జగన్ ఎదుట మరో సవాల్…!

చంద్రబాబు అనుకున్నట్లే జరుగుతుంది. చెప్పినట్లే అవుతోంది. జూన్ మొదటి వారంలో వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారని చంద్రబాబు ఇటీవల తెలుగుదేశం పార్టీ కీలక నేతల సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి అందిన సమాచారం మేరకే చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావించారు. స్పీకర్ జూన్ మొదటి వారంలో వైసీపీ ఎంపీల రాజీనామా లేఖలను ఆమోదిస్తే ఉప ఎన్నికలు రావడం ఖాయమని చంద్రబాబు భావించారు. ఉప ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండాలని కూడా సూచించారు.

బాబు చెప్పినట్లుగానే…..

చంద్రబాబు చెప్పినట్లుగానే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ పార్లమెంటు సభ్యులతో మరోసారి మాట్లాడలని భావిస్తున్నారు. భావోద్వేగమైన అంశంపై రాజీనామా చేయడంతో సుమిత్రా మహాజన్ మరోసారి ఎంపీలతో మాట్లాడి వారు అంగీకరించకుంటే రాజీనామాలు ఆమోదించే అవకాశముంది. ఈ మేరకు స్పీకర్ సుమిత్రా మహాజన్ కార్యాలయం నుంచి వైసీపీ పార్లమెంటు సభ్యులకు పిలుపు వచ్చింది. ఈ నెల 29వ తేదీన తన కార్యాలయంలో కలవాల్సిందిగా స్పీకర్ కార్యాలయం రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలను కోరారు.

ఐదుగురి ఎంపీల రాజీనామా…..

ప్రత్యేక హోదా సాధనకోసం కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యుడు వరప్రసాద్, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 6వ తేదీన వీరు రాజీనామాలు చేసిన సంగతి తెలిసింది. ఆ తర్వాత ఆమరణ దీక్షకూ దిగారు. అయితే దాదాపు నెల గడిచిపోతున్నా వీరి రాజీనామాలు ఆమోదం కాకపోవడంపై తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తోంది.

స్పీకర్ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో….

తాజాగా స్పీకర్ కార్యాలయంనుంచి పిలుపు అందడంతో స్పీకర్ వీరి రాజీనామాలు ఆమోదించే అవకాశమున్నట్లు సమాచారం. వీరి రాజీనామాలు ఆమోదిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఐదు పార్లమెంటు స్థానాల్లో ఉప ఎన్నికలు ఖాయం. ఉప ఎన్నికల్లో మరోసారి ఏపీలో మినీ సంగ్రామం ఖచ్చితంగా ఉంటుంది. అధికార తెలుగుదేశం పార్టీ రాజీనామాల విషయాన్ని ముందుగానే ఊహించి కొంత ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ప్రత్యేక హోదా సెంటిమెంట్ కావడంతో ఉప ఎన్నికల్లోతమదే విజయమని వైసీపీ ధీమాగా ఉంది. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీ, టీడీపీలు మినీ సంగ్రామంలో తలపడపోతున్నాయి. మరోవైపు జనసేన ఈ పోటీలో దిగుతుందా? లేదా? అన్నది కూడా ఆసక్తికరమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*