వద్దంటే …సీటు…వెంటపడుతున్నారే…!!

పార్లమెంట్ సభ్యుడంటే ఆషామాషీ పదవి కాదు. దేశానికి దిశా నిర్దేశం చేసే అత్యున్నత చట్ట సభలో కూర్చుని చట్టాలు చేస్తే అరుదైన అవకాశం. ఛాన్స్ ఇస్తే ఎవరైనా డిల్లీ సభకే పోవాలనుకుంటారు. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం గల్లీ పాలిటిక్స్ నే ఇష్టపడుతున్నారు. ఉంటే అసెంబ్లీలో ఉండాలి. మంత్రి పదవి పట్టేయాలి. హపీగా ఇక్కడే పాలిటిక్స్ చేసుకుంటూ సాగిపోవాలి. ఇదీ మన నేతల ఆలోచన. కానీ అధినాయకులు మాత్రం వదిలేలా లేరు.

ఈసారి ఈ పార్టీ నుంచి….

విజయనగరం జిల్లా బొబ్బిలి వంశానికి చెందిన బేబీ నాయనను వచ్చే ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేయించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాదాపుగా నిర్ణయించినట్లు భోగట్టా. బొబ్బిలికి చెందిన మంత్రి సుజయక్రిష్ణ రంగారావు సోదరుడే బేబీ నాయన. ఇద్దరు సోదరులు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేశారు. అప్పట్లో బొబ్బిలి ఎమ్మెల్యేగా రంగారావు గెలవగా, బేబీ నాయన విజయనగరం ఎంపీ సీటుకు పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి పూసపాటి అశోక్ గజపతి రాజు చేతిలో భారీ తేడాతో ఓటమిపాలు అయ్యారు. ఇపుడు అశోక్ పక్కనే ఉంటూ టీడీపీ రాజకీయాల్లో బొబ్బిలి సోదరులు బిజీగా ఉన్నారు.

బొత్స వైపు జగన్ చూపు….

చీపురుపల్లి నుంచి వైసీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేసి జగన్ మంత్రివర్గంలో మంత్రి కావాలని బొత్స సత్యనారాయణ ఆలోచన చేస్తున్నారు. ఆయన ఇప్పటికే తన మనసులోని మాటను జగన్ కి చెప్పేశారు కూడా. జగన్ మాత్రం చీపురుపల్లి అసెంబ్లీ సీటుపై ఎటువంటి హామీ ఇవ్వలేదు. పైగా బొత్సను డిల్లీకి పంపాలని చూస్తున్నారు. బొత్స ఎంపీ క్యాండిడేట్ అయితే లోక్ సభ సీటుతో పాటు, ఆ పరిధిలోని ఎమ్మెల్యే సీట్లను కూడా సులువుగా గెలుచుకోవచ్చునని జగన్ ప్లాన్ వేస్తున్నారు.

వద్దు అంటున్న నేతలు….

రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా అటు బొబ్బిలి రాజు బేబీ నాయన, ఇటు బొత్స సత్యనారాయణ ఒక విషయంలో మాత్రం ఒక్కటిగా ఉన్నారు. లోక్ సభకు పోటీ చేసేందుకు ఇద్దరు నేతలూ విమిఖంగా ఉన్నారు. చంద్రబాబు ఎంపీ సీటుకు పోటీ చేయమన్నపుడు బేబీ నాయన మౌనం వహించారని సమాచారం. బొత్స జగన్ తో చనువు వల్ల చేయలేనని ఎదుటే చెప్పారని అంటున్నారు. అయితే హై కమాండే ఫైనల్ కాబట్టి ఈ ఇద్దరినీ నిలబెట్టడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే బొబ్బిలి రాజుల‌తో వ్యక్తిగతంగా బొత్స తలపడాల్సి వస్తుంది. విజేతలెవరో కూడా తేలిపోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*