జనసేన దెబ్బ జగన్ కేనా?

తూర్పు గోదావరి జిల్లాలో ఈసారి జనసేన పవన్ కల్యాణ్ రెండు ప్రధాన పార్టీలనూ దెబ్బకొట్టేలానే కన్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించకముందే ఆ జిల్లా నుంచి చేరికలు ఊపందుకున్నాయి. ఏ జిల్లాలో లేనంత జోష్ ఇక్కడ జనసేనలో కన్పిస్తోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ జిల్లాలోకి అడుగు పెట్టేముందే కొందరు కండువాలు కప్పేసుకుంటుండగా, మరికొందరు తాము ఉన్న పార్టీకి రాజీనామా చేసి పవర్ స్టార్ కోసం ఎదురు చూస్తున్నారు. తొలి నుంచి పవన్ ప్రభావం తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువగానే ఉంటుందని అందరూ భావిస్తున్నదే. అయితే ఇంతలా నేతలు జనసేనలో చేరిపోతారని ఎవరూ ఊహించలేదు. ఇటు టీడీపీ నుంచి, అటు వైసీపీ నుంచి కూడా జిల్లాలో కొందరు ముఖ్యనేతలను జనసేనకు వలస వెళ్లే అవకాశముంది.

బాబు అనుకున్నట్లు…..

తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద జిల్లా. మొత్తం 19 నియోజకవర్గాలున్న ఈ జిల్లాపై అన్ని పార్టీల దృష్టి ఉంటుంది. అందుకోసమే తొలి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఈసారి కూడా జిల్లాను కైవసం చేసుకోవచ్చని చంద్రబాబు భావించారు. కాని ఇప్పుడు సీన్ అలా లేదు. అధికార పార్టీపై జిల్లాలో తీవ్ర అసంతృప్తి బయలుదేరింది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. దీంతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబిస్తారో అంతుచిక్కకుండా ఉంది.

జగన్ పాదయాత్రతో……

ఇక వైసీపీ అధినేత జగన్ కూడా తూర్పు గోదావరి జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసమే ఇతర జిల్లాలకు భిన్నంగా ఈ జిల్లాలో పాదయాత్రను దాదాపు రెండు నెలల పాటు సాగించారు. రెండు నియోజకవర్గాలను మినహాయిస్తే మొత్తం 17 నియోజకవర్గాల్లో పాదయాత్ర వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు జగన్. ప్రభుత్వ వ్యతిరేకత ఈసారి తనకు ఈ జిల్లాలో కలసి వస్తుందని జగన్ భావించారు. అయితే కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటనపై కొంత వ్యతిరేకత రాగా, పవన్ పై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా కొంత డ్యామేజీ చేశాయి.

చేరికల జోరుతో…..

జగన్ పాదయాత్ర ముగిసిన తర్వాత జనసేనలోకి నేతల చేరికల జోరు పెరిగిందనే చెప్పాలి. వాస్తవానికి ఇక్కడ పవన్ అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తమకు సీట్లు దక్కవని భావించిన నేతలందరూ పోలోమంటూ పవన్ పార్టీలోకి చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ చేరికతో ప్రారంభమైనది ఇక ఆగేట్లు కన్పించడం లేదు. లెక్కకు మించిన నేతలు పార్టీలో చేరే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ లో సీనియర్ నేత, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంతం నానాజీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి జనసేనలో చేరుతున్నారు. సీనియర్ నేత కందుల దుర్గేష్ కూడా జనసేన కండువా కప్పుకున్నారు. వీరితో పాటు జ్యోతుల వెంకటేశ్వరరావు, అత్తిలి రామస్వామి, డాక్టర్ బోండా సూర్యారావు, చిక్కాల సుబ్బారావు వంటి ప్రముఖులు పార్టీలో చేరారు. ఇక రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులది కూడా జనసేన బాటేనని చెబుతున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వంగా గీత, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వంటి వారు జనసేనలోకి చేరేందుకు రెడీ అవుతున్నారు. అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సంపర మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి జనసేనలో చేరిపోయారు. వీరంతా తొలుత వైసీపీలో చేరాలని భావించారు. కాని అక్కడ కూడా ఫుల్ టైట్ కావడంతో జనసేనలో చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం మీద జగన్ కే జనసేన దెబ్బ ఎక్కువగా పడేటట్లు ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*