జగన్ ను ఓడించాలంటే బాబు మార్గమిదేనా?

టీడీపీలో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లైంది. కీల‌క‌మైన 2019 ఎన్నిక‌ల‌కు తమ్ముళ్లు సిద్ధ‌మైపోతున్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఈ విష‌యంపై పార్టీ అధినేత, సీఎం చంద్ర‌బాబు దిశానిర్దేశం చేసిన విష‌యం తెలిసిందే! ఒక‌వైపు ఎమ్మెల్యేల‌పై కొన్ని నియోజ‌క‌వర్గాల్లో అసంతృప్తి, మ‌రోప‌క్క వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర దగ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో.. చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ప్ర‌ణాళిక‌లు అమలు చేయ‌బోతున్నారని తెలుస్తోంది. టిక్కెట్లు ఎవ‌రికి ఇవ్వాల‌నే అంశంలో.. ప‌లుమార్లు స‌ర్వేలు నిర్వ‌హించి కూడిక‌లు, తీసివేత‌ల అనంత‌రం ఒక జాబితా సిద్ధం చేశార‌ట‌. దీని ప్ర‌కారం ఇప్పుడు ముంద‌స్తుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. రిటైర్మెంట్ తీసుకుని వార‌సుల‌కు సీట్లు ఇవ్వాల‌ని కోరిన వారి అభ్య‌ర్థ‌న‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నార‌ట‌. మొత్తానికి తొలి ద‌శ‌లోనే 30 నుంచి 40 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

ఈసారి పంథా మార్చి……

ఎప్పుడూ అభ్య‌ర్థుల‌ను నామినేష‌న్ వేసే చివ‌రి రోజు రాత్రి ప్ర‌క‌టించే చంద్ర‌బాబు.. ఈసారి రూటు మార్చారు. ఈసారి ముంద‌స్తు వ్యూహాల‌ను అమ‌లు చేసేందుకు రెడీ అంటున్నారు. చివ‌ర్లో అసంతృప్తులు, ఇత‌ర వ్యవ‌హారాలు పార్టీ విజ‌యావ‌కాశాల‌ను దెబ్బ‌తీస్తుంద‌ని భావించిన ఆయ‌న‌.. ఇప్పుడు అభ్య‌ర్థుల‌ను ముందే ప్ర‌క‌టించ‌బోతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ముందస్తు ప్రకటనకు తొలి ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట ముందుగా అభ్యర్థిని గుర్తిస్తే వారు నియోజకవర్గంపై పట్టు సాధించడం తేలికని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్ఠానం ఇప్పటికే కొంత కసరత్తు చేసింది. వీటిలో మూడు విభాగాలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై స్పష్టత కూడా వచ్చింది.

నామినేషన్ల చివరి వరకూ…

అభ్య‌ర్థుల పేర్ల‌ను చివ‌ర్లో ప్ర‌క‌టించ‌డంతో చంద్ర‌బాబు చాలా ఎన్నిక‌ల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఓట‌మికి ప‌రోక్షంగా కార‌ణ‌మ‌య్యారు. 2009 ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం లాంటి జిల్లాల్లో చంద్ర‌బాబు ఇలాగే దెబ్బ‌తిన్నారు. ఆ ఎన్నిక‌ల్లో వైఎస్ ఓకే లిస్టులో 294 పేర్ల‌ను (మూడు మిన‌హా ) ప్ర‌క‌టిస్తే టీడీపీ ఎన్నిక‌ల నామినేష‌న్ల గ‌డువు వ‌ర‌కు కూడా అభ్య‌ర్థుల విష‌యంలో కుస్తీలు ప‌డుతూనే ఉంది. 2014లోనూ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదే సీన్ రిపీట్ అయ్యి కొన్ని చోట్ల ఓడిపోయింది. మంగ‌ళ‌గిరి లాంటి సీట్ల‌ను కేవ‌లం 12 ఓట్ల‌తోనే పోగొట్టుకుంది.ఇక లేటెస్ట్‌గా కొన్ని చోట్ల అభ్య‌ర్థుల పేర్లు ఖ‌రారైన‌ట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్‌ పోటీ చేయడం ఖాయమైంద‌ట‌. చిత్తూరు జిల్లా పీలేరులో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారైంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ముగ్గురు నేతలు బరిలో ఉన్నారు.

ఏకాభిప్రాయం కోసం…..

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి పోటీచేయ‌బోన‌ని చెప్ప‌డంతో అధిష్ఠానానికి ఒకట్రెండు ఆలోచనలు ఉన్నాయి. వాటిపై అరుణ అభిప్రాయం కూడా తీసుకోవాల‌ని భావిస్తున్న‌ారు. రాజాంలో పార్టీ అభ్యర్థిత్వం విషయంలో మంత్రి కళా వెంకట్రావు, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి మ‌ధ్య విభేదాలు తలెత్తాయి. ప్రతిభాభారతి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. కొత్త అభ్యర్థి అయితే మేలని కళా అనుకుంటున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ముగ్గురు నేతలు బ‌రిలో ఉండ‌టంతో ఏకాభిప్రాయం కోసం ప్ర‌యత్నిస్తున్నారు. మంగ‌ళ‌గిరి విష‌యంలోనూ కొంత త‌ర్జ‌న‌భ‌ర్జ‌న జ‌రుగుతోంది.

వారసులకు గ్యారంటీ…..

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎమ్మెల్యే గౌతు శ్యామ సుందర శివాజీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. తన కుమార్తె శిరీషకు అవకాశమివ్వాలని కోరారు. కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పోటీ చేయ‌డం అనుమానంగా ఉంది. తాను పోటీ నుంచి వైదొలిగితే తన కుమారుడు శ్యామ్‌కు టికెట్‌ ఇవ్వాలని ఆయన పార్టీ అధినేతను కోరారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి కూడా పోటీచేయ‌న‌ని ప్ర‌క‌టించేశారు. తన బదులు తన కుమారుడు అస్మిత్‌ రెడ్డి పోటీ చేస్తారని చెప్పేశారు. వీరి అభ్య‌ర్థ‌న‌ల‌కు చంద్ర‌బాబు ఓకే చెప్పేశారట‌. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన మాజీ మంత్రి, సీనియర్‌ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నుంచి ఈసారి పోటీ చేస్తారా లేదా అన్నది కూడా సస్పెన్స్‌గా ఉంది. ఈ టికెట్‌ను బొజ్జల కుమారుడు సుధీర్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ నాయుడు ఆశిస్తున్నారు. మ‌రి బాబు ముంద‌స్తు వ్యూహాలు ఎంత వ‌ర‌కూ ఫ‌లిస్తాయో!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*