెలుచుకుంది. ఒక్క న‌ర‌సారావుపేట‌లో మాత్రమే ఆ పార్టీకి 10 వేల మెజార్టీ వ‌చ్చింది.

మూడు ఎంపీ సీట్లు…..

ఇక జిల్లాలోని గుంటూరు, న‌ర‌సారావుపేట‌, బాప‌ట్ల మూడు ఎంపీ సీట్లూ టీడీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల‌తో పాటు జిల్లాలో పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం, సిట్టింగ్ ఎమ్మెల్యేల ప‌నితీరు, సామాన్య జ‌నాల చ‌ర్చల‌ను బ‌ట్టి చూస్తే జిల్లాలో ఈ సారి టీడీపీకి కాస్త ఎడ్జ్ క‌న‌ప‌డుతోన్నా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు సాగ‌నుంది. అధికార టీడీపీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ఖాయంగా క‌నిపిస్తోంది.

ప్రత్తిపాటికి ప్రత్యర్థి ఏరీ?

మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న చిల‌క‌లూరిపేట‌లో ఆయ‌నపై వ్యక్తిగ‌త ఆరోప‌ణలు ఎలా ఉన్నా ఆయ‌న చేసిన అభివృద్ది, నియోజ‌క‌వ‌ర్గంలో రెండు ద‌శాబ్దాలుగా ప్రజ‌ల‌కు ట‌చ్‌లో ఉండ‌డం క‌లిసి రానుంది. ఇక్కడ వైసీపీ క్యాండెట్ మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఇప్పటికే రెండుసార్లు ఓడి ఆర్థికంగా బాగా వీక్ అయిపోయారు. ఇక్కడ పుల్లారావు కు మొగ్గు స్పష్టంగా క‌న‌ప‌డుతోంది. వినుకొండ‌లో రెండుసార్లు గెలిచిన జిల్లా అధ్యక్షుడు జివి.ఆంజ‌నేయులుకు గ‌తంలో కంటే మెజార్టీ తగ్గినా గెలుపు ఆయ‌న‌దేనంటున్నారు. ఇక్కడ ఆయ‌న హ్యాట్రిక్ ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక గుర‌జాల‌లో య‌ర‌ప‌తినేని నియోజ‌క‌వ‌ర్గాన్ని తెగ చుట్టేయ‌డంతో పాటు అభివృద్ధి ప‌నులు, ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా చేతికి వ‌చ్చిన కాడ‌కు వ్యక్తిగ‌త సాయాలు విప‌రీతంగా చేస్తున్నారు. ఇక్క‌డ వైసీపీ అభ్యర్థి కాసు మ‌హేష్‌రెడ్డి జ‌నాల్లోకి చొచ్చుకు పోలేక‌పోవ‌డం, నాన్ లోక‌ల్ కావ‌డం మైన‌స్‌.

ధూళిపాళ్లకు గట్టి పోటీ…..

పొన్నూరులో ఐదుసార్లు గెలిచిన ధూళిపాళ్ల న‌రేంద్ర మెజార్టీ కాస్త అటూ ఇటూ అయినా చివ‌రి క్షణంలో అయినా గ‌ట్టెక్కేయ‌డం ఖాయం అని చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థి రావి వెంక‌ట‌ర‌మ‌ణ నుంచి ఈ సారి ఆయ‌న‌కు గ‌ట్టి పోటీ త‌ప్పదు. తాడికొండ‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రవ‌ణ్‌కుమార్ మీద చిన్నా చిత‌కా యాంటీ ఉన్నా వైసీపీ వీక్‌గా ఉండ‌డంతో పాటు రాజ‌ధాని నియోజ‌క‌వ‌ర్గం, టీడీపీకి కంచుకోట కావ‌డంతో ఇక్క‌డ ఆ పార్టీకే సానుకూల వాతావ‌ర‌ణం ఉంది. ప్రత్తిపాడులో టీడీపీ బ‌లంగా ఉన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు మీద వ్యతిరేక‌త ఉంది. క్యాండెట్ మారిస్తేనే ఇక్కడ టీడీపీ గ‌ట్టెక్కుతుంది.పెద‌కూర‌పాడులో రెండుసార్లు గెలిచిన కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్‌బాబుకు అభివృద్ధితో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన ప్రత్యర్థి లేక‌పోవ‌డం క‌లిసి రానుంది. ఇక్కడ వైసీపీకి ప‌ట్టు దొర‌క‌కుండా చేయ‌డంలో కొమ్మాల‌పాటి కొంత స‌క్సెస్ అవుతుంటే… కొంత వైసీపీ రాంగ్‌స్టెప్పులు కూడా ఆయ‌న‌కు క‌లిసి రానున్నాయి. ఇక్కడ వైసీపీ స‌మ‌న్వయ‌క‌ర్తగా ఉన్న కావ‌టి మ‌నోహ‌ర్‌నాయుడుది కొమ్మాల‌పాటికి పోటీ ఇచ్చే రేంజ్ కాదు.

నక్కాపై వ్యతిరేకత…….

ఇక వేమూరులో మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న చాలా స్వల్ప మెజార్టీతోనే గెలిచారు. ఈ సారి అక్కడ ఆయ‌న‌కు ఓ ప్రధాన సామాజిక‌వ‌ర్గంలో వ్యతిరేక‌త క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల నాటికి ఈ వివాదాలు స‌ర్దుకోక‌పోతే ఈ సారి ఆయ‌న గెలుపు అంత సులువు కాదు. ఇక తెనాలిలో మాజీ మంత్రి ఆల‌పాటి రాజా మీద క‌బ్జాలు, సెటిల్‌మెంట్ల ఆరోప‌ణ‌లు తీవ్రంగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌కు సానుభూతి బాగా ఉంది. అలాగే మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ వైసీపీలోకి వ‌స్తే రాజా ఓడినా ఆశ్చర్యపోన‌వ‌స‌రం లేదు. బాప‌ట్లలో గ‌త ఎన్నిక‌ల్లోనే కోన ర‌ఘుప‌తి అనేక సానుకూల‌త‌ల‌తో స్వల్ప ఓట్ల తేడాతో గ‌ట్టెక్కారు. ఈ సారి ఇక్కడ టీడీపీ నుంచి వేగేశ‌న న‌రేంద్ర వ‌ర్మ ప్రజ‌ల్లోకి విప‌రీతంగా చొచ్చుకుపోతున్నారు. చాలా రోజుల త‌ర్వాత బాప‌ట్ల టీడీపీలో తిరుగులేని జోష్ తీసుకురావ‌డంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. బాప‌ట్ల సీటు ఆయ‌న‌కు ఇస్తే ఈ సీటు చాలా రోజుల త‌ర్వాత టీడీపీ గెలిచే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.

మోపిదేవి యాక్టివ్ గా లేకపోవడంతో……

రేప‌ల్లెలో సిట్టింగ్ ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్రసాద్‌పై కాస్తో కూస్తో యాంటీ ఉన్నా ఇక్కడ మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ యాక్టివ్‌గా లేక‌పోవ‌డం, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాక ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కోల్పోయారు. ఇక్కడ అంబ‌టి రాంబాబు పేరు కూడా వైసీపీ నుంచి వినిపిస్తోంది. మంగ‌ళ‌గిరిలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ 12 ఓట్లతో ఓడింది. ఇక్కడ కొత్త క్యాండెట్‌ను రంగంలోకి దింపితే రాజ‌ధాని సానుకూల ప‌వ‌నాలు ఇక్కడ టీడీపీని గ‌ట్టెక్కించేలా ఉన్నాయి. అయితే అన్ని ఈక్వేష‌న్లు పాటించి మాత్రమే ఇక్కడ టీడీపీ క్యాండెట్ ఎంపిక జ‌ర‌గాల్సి ఉంది.

వైసీపీ ఇక్కడ గెలిచే ఛాన్స్…..

ఇక వైసీపీ మాచ‌ర్ల, న‌ర‌సారావుపేట‌, స‌త్తెన‌ప‌ల్లి, గుంటూరు తూర్పు సీట్లలో ముందంజ‌లో ఉంది. మాచ‌ర్లలో వైసీపీ ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డిని ఢీ కొట్టే బ‌ల‌మైన ప్రత్యర్థి టీడీపీలో లేడు. న‌ర‌సారావుపేట‌లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి మంచి పేరు ఉండ‌డంతో మ‌ళ్లీ ఆ పార్టీకి క‌లిసి రానుంది. ఇక స‌త్తెన‌ప‌ల్లిలో టీడీపీ సిట్టింగ్ స్పీక‌ర్ కోడెల‌తో పాటు ఆయ‌న కుమారుడిపై కావాల్సినంతగా ఉన్న యాంటీయే వైసీపీకి చాలా ప్లస్ కానుంది. గుంటూరు తూర్పులో ముస్తఫాకు వ్యక్తిగ‌తంగా ఉన్న ఇమేజ్ క‌లిసి రానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*