జగన్ ఇందులో బాబుకంటే బాగా వీక్…!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రజలను ఆకట్టుకునే ఫీట్లు అనేకం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. జాతీయ స్థాయిలో తమకు బలం ఉందని చెప్పుకోవడానికి, తమ వైఖరికి ఇతర రాష్ట్రాలూ మద్దతు పలుకుతాయని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ చేసే ప్రయత్నాలు ఎవరూ చేయరు. ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ పూర్తిగా వెనకబడిపోయినట్లే చెప్పుకోవాలి. చంద్రబాబు ఢిల్లీ బయలుదేరుతున్నారంటే ముందుగానే అక్కడ అపాయింట్ మెంట్లు ఫిక్స్ అయిపోతాయి. మోడీ పార్టీతో కటీఫ్ చెప్పేశాక ఇది మరింత ఎక్కువయిందనే చెప్పాలి.

జాతీయ స్థాయిలో గుర్తింపుకు…..

ఇప్పుడు ఏపీలో ఏది చేసినా జాతీయ మీడియాను ఆకర్షించగలగాలి. అంతేకాదు ప్రజల్లోకి కూడా తాము చేస్తున్న కార్యక్రమాల్లో చిత్తశుద్ధి ఉందని వెళ్లాలి. అందుకే గత ఏడు రోజులుగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే టీడీపీ ఎంపీలతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు సీఎం రమేష్ కు సంఘీభావాన్ని ప్రకటించారు. కాని తాజాగా డీఎంకే నేత కనిమొళి సంఘీభావం తెలిపారు. ఏపీ విభజన హామీల అమలుకోసం తాము కూడా టీడీపీ పోరాటానికి మద్దతిస్తామని ఆమె ప్రకటించి వెళ్లిపోయారు.

నేతలను తెచ్చే బాధ్యత…..

ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే దానిని పొరుగు రాష్ట్రాలకు చెందిన నేతలను. నేషనల్ లీడర్స్ ను తీసుకొచ్చే బాధ్యతను తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి చూస్తారు. ఆయన గతకొన్నేళ్లుగా ఢిల్లీలోనే ఉంటూ ఈ పనులు చక్కబెడుతుంటారన్న టాక్ ఉంది. అందుకోసమే ఆయనకు ప్రభుత్వ పదవిని ఇచ్చారంటారు. ఇటీవల చంద్రబాబు విజయవాడలో ధర్మపోరాట దీక్షకు కూడా జాతీయ మీడియాను తీసుకువచ్చి జాతీయ స్థాయిలో బాబు దీక్షకు ప్రచారం కల్పించారు. ఇలా రాష్ట్రంలో ఏది జరిగినా నేతలను తీసుకొచ్చే బాధ్యతను ఆయనే తీసుకుంటారు.

వైసీపీని దెబ్బకొట్టడానికే…..

నిజానికి కనిమొళి స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావం ప్రకటిస్తే మంచిదే. కాని దీన్ని కూడా విపక్ష పార్టీని ఇరుకున పెట్టేందుకు అధికార పార్టీ ఇలాంటి వ్యూహరచనలు చేస్తుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. నిజానికి కడపలో సీఎం రమేష్ దీక్షపై వైసీపీ విమర్శలు చేస్తోంది. తమ దీక్షను కించపరుస్తున్న వైసీపీని దెబ్బకొట్టాలంటే ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను రప్పించడమే మార్గమని భావించిన ఆ పార్టీ కనిమొళిని రప్పించారన్న టాక్ కడపలో బాగా విన్పిస్తోంది. కనిమొళి లాంటి నేతలు వచ్చి స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతుంటే, సొంత జిల్లా నేత, ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఇక్కడకు రావడం లేదని, ఈ సమస్యపై ఆయన స్పందించడం లేదన్నది ప్రజల్లోకి పంపడానికే కనిమొళి లాంటి వారు వస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. చంద్రబాబుకు తెలిసిన జిమ్మిక్కులు జగన్ చేయలేరన్నది ఈ సంఘటనతో రుజువయిందంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*