జగన్ కు మొగుళ్లు కాదు…బాబుకు యముళ్లు…!

ఆ..మంత్రులు ఉన్నా లేనట్లే….జగన్ కు మొగుళ్లవుతారనుకుంటే…. తనకే చివరకు యముళ్లలా తయారయ్యారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడుతున్నారట. ఇది ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న చర్చ. మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న చంద్రబాబు వీరి తీరులో పెద్దగా మార్పు లేకపోయినా ఏమీ అనలేకపోతున్నారట. సొంత పార్టీ నుంచి ఎన్నికైన వారు కాకపోవడం, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో చంద్రబాబు వీరిపట్ల చూసీ చూడనట్లు వెళుతున్నారన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. వీరి తీరుతో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా, ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడుతుందన్న విషయాన్ని కొందరు సీనియర్లు బాబుకు పదే పదే గుర్తు చేస్తున్నారు.

మంత్రి వర్గ విస్తరణలో…..

పదహారు నెలల క్రితం చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. అందులో భాగంగా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. వైసీపీ గుర్తుపై గెలిచినా పార్టీకి రాజీనామా చేయకపోయినా చంద్రబాబు వారిపై నమ్మకముంచి, ఎవరేమనుకున్నా వారికి కేబినెట్లో చోటు కల్పించారు. రాయలసీమ నుంచి ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, అమర్ నాథ్ రెడ్డి, ఉత్తరాంధ్ర నుంచి సుజయ కృష్ణ రంగారావులకు స్థానం కల్పించారు. వీరిలో వారికి కేటాయించిన శాఖల్లో చక్కగా పనిచేస్తుంది ఒక్క అమర్ నాధ్ రెడ్డి మాత్రమేనన్నది పార్టీ నేతల అభిప్రాయం.

జగన్ పై విరుచుకుపడతారనుకుంటే…..

వైసీపీ అధినేత జగన్ పై విరుచుకుపడటానికి వీరు తురుపుముక్కల్లా ఉపయోగపడతారనుకున్నారు చంద్రబాబు. జగన్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వారు చేసే విమర్శలతో జగన్ తో మైండ్ గేమ్ ప్రారంభించవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. అయితే వీరిలో జగన్ పై విమర్శలు చేసేది కేవలం ఒక్కరే ఒకరు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ గుర్తు మీద గెలిచిన ఆదినారాయణరెడ్డి మినహా మిగిలిన ముగ్గురూ జగన్ పై పెద్దగా విమర్శలు చేయడం లేదు. మంత్రి సుజయకృష్ణ రంగారావు అయితే జగన్ పై ఏనాడూ విమర్శలు చేయలేదు. మంత్రి అఖిలప్రియదీ అదే దారి. ఆదినారాయణరెడ్డి ఒక్కరే తరచూ జగన్ పై విరుచుకుపడుతూ కొంత వార్తల్లో నిలుస్తున్నారు.

శాఖాపరంగా కూడా…..

ఇక శాఖాపరంగా చూసినా అమర్ నాధ్ రెడ్డి ఒక్కరే కొద్దిగా బెటరంటున్నారు. సచివాలయానికి రాకుండా, సమీక్షలు నిర్వహించకుండా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఉంటున్న మంత్రులు సుజయకృష్ణ రంగరావు, భూమా అఖిలప్రియలపై చంద్రబాబు అసహనం వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి సుజయకృష్ణ రంగారావు గనుల శాఖను నిర్వహిస్తున్నారు. ఆయన ఎన్నడూ సమీక్షలు జరిపిన దాఖలాలు లేవు. ఇటీవల కర్నూలు జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తూ దాదాపు 9 మంది మృతికి కారణమైన సంఘటనపైనా మంత్రి స్పందన అంతంత మాత్రమే. ఇక పడవ ప్రమాదాలు జరుగుతున్నా మంత్రి అఖిలప్రియకు శాఖపై పట్టు ఇంకా దొరకలేదు. మంత్రి ఆదినారాయణరెడ్డికి మార్కెటింగ్, గిడ్డంగులు, పశు, మత్స్యశాఖలున్నా దానిపై ఆయన గ్రిప్ సంపాదించింది లేదంటున్నారు. ఇలా ప్రతిపక్ష పార్టీ నుంచి తీసుకుని ఏదో విరగబొడుస్తారనుకుంటే….తమకు ఏమాత్రం ప్రయోజనం లేదన్నది పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం. చంద్రబాబు కూడా వారిపట్ట చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటాన్ని కొందరు తప్పుపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*