లోటస్ పాండ్ లో…బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లో….?

వైసీపీ అధినేత జగన్ నేడు సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు ఆయన ఉదయం పది గంటలకు రానున్నారు. ప్రతి శుక్రవారం జగన్ తనపై నమోదయి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ నిన్న సాయంత్రమే పాదయాత్రకు విరామం ప్రకటించి హైదరాబాద్ కు చేరుకున్నారు.

ముఖ్యనేతలతో సమావేశం……

జగన్ హైదరాబాద్ చేరుకునే సమయానికే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించారు. దీంతో జగన్ ఈరోజు ఉదయం పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పెట్టినట్లు సమాచారం. వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం పొందడంతో భవిష్యత్ కార్యాచరణపై జగన్ వారితో చర్చించనున్నారు. ఎంపీల చేత బస్సు యాత్ర చేయించాలా? లేక వివిధ జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలను ఏర్పాటు చేయాలా? అన్న దానిపై చర్చించనున్నారు.

కార్యాచరణను సిద్ధం చేయనున్న……

రాజీనామాలు చేసిన ఎంపీల కార్యాచరణను త్వరలోనే జగన్ నిర్ణయిస్తారని వైసీపీ నేత ఒకరు చెప్పారు. అయితే రెండు రోజుల్లో జగన్ తో ఎంపీలు భేటీకానున్నారని, ఈ భేటీలో పూర్తి స్థాయి కార్యాచరణను జగన్ సిద్ధం చేస్తారని అంటున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం రాజీనామాలు చేయడంతో పెద్దయెత్తున దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతి పొందేందుకు వ్యూహరచన చేస్తున్నారు. రాజీనామా చేసింది ఐదుగురు ఎంపీలైనా దాని ప్రభావం 37 నియోజకవర్గాల్లో తీవ్రంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. మొత్తం మీద జగన్ రాజీనామాల అంశాన్ని పెద్దయెత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*