మేలుకో…జగన్…మేలుకో …!

తెలంగాణలో టిడిపి కాంగ్రెస్ పొత్తు పొడిచి ఫలిస్తే ఏపీకి అదే ఫార్ములా చంద్రబాబు అమలు చేస్తారని సీనియర్ తమ్ముళ్ళు భావిస్తున్నారు. అదే జరిగితే వైసిపికి ఏపీలో గట్టి దెబ్బే తగులుతుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ ఆధిపత్యానికి టిడిపి, కాంగ్రెస్ లు గండికొడితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటే ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుంది అనే స్లోగన్ హస్తం, సైకిల్ ప్రారంభిస్తాయని అదే వ్యూహంతో ముందుకు వెళతారని లెక్కలు వేస్తున్నారు. తెలంగాణాలో లీడర్ లు లేని క్యాడర్ మిగిలిన టిడిపికి బలంగా వున్న కాంగ్రెస్ తోడైతే ఇద్దరికి ప్రయోజనమే. అయితే ఇది ఎంతవరకు సాకారం అవుతుందన్న అనుమానాలు ఇరు పార్టీల్లో వున్నాయి. టిడిపి, కాంగ్రెస్ వ్యూహాన్ని గులాబీ పార్టీ నిశితంగా గమనిస్తుంది. ఈ భిన్నధృవాలు కలిసి ఎన్నికలకు వెళితే అనుసరించాలిసిన వ్యూహాన్ని టీఆర్ఎష్ రచిస్తోంది.

లీడర్ లు కలిసినా … క్యాడర్లు కలుస్తాయా …?

కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై నిర్మితమై మూడు దశాబ్దాలకు పైగా ఉప్పు నిప్పులా వ్యవహరించిన టిడిపి తన బద్ధశత్రువుతో చెయ్యి కలపడం ప్రస్తుత అవసరాల రీత్యా సరైన చర్యే. అయితే కాంగ్రెస్ అంటే నరనరాన వ్యతిరేకత నిండిన తెలుగు తమ్ముళ్ళు ఈ దోస్తీపై మనస్ఫూర్తిగా కింది స్థాయిలో పనిచేసేది అనుమానమే. అదే విధంగా కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు ఓటింగ్ సమయానికి టిడిపి కి హ్యాండ్ ఇచ్చేస్తారన్న అనుమానాలు ప్రబలుతున్నాయి. దాంతో టిడిపి, కాంగ్రెస్ ల పొత్తు తెలంగాణ లో ఏ మేరకు విజయవంతం అవుతుందన్న లెక్కలే ఏపీలో ఇరు పార్టీల పొత్తు పొడుపులకు బాటలు వేస్తుంది.

మంత్రులనుంచి కింది స్థాయి వరకు …

ఇప్పటికే మంత్రులు అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణ మూర్తి వంటివారు బాహాటంగానే ఈ ప్రతిపాదనలపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. అందుకే చంద్రబాబు ముందుగా తెలంగాణ వరకు ఈ పొత్తు పరిమితం చేసి ఎపి క్యాడర్ ను ఇప్పటినుంచి మానసికంగా సిద్ధం చేసే పనిలో బిజీగా వున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు వుండరన్న దానికి తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో టిడిపికి, ఏపీలో కాంగ్రెస్ కి పొత్తుల అవసరం బాగా వుంది. అదే సూత్రం ఇరు పార్టీల చెట్టాపట్టాలకు ప్రధానమైంది.