జగన్ లెక్కేసుకుని కొట్టారా …?

రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఏ ఇద్దరైనా…. మాట్లాడుకునే మాట ఇప్పుడు వైసిపి అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలపైనే. ముందు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు జగన్. ఆ తరువాత కాపులకు రిజర్వేషన్ పై హామీ ఇవ్వలేనని అది సుప్రీం ఇచ్చిన ఆదేశాల వల్ల కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున తాను చేసేస్తాను అని చెప్పి మోసం చేయలేనన్నారు జగన్. ఈ రెండు అంశాలపైనే అందరిలో చర్చ సాగుతుంది. అందులో మరీ ముఖ్యంగా కాపు రిజర్వేషన్ అంశంపై అటు సోషల్ మీడియా లో గట్టి చర్చలే నడుస్తున్నాయి. కులాల వారీగా పోస్ట్ లు వ్యాఖ్యలు పెరిగాయి. జగన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కొందరు అనుకూలంగా మరికొందరు గా విడిపోయారు.

అన్ని గమనించాకే చెప్పారా …?

జగన్ అన్ని లెక్కలు సరిచూసుకుని హాట్ కామెంట్స్ చేశారంటున్నారు చాలా మంది. ఆయన సెల్ఫ్ గోల్ తో పార్టీని ముంచేస్తారని కాపు సామాజిక వర్గం మరోపక్క తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేస్తుంది. మరోపక్క మరికొన్ని చర్చలు నడుస్తున్నాయి. ముద్రగడపై చంద్రబాబు అణచివేత ధోరణి అనుసరించారని గతంలో కాపు సామాజికవర్గం టిడిపిపై రగిలిపోయేది. కానీ దానికి ఆ వర్గం ఎలాంటి ప్రతీకార చర్యలకు ఏ మాత్రం దిగకుండా బాబు కట్టడి చేస్తూ రావడంతో ఆ ఉద్యమాన్ని విజయవంతంగా తెరవెనుకకు పంపించారు చంద్రబాబు.

వైసిపిలో మార్పుకి ఆ ఎన్నికలే కారణమా …?

వాస్తవానికి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపికి ఘోర పరాభవం తప్పదని చాలామంది అంచనాకు వచ్చారు. కాపు సామాజిక వర్గం అత్యధికంగా వుండే కాకినాడ లో తెలుగుదేశం మెజారిటీ కష్టమేనని ముద్రగడ ప్రభావం తీవ్రంగా పడుతుందని విశ్లేషణలు వచ్చాయి. తీరా ఫలితాలు వచ్చాకా టిడిపి కి అఖండ మెజారిటీని ఓటర్లు కట్టబెట్టారు. కాపు రిజర్వేషన్లకు ముద్రగడకు అనుకూలంగా ఉన్నా వైసిపికి ఘోరపరాభవం తప్పలేదు. ఇలాంటి లెక్కలు అన్ని సేకరించిన వైసిపి కాపుల అంశంలో స్పష్టత ఇచ్చేయాలని భావించినట్లు ఆ పార్టీ వర్గాల్లో టాక్. రాజకీయ పార్టీలు ఎలా విమర్శించినా జనంలో వాస్తవం ఏమిటి అన్నది నెమ్మదిగా అర్ధం చేసుకుంటారని వైసిపి లెక్కిస్తుంది. గోదావరి జిల్లాల్లో అన్ని సామాజిక వర్గాల్లో జగన్ లెక్క కరెక్టేనా? లేక సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? అన్న చర్చే నడుస్తుండటం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*