అదే రోజు…జగన్ మైండ్ బ్లాంక్ చేయడానికేనా?

అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీలు రెండు నువ్వొకటయితే నేనొకటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బలమున్న నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు రెండు పార్టీలూ సిద్ధమయ్యాయి. నేతల చేరికల వల్ల లాభనష్టాలను పక్కనపెడితే వారి చేరికతో కొంత ఇమేజ్ పెరుగుతుందన్నది వాస్తవమే. మంచి పట్టున్న లీడర్ పార్టీ కండువా కప్పుకోగానే ఆ జిల్లాలో కొంత ప్రభావం చూపే అవకాశముందన్నది కాదనలేని వాస్తవం. అయితే ఒకరు పార్టీ నుంచి వెళ్లిపోతే మరొకరిని చేర్చుకుంటూ రాజకీయాలను వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు హీటెక్కిస్తున్నారు.

ఆనం చేరికతో……

నెల్లూరు జిల్లా నేత ఆనం రామనారాయణరెడ్డి వచ్చే నెల 2వ తేదీన వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు. వైఎస్ కు సన్నిహితుడిగా పేరుపొందిన ఆనం వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంపార్టీలో చేరారు. నాలుగేళ్ల పాటు వెయిట్ చేసి అక్కడ ఇమడ లేక వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. నిజంగా ఇది తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లాలో దెబ్బే. ఆనం చేరికతో వైసీపీ మరింత బలపడుతుందన్నది వాస్తవం. సెప్టంబరు 2వ తేదీన వైసీపీలో చేరాలని ఆనం నిర్ణయించుకోవడంతో అందుకు అనుగుణంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అదే రోజు మరో బలమైన నేతను పార్టీలోకి చేర్చుకని జగన్ మైండ్ బ్లాంక్ చేయాలని అనుకుంటున్నారు.

చేరికలో లేవని…..

సెప్టంబరు 2వ తేదీన శ్రీకాకుళం జిల్లా నేత కొండ్రు మురళిని పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరికలు లేక వెలవెల బోతోంది. మూడు నెలల వరకూ చేరికలతో ఆ పార్టీ ఇమేజ్ బాగున్నా ప్రత్యేక హోదా నినాదాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిన జగన్ పాదయాత్రతో జనంలోకి వెళ్లారు. దీంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. చిన్నా చితకా లీడర్లు తప్పించి చెప్పుకోతగ్గ నేతలెవ్వరూ చేరలేదు. కర్నూలు ఎంపీ బుట్టారేణుక, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి చేరికతో ఆగిపోయాయి.

ఆనం చేరే రోజే కొండ్రు కూడా…..

దీంతో పార్టీ ఇమేజ్ ను కొంత పెంచేందుకు సీనియర్ నేతలను చంద్రబాబు ఆహ్వానిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండ్రుమురళి పార్టీ చేరికకు కూడా సెప్టంబరు 2వ తేదీనే ముహూర్తంగా నిర్ణయించారు. కొండ్రుమురళి కూడా వైఎస్ కు ఆత్మీయుడే. రాజాం నియోజకవర్గంలో ప్రతిభా భారతికి వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు కొండ్రును పార్టీలోకి తీసుకువస్తున్నారు. దీంతో ప్రతిభాభారతి గమ్యం ఎటువైపు అనేది తేలాల్సి ఉంది. మొత్తం మీద ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నేతల చేరికల కోసం రెండు పార్టీలు రెడ్ కార్పెట్ పరిచాయనే చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*