బాబు బాటలోనే జగన్ …?

ముల్లును ముల్లుతోనే తీయాలి. టిడిపి ని దెబ్బకొట్టాలంటే ఆ పార్టీ రూట్ లోనే పోవాలి అన్న సూత్రాన్ని ఇప్పుడు జగన్ ఆచరిస్తున్నారు. గత ఎన్నికల్లో అధికారం కోసం చంద్రబాబు చేసిన ప్రయత్నాలన్నీ జగన్ చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. చంద్రబాబు బాటలో వైసిపి అధినేత జగన్ అడుగులు పడుతున్నాయా …? అనే ప్రశ్నకు అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత ఎన్నికల ముందు చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర లో జరిగిన విధంగానే వైసిపి చీఫ్ జగన్ కార్యక్రమాలు నడుస్తున్నాయంటున్నారు. కులాల వారీగా అన్ని వర్గాలపై వరాల జల్లు కురిపించారు చంద్రబాబు. కాపులను బిసిల్లో చేరుస్తామని వెయ్యికోట్ల రూపాయల ప్రత్యేక నిధితో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు బాబు. అదే విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ను 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తామని పేదబ్రాహ్మణులను ఆదుకుంటామని హామీనిచ్చారు. ఇక మత్సకారులను ఎస్సీల్లో చేరుస్తామని తలో ఒక కులం పై హామీల వర్షం కురిపించారు. చాలా హామీలను ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచారు కూడా.

జగన్ కూడా కులాల వారీగా …

వైఎస్ జగన్ ఇప్పుడు తన పాదయాత్రలో అదే పని చేస్తున్నారు. పూర్తి ఓటు బ్యాంక్ రాజకీయాలకే ఆయన పెద్ద పీట వేస్తున్నారు. ప్రతి ప్రధాన కుల సభ్యులతో సమావేశాలు, సభలు చర్చలు నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు పరిష్కారానికి తనదైన శైలిలో హామీలు ఇస్తున్నారు. బిసి డిక్లరేషన్, మైనారిటీల సదస్సు, బ్రాహ్మణ సదస్సులతో జగన్ వేస్తున్న పొలిటికల్ అడుగులకు అధికార పార్టీలో గుబులు మొదలైంది. వైసిపి సదస్సులన్నీ కూడా సూపర్ హిట్ కావడంతో అధికారపక్షంలో టెన్షన్ తీవ్రం అయ్యింది.

వైసిపి కి కౌంటర్ ఎటాక్ ….

వీటికి కౌంటర్ గా ఇప్పటికే బాబు కొన్ని సదస్సులు నిర్వహించగా మరికొన్ని సైతం శరవేగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు సైతం మైనారిటీ సదస్సు నిర్వహించారు. అదే విధంగా తమ పార్టీకి అండగా వుంటూ వస్తున్న బిసి సామాజిక వర్గం లో కొందరు వైసిపి వైపు చూస్తున్నట్లు సమాచారం ఉండటంతో బిసి ల సదస్సులు పలు చోట్ల ప్లాన్ చేశారు. వైసిపి కి ప్రధాన ఓటు బ్యాంక్ లుగా వున్న మైనారిటీ దళిత వర్గాలను తమవైపు లాక్కుంటూనే బిసి ఓటు బ్యాంక్ కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇలా అధికార విపక్షాలు కుల రాజకీయ సమీకరణలతో ఏపీలో పొలిటికల్ హీట్ ను తారాస్థాయికి చేర్చాయి.