గోరంట్ల గూటిలో జగన్ బోణీ కొడతారా?

గోదావరి తీరంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రి. గోదావరి నీరు తాగడం వల్లో ఏమో కానీ ఇక్కడి ప్రజలు నిత్య చైతన్యవంతులు. బ్రిటిష్ హయాంలోనే రాజమహేంద్రి కి కోస్తా లోనే ప్రధాన విద్యా కేంద్రంగా మద్రాస్ తరువాత భాసిల్లేది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇక్కడి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పుట్టింది ఒంగోలు లో అయినా పెరిగింది న్యాయవాదిగా, రాజకీయ వేత్తగా రాణించింది రాజమహేంద్రి గడ్డపైనే. ఇక వితంతు వివాహాలు, మహిళా విద్యా వికాసం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త వీరేశలింగం ఈ పుణ్య భూమి నుంచే పోరాడారు. ఇక సినీ రంగంలో కూడా రాజమహేంద్రికి ప్రత్యేక స్థానం వుంది. రాష్ట్రంలోనే తొలి సినీ స్టూడియో సినిమా ధియేటర్ ఇక్కడే ప్రారంభం అయ్యాయి. హాస్యనటుడు రాజబాబు, జమున, జయప్రద, ఎస్వీరంగారావు వరకు నేటి ఆలీ వంటివారంతా ఇక్కడినుంచి వెండితెరను ఏలినవారే. గోదావరి అలలు వృధాగా సముద్రంవైపు జాలువారకుండా కాటన్ మహనీయుడు వాటిని ఒడిసిపట్టి ఆనకట్ట నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన నాటినుంచి రాజమహేంద్రి దానంతట అదే అభివృద్ధి చెందుతూ వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జాతిపిత బాపూజీ, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, అటల్ బిహారి వాజపేయి, ఎన్టీఆర్, వైఎస్సాఆర్, సోనియా గాంధీ, నుంచి రాహుల్ గాంధీ వరకు రాజమహేంద్రి ని ఇష్టపడ్డవారే. ఇదంతా చారిత్రక నేపధ్యం అయితే రాజకీయ నేపధ్యాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం…

కమ్యూనిస్ట్ ల కంచుకోట గా మొదలై …

రాజమహేంద్రి అసెంబ్లీ నియోజకవర్గం తొలినుంచి కమ్యూనిస్ట్ ల కంచుకోటగా భాసిల్లింది. ఇక్కడ నుంచి 1978 వరకు సిపిఐదే ఆధిపత్యం. చిట్టూరి ప్రభాకర చౌదరి ఎమ్యెల్యేగా కొనసాగేలా చేసింది. 1978 లో కాంగ్రెస్ అభ్యర్థి తటవర్తి సత్యవతి ప్రభాకర చౌదరి పై గెలుపుతో కాంగ్రెస్ పార్టీ తన హవా ప్రారంభించినా 1983 లో ఎన్టీఆర్ ప్రభంజనం ధాటికి 1989 లో ఎసివై రెడ్డి విజయం సాధించే వరకు బోణి కొట్టలేని పరిస్థితి నడిచింది. తిరిగి 1994 నుంచి 2004 వరకు దాదాపు పదేళ్ళపాటు టిడిపి ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొనసాగారు. 1983, 1985 లలో కూడా ఆయనే టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం 89 లో మాత్రం ఎసివై చేతిలో పరాజయం తిరిగి 94 – 99 లలో ఉండవల్లి అరుణ కుమార్ పై గెలుపుతో తన తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. 2004 – 2009 లలో వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మా ముందు టిడిపి నిలవలేక పోయింది. ఆ రెండు సార్లు గోరంట్ల కాంగ్రెస్ ఎమ్యెల్యే రౌతు సూర్య ప్రకాశరావు ముందు ఓటమి పాలయ్యారు. 2014 లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టిడిపి, బిజెపితో పొత్తు కారణంగా తమ పార్టీకి కంచుకోటగా భావించే రాజమహేంద్రి ని మిత్రపక్షానికి వదులుకుంది. ఆ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి బొమ్మన రాజ్ కుమార్ పై బిజెపి అభ్యర్థిగా నిలిచిన డాక్టర్ ఆకుల సత్యనారాయణ 26 వేల 377 ఓట్ల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు.

మారిన సీన్ …

గత ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా కొత్త రాష్ట్రంలో ఎన్నికల రణ క్షేత్రం నడిచింది. వైసిపి అన్ని పక్షాలను ఒంటరిగానే ఎదుర్కొని స్వల్ప తేడాతో అధికారానికి దూరం అయ్యింది. ఇప్పుడు 2019 ఎన్నికల రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. టిడిపి, బిజెపి ఒంటరిగానే తలపడనున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేయని జనసేన సైతం అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రి రాజకీయం రసకందాయంలో నడవనుంది. ఇప్పటికే వైసిపి నుంచి మాజీ ఎమ్యెల్యే రౌతు సూర్య ప్రకాశరావు పేరు దాదాపు ఖరారు అయ్యింది. అయితే ఏపీఐఐసీ మాజీ ఛైర్మెన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం సైతం వైసిపి టికెట్ కోసం తనప్రయత్నాలు తాను చేస్తున్నారు. బిజెపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఎంపీ సీట్ కు ట్రయల్స్ లో వున్నారు. టిడిపి నుంచి పోటీ తీవ్రంగానే వుంది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనకు అచొచ్చిన అర్బన్ వైపు దృష్టి పెట్టారు. ఆయన కాకపోతే గూడా ఛైర్మెన్ గన్ని కృష్ణ బిసి సామాజిక వర్గం నుంచి ఆదిరెడ్డి వాసు, చల్లా శంకర రావు, పేర్లు వినవస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ జనసేన నుంచి అత్తిలి సత్యనారాయణ ( అనుశ్రీ సత్యనారాయణ) అద్దేపల్లి శ్రీధర్ పోటీ పడుతున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో టాక్. వీరుకాక జనసేన టికెట్ కు స్థానిక కేబుల్ ఛానెల్ ఎండి పంతం కొండల రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో తన వ్యక్తిగత ఛరిష్మాతో టిడిపి నుంచి తన భార్య పంతం రజని ని మేయర్ గా గెలిపించిన కొండలరావు రాజమండ్రి అసెంబ్లీ నుంచి బరిలో దింపాలని జనసేన వ్యూహకర్తలు లెక్కలు వేస్తున్నారని అంటున్నారు.

ఇక్కడి విజయమే ….

రాజమహేంద్రి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడిన నాటినుంచి ఇక్కడ విజయం సాధించిన వారే రాష్ట్రంలో అధికార పీఠం ఎక్కుతున్నారన్న సెంటిమెంట్ వుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు రాజమహేంద్రి సీటు దక్కించుకునేందుకు తమదైన ఎత్తులు పై ఎత్తులు వేస్తూ విజయం సాధించేందుకు తమ అన్ని శక్తి యుక్తులను కేంద్రీకరిస్తున్నాయి. గత ఎన్నికల నుంచి ఎన్నడూ లేని విధంగా పూర్తి ధనప్రభావంతో రాజమహేంద్రి ఎన్నికలు నడిచాయి. అభ్యర్థి గుణగణాలతో పాటు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టే దమ్మున్న వారినే ఈసారి బరిలోకి దింపాలని ప్రధాన పార్టీలు దృష్టి సారించినట్లు అభ్యర్థుల ఎంపిక కు పరిశీలిస్తున్న పేర్లు చెప్పకనే చెబుతున్నాయి. మరి విజయ లక్ష్మి ఎవరిని వరిస్తుందో చూడాలి. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు తీవ్ర పోరాటం సాగిస్తున్న వైసిపి ఇక్కడ బోణి కొడితే తమ లక్ష్యం నెరవేర్చుకున్నట్లే మరి.

2 Comments on గోరంట్ల గూటిలో జగన్ బోణీ కొడతారా?

  1. 1972 లో బత్తుల మల్లిఖార్జునరావు@చంటి mla గా ఎన్నికయ్యారు.అంతకుముందు పోతులవీరభద్రరావు గారు ఒకసారి సరిచూడగలరు.

Leave a Reply

Your email address will not be published.


*