జగన్ కు సరైనోడు ఇతడేనా?

జగన్ యాత్రకు తూర్పు గోదావరి జిల్లాలో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో తెలుగుదేశం నేతలు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకూ జగన్ ఎనిమిది జిల్లాల్లో పర్యటించారు. ఎక్కడా జగన్ పాదయాత్ర, ఆయన చేస్తున్న విమర్శలపై లోకల్ నేతలు స్పందించడం చాలా తక్కువగానే చూశాం. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ పాదయాత్ర సాగింది. ఇందులో ఎక్కువగా గుంటూరు జిల్లా నుంచి స్థానిక నేతలపై జగన్ విమర్శలు చేయడం ప్రారంభించారు. ఎక్కువగా ఇసుకమాఫియా, కాంట్రాక్టుల్లో ఎమ్మెల్యేల భాగస్వామ్యపైనే ఆయన ఆరోపణలు సంధించారు. అయినా ఈ ఆరోపణలపై ఒకరూ ఇద్దరూ తప్ప పెద్దగా జగన్ విమర్శలకు స్పందించలేదు.

తూర్పు పర్యటనలో…..

తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం జగన్ విమర్శలను తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రంగంలోకి దిగారు. తూర్పు గోదావరి జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించడమే అద్భుతంగా జరిగింది. వేలాది మంది కార్యకర్తలతో వారధి ఊగిపోవడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు. అయితే జగన్ తూర్పు జిల్లాలోకి ప్రవేశించగానే తొలుత పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీ మోహన్, మంత్రి జవహర్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేశ్ పేర్లను ప్రత్యేకంగా జగన్ ప్రస్తావించారు. ఇసుక మాఫియాకు ఈ నలుగురే నాయకులంటూ తీవ్రస్థాయిలో జగన్ ధ్వజమెత్తారు. చినబాబుకు, పెదబాబుకు వాటాలిస్తూ అడ్డంగా ఈ నలుగురు దోచుకుంటున్నారని విమర్శించారు.

గోరంట్ల ఊరుకుంటారా?

అయితే గోరంట్ల మాత్రం జగన్ విమర్శలను తిప్పికొడుతున్నారు. అసెంబ్లీలో మాదిరిగానే గోరంట్ల జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. పరిటాల రవిని హత్య చేయించింది జగన్ అని గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి హత్య కోసం జగన్ అత్యాధునికమైన ఆయుధాలను తెప్పించారని గోరంట్ల ఆరోపించారు. మైనింగ్ మాఫియాను అడ్డుకుంటున్నారనే పరిటాల రవిని జగన్ హత్య చేయించారన్నారు. హత్యారాజకీయాలు జగన్ కు వారసత్వంగా వచ్చాయన్న గోరంట్ల, పరిటాల రవి హత్య విషయం ఎత్తితే అసెంబ్లీ నుంచి జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు బుచ్చయ్య చౌదరి. రాజమండ్రిలో వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. బీజేపీకి జగన్ మానసపుత్రుడయ్యాడని సెటైర్ వేశారు.

బుచ్చన్నపై మండిపాటు…..

కాని బుచ్చయ్య వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండి పడుతున్నారు. రాజమండ్రిలో వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతుంటే అధికారంలో ఉన్న బుచ్చయ్య చౌదరి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాజమండ్రిలో జరుగుతున్న ప్రతి భూదందా వెనక టీడీపీ నేతలే ఉన్నారన్న విషయాన్ని బుచ్చయ్య గుర్తు చేసుకోవాలన్నారు. అధికారంలో ఉన్న వారు దీనిపై దర్యాప్తు చేసి భూ కబ్జాలకు పాల్పడుతున్న నిందితులను దమ్ముంటే అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. పరిటాల రవి హత్య కేసు విషయంలో బుచ్చయ్య ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*