జగన్ చిక్కుకుపోయారా…?

ప్రజలలోకి వెళుతూ మంచి స్పందనను రాబడుతున్న జగన్ ను రాజకీయబంధనంలో ఇరికించేందుకు తెలుగుదేశం పార్టీ అన్ని పాచికలను బయటికి తీస్తోంది. 2014లో అమలు చేసిన వ్యూహాల తరహాలోనే ఈ విడత కూడా అమలు చేయబోతోంది. 2019లో వైసీపీ అధికారంలోకి రాకుండా నిలువరించడమే లక్ష్యంగా త్రిముఖ పోరాటం దిశలో టీడీపీ పథకరచన చేస్తోంది. సంకల్ప యాత్రతో ప్రజలకు చేరువ అవుతున్న జగన్ ను దూరం చేయడమనే అంశం పైనే దృష్టి పెడుతున్నారు. 2003, 2012-13లలో వైఎస్, చంద్రబాబులకు పాదయాత్రలు బాగా కలిసొచ్చాయి. అధికారానికి బాటలు పరిచాయి. జనాదరణ కలిగిన జగన్ కూడా అదే పంథాను ఎంచుకోవడంతో టీడీపీలో గుబులు పుడుతోంది. సగానికి పైగా జిల్లాలను ఆయన చుట్టుముట్టేశారు. పాదయాత్ర సాగుతున్న తూర్పుగోదావరితో కలిపి ఇక నాలుగు జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పాదయాత్ర పూర్తయిన తొమ్మిదిజిల్లాల నుంచి టీడీపీ అధిష్టానం పాదయాత్ర ప్రతిస్పందనలపై రిపోర్టులు తెప్పించుకుంది. పాజిటివ్ గా ప్రజలు స్పందించినట్లుగా తేలింది. దీంతో టీడీపీ అధిష్టానం కొంత ఆందోళనకు గురవుతోంది. దీనికి ప్రతివ్యూహం సిద్ధం చేస్తున్నారు. మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్న ప్రజల నుంచే వ్యతిరేకత ప్రబలే విధంగా పక్కా ప్లాన్ చేస్తున్నారు.

2019 రీ టెక్నిక్…

2014లో టీడీపీ ఎన్నికలకు వెళ్లేందుకు చాలా కసరత్తు చేసింది. చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పటికే రెండు వరస పరాజయాలతో క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతిని ఉంది. రాష్ట్ర విభజన , సమైక్యాంధ్ర అంశాల్లో క్లియర్ కట్ స్టాండ్ తీసుకోకుండా రెండు కళ్ల సిద్దాంతం పాటించాల్సి వచ్చింది. దీనివల్ల అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలలో ఎవరూ టీడీపీని పూర్తిగా విశ్వసించలేని స్థితి నెలకొంది. రాష్ట్ర విభజన జరగడంతోనే మొత్తం పొలిటికల్ పిక్చర్ మారిపోయింది. సమైక్యాంద్ర ఉద్యమం ప్రాధాన్యం కోల్పోయింది. భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న చుట్టూనే ఆంధ్రా, తెలంగాణ రాజకీయాలు నడిచాయి. తెలంగాణ లో రాష్ట్రసాధనకు కీలకంగా మారిన టీఆర్ఎస్ కు పట్టం గట్టారు. సెంటిమెంటు ఫలిస్తుందేమోననే ఉద్దేశంతో వైసీపీ సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకుంది. కానీ అప్పటికే విభజన పూర్తి కావడంతో నినాదానికి సందర్భ శుద్ధి లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు బీజేపీ, జనసేనలను కూడగట్టి ఒక సంఘటిత శక్తిగా ముందుకు వచ్చారు. ఇక ఎన్నికల హామీల సంగతి సరేసరి. కొత్త రాష్ట్రానికి అనుభవంతో కూడిన నాయకత్వం, కేంద్ర సహకారం అవసరమనే అంశం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. దీంతో ఓటర్లలో బాగా స్వింగ్ కనిపించింది. ఒకవైపు బలమైన కూటమి గట్టడానికి తోడు అన్యాయమైన పోయిన రాష్ట్రానికి చంద్రబాబు మాత్రమే న్యాయం చేయగలడన్న విశ్వాసం ప్రజల్లో ఏర్పడింది. కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వమే వస్తోంది కాబట్టి టీడీపీకి ఓటు వేయాలన్న నినాదానికి ఏపీ ప్రజలు సానుకూలంగా స్పందించారు. ఈ గేమ్ లో పావులను సరిగా గుర్తించక వైసీపీ నష్టపోయింది. కూటమి, అభివృద్ధి అవసరాలు టీడీపీ గెలుపునకు దోహదం చేశాయి. 2019లో దీనికి పూర్తిగా రివర్స్ గేమ్ ఆడబోతోంది. తాను ఒంటరిగానే బరిలో నిలుస్తోంది. కానీ తన సర్కారుకు వ్యతిరేకంగా కూటమి పోటీ పడకుండా చేసుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయేలా టీడీపీ కాలు కదుపుతోంది. జనసేన, బీజేపీ, వైసీపీలు ఎన్నికలలో కలిసి పోటీ చేయకుండా ఎదురుదాడి మొదలు పెట్టింది. బీజేపీ , జనసేన, వైసీపీ, కాంగ్రెసు నాలుగు పార్టీలు విడివిడిగా పోటీ చేసేలా చూసుకుంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తాము గట్టెక్కగలమని టీడీపీ భావిస్తోంది.

జగన్ తో జట్టు కట్టిస్తున్నారు…

వ్యూహాత్మక తప్పిదాలు చేయడంలో వైసీపీని మించిన పార్టీ ఉండదు. 2014లో చివరిక్షణంలో అధికారం చేజారింది. బీజేపీ ముందుకు వచ్చినా దాంతో చేయి కలపడానికి సాహసించలేదు. అప్పట్లో బీజేపీకి, మోడీకి దేశమంతటా బ్రహ్మరథం పట్టారు. ఏపీలోనూ ఆ ప్రభావం కనిపించింది. దానిని ఎన్ క్యాష్ చేసుకోకుండా ఏటికి ఎదురీది దెబ్బతిన్నారు. అదే సమయంలో గాలివాటం తెలుసుకుని టీడీపీ చక్కగా అధికార తీరం చేరిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే తరహా వైసీపీ తప్పు చేసేలా కనిపిస్తోంది. తాజాగా ఏపీలో బీజేపీ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది. కమలం పార్టీని వదిలించుకున్న టీడీపీ చేయాల్సినంత యాగీ చేసింది. విలన్ నంబర్ ఒన్ గా బీజేపీని ప్రజల్లో ప్రొజెక్టు చేసింది. దీనిని గమనించకుండా, పట్టించుకోకుండా బీజేపీతో తమ సాన్నిహిత్యాన్ని పదే పదే వైసీపీ ప్రదర్శించుకొంటోంది. ఇది 2019 ఎన్నికల్లో ప్రతికూలంగా మారేలా టీడీపీ పావులు కదుపుతోంది. వైసీపీ, బీజేపీ ఒకటే జట్టు అన్నట్లుగా ప్రజల్లోకి తీసుకెళుతోంది. వైసీపీ కి అండదండగా ఉన్న మైనారిటీల మద్దతులో చీలిక తెచ్చేందుకు ఎత్తుగడలు వేస్తోంది. అధికారికంగా కేబినెట్ హోదా కలిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ రాజేంద్రనాథరెడ్డి వంటివారు బీజేపీ అగ్రనాయకులను కలవడం విమర్శలకు తావిస్తోంది.

వైసీపీకి నష్టమేనా?

రాం మాధవ్, అమిత్ షా వంటివారు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పటిష్టానికి చాలా ప్లానులు వేస్తున్నారు. ఒకవేళ బీజేపీకి ఆ అవకాశం లేకపోతే వైసీపీకి సహకరించడం ద్వారా టీడీపీని నాశనం చేయాలని చూస్తున్నారు. రాజేంద్రనాథరెడ్డి, రాంమాధవ్ ల కలయిక ఈ దిశలో పడిన తొలి అడుగుగా టీడీపీ ప్రచారం మొదలు పెట్టింది. వైసీపీ, బీజేపీ కలిపి తనపై, రాష్ట్రంపై కుట్ర చేస్తున్నాయంటూ చంద్రబాబునాయుడు ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిజానికి పార్టీలకు అతీతంగా వివిధ సందర్బాల్లో రాజకీయ నాయకుల కలయిక పెద్ద విషయమేమీ కాదు. కానీ సందర్బం మాత్రం ప్రశ్నార్థకమవుతోంది. దీనిని టీడీపీ చక్కగా ఉపయోగించుకుంటోంది. బీజేపీ, వైసీపీలను ఒకేగాటన కట్టేస్తే వైసీపీకి ఏపీలో నష్టం వాటిల్లుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మాల కులస్తులు అధికంగా ఉన్నారు. వారు ఎస్పీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. గతంలో మాదిగలకురిజర్వేషన్ల విషయంలో మద్దతు పలికిన చంద్రబాబు మౌనం వహించడంలోని అర్థమిదే. కానీ వైసీపీలో నంబర్ టు గా చెప్పుకునే విజయసాయి రెడ్డి టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులను కలిశారు. ఆయన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు గట్టి మద్దతు దారు. దీనివల్ల ఆంధ్ర ప్రాంతంలో మాలల మద్దతు వైసీపీ కోల్పేయ ప్రమాదం తలెత్తుతోంది. తిరుమల వివాదాన్ని పెద్దగా చేయబోయి వైసీపీ చేతులు కాల్చుకుంది. ‘దీని వెనక కూడా బీజేపీ ఉంది. వైసీపీ ని అడ్డుపెట్టుకుని కమలంపార్టీ ఆడిస్తోంద’న్న ప్రచారానికి టీడీపీ తెర తీస్తోంది. నిజానికి కేంద్రం తనను చక్రబంధంలో ఇరికించబోతోందని చంద్రబాబు చెబుతున్నారు. వాస్తవంలో వైసీపీని ప్రజలకు దూరం చేసేందుకు అవసరమైన సైకలాజికల్, స్ట్రాటజిక్ వ్యూహంతో టీడీపీ ముందస్తు కసరత్తు చేస్తోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*