జగనే ‘‘పవర్’’ ను ఆయనకందిస్తారా?

ఏ రోటికాడ ఆ పాటే పాడాల‌న్నారు పెద్ద‌లు! ఇది రాజ‌కీయాలైనా.. మ‌రేదైనా.. కూడా అంతే! కానీ, వైసీపీ అధినేత‌, ఆ పార్టీ నాయ‌కులు భావి సీఎంగా భావించే జ‌గ‌న్ మాత్రం ఒకింత త‌డ‌బ‌డుతున్నారు. ఇటీవ‌ల కాలంలో వ‌రుస పెట్టి ఆయ‌న వివాదాస్ప‌దం అవుతూ.. అధికార పార్టీకి వెళ్లాల్సిన వ్య‌తిరేక‌త‌ను త‌న‌వైపు తిప్పుకొంటున్నార‌ని అనిపిస్తోంది. ఒకే వారంలో రెండు ప‌రిణామాలు.. అందునా ఎన్నిక‌ల‌కు ముందు జ‌ర‌గ‌డం.. వైసీపీ శ్రేణుల్లోనే తీవ్ర క‌ల‌క‌లం ఆందోళ‌న క‌లిగిస్తున్నా యి. ఇక‌, జ‌గ‌న్ వ్య‌తిరేక ప్ర‌చారంలో ఆరితేరిన ఓ వ‌ర్గం మీడియా ఈ ప‌రిణామాల‌ను చంద్ర‌బాబుకు అనుకూలంగా మారుస్తుండ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తున్న విష‌యం. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రంలో కాపు సామాజిక వ‌ర్గానికి సంబంధించిన రిజ‌ర్వేష‌న్ అంశం పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

మూడేళ్ల నుంచి యుద్ధం చేస్తున్నా…..

దీనిపై వారు గ‌డిచిన మూడు సంవ‌త్స‌రాలుగా యుద్ధమే చేస్తున్నారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించి జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. చాలా సంవత్సరాల పాటు నాన్చి..నాన్చి…మంజునాథ కమిషన్ వేసి కూడా చాలా కాలం సాగదీశారు. చివర్లో కమిషన్ ఛైర్మన్ మంజునాథ లేకుండానే కేవలం కమిటీ సభ్యులతో ఓ తూతూమంత్రపు నివేదిక ఇప్పించేసి.. దాన్ని అసెంబ్లీలో పెట్టి ఓకే చేయించుకుని..బంతిని మోడీ కోర్టులోకి నెట్టేశారు. సహజంగా ఇఛ్చిన హామీని నిలబెట్టుకోవాలసిన బాధ్యత చంద్రబాబుపైనే ఉంటుంది. కాపుల‌కు ఏదైనా అన్యాయం జ‌రిగితే.. అది చంద్ర‌బాబు వ‌ల్ల‌నే అయి ఉండాలి.

ఆ వ్యతిరేకత జగన్ వైపు….

ప్ర‌స్తుతం ఈ ప‌రిణామాలే నిన్న మొన్న‌టి వ‌ర‌కు వినిపించాయి. కానీ.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఈ వ్య‌తిరేక‌త అంతా కూడా జ‌గ‌న్ పార్టీ వైపు మ‌ళ్లింది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇచ్చే అవ‌కాశం రాష్ట్ర‌ప‌రిధిలో లేక‌పోయినా.. ఇక్క‌డ తీర్మానం చేసి కేంద్రంతో చ‌ర్చించి.. 9వ షెడ్యూల్‌లో చేర్పించే బాధ్య‌త తీసుకుంటాన‌ని జ‌గ‌న్ చెప్పి ఉంటే .. కాపు సామాజిక వ‌ర్గం మొత్తం ఇప్పుడు జ‌గ‌న్ వైపు ఉండేది. అదేవిధంగా ఎలాగూ కిర్లంపూడి వెళ్లారు కాబ‌ట్టి కాపు వ‌ర్గం నేత‌ల‌తో చ‌ర్చించి వారిని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేసి ఉంటే.. రాజ‌కీయంగా జ‌గ‌న్ కు ప్ల‌స్ అయ్యేది. కానీ, కాపు వ‌ర్గం రిజ‌ర్వేష‌న్ త‌న చేతిలో లేద‌ని, తానేం చేయ‌లేన‌ని చెప్ప‌డం ద్వారా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వంటివారు నిన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుపై ఫైరయిన నేత‌లు ఇప్పుడు జ‌గ‌న్ వైపు బాణాల‌ను ఎక్కు పెట్టారు.

ముక్కుసూటిగా వెళుతూ….

ఇలాంటి ప‌రిణామాల‌ను త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగితేనే సీఎం పీఠం ద‌క్కుతుంద‌నేది జ‌గ‌న్‌కు చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, అనుకోని ఇబ్బందికర ప‌రిణామాలు ఆయ‌న‌ను తీవ్రంగా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. ముక్కుసూటిగా వెళ్లాల‌నుకోవ‌డం క‌రెక్టే కావొచ్చు. నిజాయితీగా ఉండ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. కానీ, లౌక్యం తెలియాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఏ రోటికాడ ఆ పాట పాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది ఆ దిశ‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రాన్ని జ‌గ‌న్ గుర్తించాలి. అప్పుడే విజ‌యం.. కైవ‌సం అయ్యేది!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*