వారికి జగన్ హ్యాండ్ ఇస్తారా…?

వైసీపీకి ఆది నుంచి అండ‌గా ఉంటూ వ‌స్తున్న నెల్లూరుకు చెందిన‌ మేక‌పాటి ఫ్యామిలీ.. ఇప్పుడు తీవ్ర అస‌హ‌నం, గంద‌ర గోళంలో చిక్కుకుంది. పార్టీలో త‌మ ప్ర‌భ త‌గ్గిపోతోంద‌ని, త‌మ‌కు జ‌గ‌న్ హ్యాండిచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నివారు అనుమాని స్తున్నారు. దీంతో ఇప్పుడు అనూహ్యంగా మేక‌పాటి ఫ్యామిలీలో విమ‌ర్శ‌ల గ‌ళాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. మేక‌పాటి ఫ్యామిలీకి వైసీపీతో ఎన‌లేని అనుబంధం ఉంది. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్‌లో వైఎస్ ఫ్యామిలీతో ఎన‌లేని బంధాన్ని పెన‌వేసుకున్న మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి..అనంత‌ర కాలంలో ఆయ‌న త‌న సోదరుడు బిడ్డ‌ల్నీ, త‌న బిడ్డ‌ల్నీ కూడా రాజ‌కీయాల్లోకి తెచ్చుకున్నారు. నెల్లూరులోని ఉద‌య‌గిరి, ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గాల‌ను గ‌ట్టిప‌ట్టున్న ప్రాంతాలుగా చేసుకున్నారు.

ఆనం చేరుతుండటంతో…..

ఇక‌, మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి.. నెల్లూరు ఎంపీగా చ‌క్రం తిప్పుతున్నారు. ఆయ‌న కుమారుడు గౌతంరెడ్డి ఆత్మ‌కూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డ వైసీపీలో మంది పెరుగుతున్న నేప‌థ్యంలో మ‌జ్జిగ ప‌ల్చ‌న అయిన‌ట్టుగా మేక‌పాటి వ‌ర్గానికి టికెట్లు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆ ఫ్యామిలీ రాజ‌కీయంగా పొగ‌లు సెగ‌లు క‌క్కుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి వైసీపీలో చేర‌డ‌మేన‌ని తెలుస్తోంది. అయితే, ఆనం చేరినంత మాత్రాన వైసీపీలో మేక‌పాటి ఫ్యామిలీకి ప్రాధాన్యం త‌గ్గుతుందా? అనే ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఆనంపై అసహనం….

నెల్లూరు పార్లమెంట్‌, ఆత్మకూరు, ఉదయగిరి అసెంబ్లీ స్థానాల నుంచి వైసీపీ అభ్యర్థులుగా మేక‌పాటి ఫ్యామిలీనే ఉంది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆనంకు కేటాయిస్తార‌ని, ఇప్ప‌టికే ఆయ‌న‌కు ఈమేరకు జ‌గ‌న్ ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో భేటీ అయిన సంద‌ర్భంగా హామీ ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గైతంరెడ్డికి సీటు ఇస్తారా ? ఇవ్వ‌రా ? అన్న‌ది ఓ సందేహ‌మైతే…ఆయ‌న్ను ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయిస్తార‌ని మ‌రో ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. దీంతో తీవ్ర అస‌హ‌నానికి గుర‌వుతున్న మేక‌పాటి ఫ్యామిలీ స‌భ్యులు.. అటు ఆనంపై తీవ్ర వ్య‌తిరేక ప్ర‌చారం ప్రారంభించారు.

ప్రచారం ఉధృతం…..

అదే స‌మ‌యంలో వైసీపీలోకి వారిని చేర్చుకుంటే.. ఇంత‌క‌న్నా దౌర్భాగ్యం మ‌రొక‌టి లేద‌నే రీతిలో.. గ‌తంలో ఆనం.. వైసీపీని అధినేత జ‌గ‌న్‌ను తిట్టిన తిట్ల‌న్నింటినీ ముద్రంచి మ‌రీ క‌ర‌ప‌త్రాల రూపంలో పంపుతున్నారు. అదేస‌మ‌యంలో తమను కాదని ఆ నియోజకవర్గాల్లో మరెవరికీ జగన్ టిక్కెట్‌ ఇవ్వరని ప్ర‌చారం చేస్తున్నారు. వైఎస్‌ మరణానంతరం వారి కుటుంబానికి అండగా నిలిచింది మేకపాటి ఫ్యామిలేన‌ని అంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామం.. మేక‌పాటి ఫ్యామిలీలోని అస‌హ‌నాన్ని.. స్ప‌ష్టం చేస్తోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*