జగన్ ను ఓడించాలంటే..వాళ్లిద్దరూ అవసరమా?

వైసీపీ అధినేత జగన్ ను అధికారంలోకి రానివ్వకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్ని మార్గాలూ అన్వేషిస్తున్నారు. ఒకవైపు బలమైన అభ్యర్థులను బరిలోకి దించడం…ప్రజసంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా ఎలక్షనీరింగ్ ను కూడా చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్లే కనపడుతోంది. జగన్ ను ఒంటరి చేసి తాను ఒంటరిగానే ఉండి ఓడించాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చడమే ప్రధాన ఉద్దేశ్యంగా కన్పిస్తోంది. ఇందుకోసం కొత్త ఎత్తుగడలను వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ గ్రాఫ్ పెరగడంతో…..

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో కొంత అనుకూలత ఏర్పడింది. ప్రభుత్వ వ్యతిరేకత, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి జగన్ విన్నింగ్ రేస్ లో ముందున్నారన్నది వాస్తవం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ పార్టీ జయకేతనం ఎగురవేయడం ఖాయమన్న వార్తలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు కూడా తనకు అందుతున్న నివేదికలతో కొంత ఆలోచనలో పడ్డారు. సిట్టింగ్ లను పెద్దసంఖ్యలో మార్చకుంటే ఇబ్బందులు తప్పవని గ్రహించారు. దీంతో ఈసారి కొందరు సిట్టింగ్ లకు సీట్లు దక్కే ఛాన్స్ లేదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

జగన్ ఓటు బ్యాంకు చీల్చేందుకు…..

అయితే వీటన్నింటితో పాటు చంద్రబాబు జాతీయ రాజకీయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. జగన్ పార్టీకి ముఖ్యంగా దళితులు అండగా ఉన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు జగన్ క్యాప్చర్ చేసేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడంతో దానికి ఆ ఓటు బ్యాంకు మళ్లే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ చేత ఒంటరిగా పోటీ చేయించి జగన్ ఓటు బ్యాంకు చీల్చాలని తొలుత చంద్రబాబు అనుకున్నా…అనుకున్న రీతిలో వాళ్లు చీల్చలేరేమోనన్న అనుమానం ఆయనలో ఎక్కడలో ఉంది. అందుకే కొత్త పద్ధతిలో వెళ్లాలన్నది బాబు వ్యూహంగా తెలుస్తోంది.

ఎస్పీ, బీఎస్పీ రంగంలోకి……

దళిత ఓట్లు చీల్చడానికి బీఎస్పీ అభ్యర్థులను కొన్ని కీలక నియోజకవర్గాల్లో దించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మాయావతి పార్టీకి సహజంగా దళితులు ఆకర్షితులవుతారు. ఏపీలోని దళిత ఓట్లు చీల్చేందుకు మాయావతి సహకారంతో కొందరు అభ్యర్థులను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించాలనుకుంటున్నారు. ఇందుకు పూర్తిగా ఆర్థిక సాయాన్ని అందించేందుకు కూడా వెనుకాడకూడదని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి ఆ నియోజకవర్గంలో కనీసం రెండు నుంచి మూడు వేలు ఓట్లు చీల్చినా అది జగన్ కు నష్టమేనన్నది బాబు అంచనా. అలాగే సమాజ్ వాదీ పార్టీకి చెందిన అభ్యర్థులు కూడా ఈసారి ఏపీ ఎన్నికల బరిలో ఉండే అవకాశముంది. కాపు రిజర్వేషన్లతో బీసీ వర్గాలు ముఖ్యంగా యాదవులు దూరమవుతారన్నది చంద్రబాబు భయం. ఆ ఓట్లు జగన్ కు టర్న్ అవ్వకుండా అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులను కొన్నిచోట్ల నిలిపి జగన్ పార్టీని ఓడించాలన్న ఉద్దేశ్యంతో బాబు ఉన్నారు. అవసరమైతే మాయావతి, అఖిలేష్ ల సభలను కూడా ఏర్పాటు చేసి ఓట్లలో చీలిక తెచ్చి మరోసారి అధికారంలోకి రావాలన్నది బాబు స్ట్రాటజీ. అంతేకాదు అనేకమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి బరిలో ఉండేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది. మరి ఈ స్ట్రాటజీ ఎంతవరకూ పనిచేస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*